‘పేట’ను బీజేపీకి ఇవ్వొద్దు

7 Apr, 2014 02:16 IST|Sakshi
 నరసన్నపేట, న్యూస్‌లైన్ :నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని టీడీపీ అధిష్టానం బీజేపీకి కేటాయించడంపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భగ్గుమన్నారు. ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థే పోటీ చేసేలా అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఆయన నిర్ణయం మారని పక్షంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి బగ్గు రమణమూర్తిని కోరారు. నరసన్నపేటను బీజేపీకి కేటాయించారని తెలిసి నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆదివారం రాత్రి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. నాలుగు మండలాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలు పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అవసరమైతే ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేయాలని బగ్గు రమణమూర్తిని డిమాండ్ చేశారు. తామంతా విరాళాలు సేకరించి మరీ గెలిపించుకుంటామని ప్రకటించారు. అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చి నరసన్నపేట నియోజకవర్గం టీడీపీ జాబితాలోనే ఉంచేలా.. బగ్గు రమణమూర్తికే టికెట్ వచ్చేలా చూడాలని జిల్లా పార్టీ నేతలను డిమాండ్ చేశారు. ఈ విషయమై కింజరాపు అచ్చెన్నాయుడుతో చర్చించాలని సమావేశంలో నిర్ణయించారు.
 
 టీడీపీలోనే కొనసాగుతా.. 
 సమావేశంలో పాల్గొన్న బగ్గు రమణమూర్తి ఉద్వేగంతో ప్రసంగించారు. బీజేపీతో పార్టీ పొత్తు పెట్టుకున్న కారణంగా తనకు టికెట్ రావడం లేదన్న ఆవేదన కంటే ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం నెరవేరడం లేదని బాధగా ఉందని చెప్పారు. పార్టీలోనే కొనసాగుతానని పేర్కొన్నారు. నరసన్నపేట నియోజకవర్గం పొత్తు జాబితాలో చేరేలా జిల్లాకు చెందిన కొందరు నాయకుల పలుకుబడి ఉపయోగించారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ నేతలు గొద్దు చిట్టిబాబు, చింతు పాపారావు, తమ్మినేని భూషణరావు, బెవర రాము, శిమ్మ చంద్రశేఖరరావు, బోయిన సతీష్, వారణాశి మురళీ తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు