ప్రత్యర్థే.. గెలవాలి!

7 Apr, 2014 23:28 IST|Sakshi
ప్రత్యర్థే.. గెలవాలి!

గెస్ట్‌కాలమ్: మహేశ్ పేరి: కీలక నేతల విజయం కోసం ప్రధాన పార్టీల వ్యూహాత్మక సహకారం పరస్పరారోపణలు, ఆవేశపూరిత సవాళ్లను పక్కన బెడితే.. ప్రత్యర్థి పార్టీకి చెందిన ముఖ్యమైన నేతలపై బలమైన అభ్యర్థిని నిలిపే విషయంలో మాత్రం జాతీయ ప్రధాన పార్టీలు రెండూ ఒకే రకంగా పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళ్తుంటాయి. ఇదో సంప్రదాయంలా మారినట్లు కనిపిస్తోంది. ముఖ్యమైన నేతలు ఓడిపోకుండా పార్టీలన్నీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటాయి. అదెలాగో చూద్దాం..
 
 బీజేపీ తరఫున లక్నో నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ పోటీ చేస్తున్నారు. నిజానికి ఇక్కడినుంచి బీజేపీ సీనియర్ నేత లాల్జీ టాండన్ బరిలో దిగాల్సి ఉంది. కానీ అనూహ్యంగా రాజ్‌నాథ్ తెరపైకి వచ్చారు. సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేయాలన్న ఉద్దేశంతో గత సంవత్సరన్నరగా అశోక్ బాజ్‌పేయి అనే వ్యక్తి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. టికెట్ ఖాయమని ఎస్పీ నుంచి ఆయనకు హామీ కూడా వచ్చింది. పైగా అశోక్ బాజ్‌పేయి ములాయంకు చాలా దగ్గరి వ్యక్తి. రాజ్‌నాథ్‌ను లక్నో నుంచి పోటీలో దింపాలని నిర్ణయించుకున్న వెంటనే బీజేపీ, ఎస్పీల మధ్య తెరవెనక మంతనాలు ప్రారంభమయ్యాయి. ఫలితంగా గెలిచే అవకాశాలున్న అశోక్ బాజ్‌పేయిని పోటీ నుంచి తప్పిం చారు. ఆయనకు బదులుగా అభిషేక్ మిశ్రా అనే బలహీన అభ్యర్థిని ఎస్పీ బరిలోకి దింపింది. దాంతో రాజ్‌నాథ్‌కు గట్టి పోటీ తప్పింది.
 
 ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సొంత నియోజకవర్గం. అక్కడి నుంచి సోనియాకు పోటీగా బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతిని నిలపాలంటూ బాబా రామ్‌దేవ్ సూచించారు. ఉమాభారతి కూడా పోటీకి సిద్ధమయ్యారు. అయితే, బలిపశువు కావాలని ఆమె కోరుకోలేదు. అందువల్ల రాయ్‌బరేలీతో పాటు తనకు పట్టున్న మధ్యప్రదేశ్‌లోని ఝాన్సీ స్థానం నుంచి కూడా పోటీచేసేందుకు తనకు అవకాశమివ్వాలని కోరారు. అయితే, బీజేపీ ప్రణాళిక వేరే ఉంది. సోనియాకు వ్యతిరేకంగా బలమైన అభ్యర్థిని నిలిపే ఉద్దేశం ఆ పార్టీకి లేదు. ఆ రెండు పార్టీల మధ్య అదో అలిఖిత ఒప్పందం. సమాజ్‌వాదీ పార్టీకి అయితే సోనియాకు వ్యతిరేకంగా అభ్యర్థిని నిలిపే ఆలోచన కూడా లేదు. దాంతో సోనియా గెలుపు నల్లేరుపై నడకే అయే పరిస్థితి నెలకొంది.
 
 ఇప్పుడు అందరి దృష్టి యూపీలోని వారణాసి నియోజకవర్గం పైనే ఉంది. కారణం అక్కడినుంచి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ బరిలో ఉన్నారు. ప్రధాని అభ్యర్థి ఓటమి పాలవ్వడం అవమానకరం. అందువల్ల అక్కడ మోడీ గెలవడం బీజేపీకి జీవన్మరణ పోరాటం. కానీ అనూహ్యంగా ఆమ్‌ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ రూపంలో మోడీకి బలమైన ప్రత్యర్థి ఎదురయ్యాడు. సాధారణంగా మోడీ, రాహుల్‌గాంధీ లాంటి నేతలు బరిలో ఉంటే.. ఓట్లు వారికి అనుకూలంగానో, లేక వ్యతిరేకంగానో పడతాయి. వారు ఓటర్లను అనుకూలంగానో, లేక వ్యతిరేకంగానో ఏకీకృతం చేస్తారు. వారణాసిలోనూ అదే పరిస్థితి ఉంది. దాన్ని అనుకూలంగా తీసుకున బీజేపీ వ్యూహకర్తలు రంగంలోకి దిగి సమాజ్‌వాదీ పార్టీతో చర్చలు జరిపారు. ఫలితంగా సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ వారణాసి బరిలో ఒక బలమైన అభ్యర్థిని పోటీకి పెట్టారు. దాంతో మోడీ వ్యతిరేక ఓట్లు చీలిపోయి మోడీ సునాయాసంగా గెలిచేస్తారు.
 
 అమేథీలోనూ అదే వ్యూహం. అక్కడ కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీపై ఆమ్‌ఆద్మీ పార్టీ తరఫున కుమార్ విశ్వాస్ పోటీ చేస్తున్నారు. రాహుల్‌గాంధీకి కూడా మోడీలాగానే.. నియోజకవర్గంలో అనుకూల లేదా వ్యతిరేక ఓట్లు మాత్రమే ఉంటాయి. తాజాగా బీజేపీ తమ అభ్యర్థిగా స్మృతి ఇరానీని ప్రకటించింది. దాంతో రాహుల్‌గాంధీ వ్యతిరేక ఓట్లు స్మృతి ఇరానీ, కుమార్ విశ్వాస్‌ల మధ్య చీలిపోతాయి. రాహుల్ గెలుస్తాడు. ఇప్పటికే బీజేపీ యువనేత వరుణ్ గాంధీ.. తన సోదరుడైన రాహుల్‌గాంధీ అమేథీని అద్భుతంగా అభివృద్ధి చేశాడని ప్రశంసించి బీజేపీ ఉద్దేశాలను చెప్పకనే చెప్పేశాడు.
 
 మొత్తంమీద అర్థమయ్యేదేంటంటే.. గత పదేళ్ల యూపీఏ దోపిడీ కారణంగా ఆ ప్రభుత్వంలోని కీలక నేతలంతా ఓటమి పాలవ్వాల్సి ఉండగా.. బీజేపీ సహకారంతో వారంతా అనూహ్యంగా మళ్లీ గెలిచి లోక్‌సభలో అడుగుపెడ్తారు. ప్రతిఫలంగా తమ నేతల గెలుపును బీజేపీ అందుకుంటుంది.
 రచయిత, రాజకీయ విశ్లేషకులు,
 కెరీర్‌‌స 360 సంస్థ చైర్మన్

Read latest Elections-2014 News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా