నవ్యాంధ్ర వికాసం

1 May, 2014 01:39 IST|Sakshi
నవ్యాంధ్ర వికాసం

యువనాయకత్వంతోనే

జగన్‌పైనే యువత ఆశలు
వైఎస్ పథకాలన్నీ మళ్లీ గాడిన పడతాయన్న నమ్మకం
బాబు పాలన వద్దంటున్న జనం

 
 సీమాంధ్ర ప్రజల మనోభావాలకు విరుద్ధంగా అవమానకరరీతిలో రాష్ట్రం ముక్కలైన తరుణంలో జరుగుతున్న ఈ ఎన్నికలు ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. నూతన రాష్ట్ర వికాసం ఎవరి వల్ల సాధ్యం.. ఏ పార్టీకి పట్టం కడితే తమ జీవితాల్లో మళ్లీ వెలుగులు విరబూస్తాయి.. ఏ నాయకుడికి తోడుంటే తమ కష్టాలు తీరతాయి అన్నవాటిపైనే ఆలోచిస్తున్నారు. వైఎస్ సువర్ణయుగంతో పాటు నవ్యాంధ్ర వికాసం యువనేతతోనే సాధ్యమని వారు విశ్వసిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, కాకినాడ రూరల్, అనపర్తి, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల్లో ‘సాక్షి ప్రత్యేక ప్రతినిధి’ రోడ్‌షో నిర్వహించారు. ప్రజల మనోగతం వారి మాటల్లోనే....
 
ఆదివారం ఉదయం కాకినాడ జగన్నాథపురం వంతెన వద్ద నుంచి ‘సాక్షి  రోడ్ షో’ మొదలైంది. అంబేద్కర్ సెంటర్‌లోని టాక్సీ స్టాండ్‌లో ఉన్న కారు డ్రైవర్లు, ఓనర్లను ప్రస్తుత రాజకీయాలపై ప్రశ్నించగా కొందరు అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు.  వారిలో పందిరి రాజు, ఒక్కిబట్ల శ్రీను మాత్రం జగనే రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రం ముక్కలైన తరువాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో వచ్చే సీఎం సమర్ధుడు కావాలని, ఆ సత్తా ఉన్న జగన్‌మోహన్ రెడ్డికే తాము మద్దతిస్తామని మరో డ్రైవర్ కె. సత్యనారాయణ  స్పష్టం చేశారు. అక్కడ నుండి సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామానికి వెళ్లాం.  అక్కడ మార్కెట్‌లో ఉన్న సత్తి బాబు, పెంకె గోపి, ఆదినారాయణ, రాయుడులతో మాట్లాడగా తాము టీడీపీవైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలిపారు. గ్రామంలో సైకిల్‌పై  తిరుగుతూ కల్లు విక్రయిస్తున్న రమణను పలకరించగా, ‘తనకు రాజకీయాల గురించి తెలియదని తమ కులపోళ్లు ఎటు చెప్తే అటే ఉంటాననన్నాడు. ఈ సారి వాళ్లు ఫ్యాన్‌కు మద్దతివ్వాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.

 అక్కడి నుంచి పెదపూడి మండలం రామేశ్వరం పై కొత్తూరు గ్రామానికి చేరుకున్నాము. ఊళ్లో రోడ్డు పక్కన రైతు చల్లపు రాంబాబుతో మాట్లాడగా తాను జగన్‌కే మద్దతిస్తున్నట్లు తెలిపాడు. అక్కడ నుంచి రామేశ్వరం గ్రామానికి చేరుకున్నాం. అక్కడ మార్కెట్‌లో రైతు తొండిపూడి వీరభద్ర రాజును కదిలిస్తే తాను వైఎస్ బిడ్డకే మద్దతిస్తానన్నాడు. వైఎస్ హయాంలో రైతులకు భరోసా ఉండేదని తెలిపాడు. ఆ కృతజ్ఞత తనకుందన్నాడు.  ఆ తర్వాత అచ్యుతాపురం వెళ్లి గ్రామంలో తాపీ పని చేస్తున్న యువకుడు శ్రీనుతో మాట్లాడగా రాష్ట్రంలో చిన్నవయస్సులో పార్టీ పెట్టి చరిత్ర సృష్టించిన జగన్ వెంటే ఉంటానన్నాడు. గ్రామ చివర ఉన్న దళిత వాడ లో మహిళలతో మాట్లాడగా తమ వాడల్లోకి ఇంతవరకు నాయకులెవరూ రాలేదని.. షర్మిలమ్మ పాదయాత్ర చేస్తూ అక్కడికి వచ్చి తమతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడిందన్నారు. జగనన్న అధికారంలోకి వస్తే మీ కష్టాలు తీరతాయని భరోసా ఇచ్చిందన్నారు. అందుకే ఈ సారి జగన్‌ను గెలిపించుకునేందుకు తాము నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి వేట్లపాలెం వైపు బయలు దేరాం. పొలంలో ఉన్న మార్నె బుచ్చయ్య చౌదరి, మార్నె వెంక ట్రావు, మాడ శివసత్య బాబులతో మాట కలపగా రైతులందరూ వైఎస్ బిడ్డకే మద్దతిస్తారన్నారు. కాస్త ముందుకెళ్లి రైతులు శివరామకృష్ణ, నరసింహారావు, ధర్మారావులతో మాట్లాడగా.. ‘చంద్రబాబు పాలన భయానకమని.. మళ్లీ ఆ రోజులు మా కొద్దు...కలలో కూడా ఊహించని రోజులవి’..అన్నారు.

 అక్కడ నుండి వేట్లపాలెం గ్రామానికి వెళ్లాం. వెంకటరాజు, వీర్రాజులుతో మాట్లాడగా  విడిపోయిన రాష్ట్రం బాగుపడాలన్నా, పేదల బతుకుల్లో వెలుగులు రావాలన్నా జగన్ అధికారంలోకి రావాలన్నారు. జగన్ కొత్తగా ఏమీ చేయనక్కర లేదని, వాళ్ల నాన్న పథకాలు సరిగ్గా అమలు చేస్తే చాలన్నారు. అక్కడ నుంచి సామర్లకోటకు చేరుకున్నాం.  అక్కడ రైల్వే స్టేషన్ ఎదుట ఆటో డ్రైవర్లతో మాట్లాడగా రాష్ట్రం ముక్కలైనా ఎవరూ పట్టించుకోనందుననోటా బటన్ నొక్కి వచ్చేస్తానని.. రాజు అనే డ్రైవర్ అన్నాడు. అక్కడి నుంచి కోదండరామపురం గ్రామం వచ్చాం. అక్కడ చెరుకు రసం అమ్మే నాయుడు మాట్లాడుతూ ఇప్పుడు అంతా జగన్ గాలి వీస్తుందన్నాడు. అదే గ్రామానికి చెందిన ఇక్కుర్తి సాంబశివరావు, కొండిశెట్టి సోమేశ్వరరావు, జనార్ధన్ మాట్లాడుతూ రాష్ట్రానికి జగన్ తప్ప ప్రత్యామ్నాయం లేదన్నారు. అక్కడ నుంచి జల్లూరు గ్రామానికి వచ్చాం అక్కడ  హోటల్లో కూర్చున్న పదిమందిలో ఆరుగురు జగన్ సీఎం కావాలని కోరుకున్నారు. అక్కడ నుంచి ఫకృద్ధీన్‌పాలెం వెళ్లి షేక్ ఖాజావలితో మాట కలిపితే...  వైఎస్సార్ అంటే మైనారిటీలకు మాత్రం నాలుగు శాతం రిజర్వేషన్లు గుర్తుకువస్తాయన్నారు.. అక్కడి నుంచి పిఠాపురం చేరుకున్నాం

 పిఠాపురం ఆలయానికి వచ్చిన అనంత పద్మనాభశాస్త్రితో మాట్లాడగా, పూజారులకు గౌరవ వేతనం పెరిగింది వైఎస్ హయంలోనేనని... ధూపదీప నైవేద్యాలకు నోచని గుడులకు ఆయన ఆసరాగా నిలిచారన్నారు. వాళ్లబ్బాయి అధికారంలోకి వస్తే బ్రాహ్మణులకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. రాపర్తి గ్రామంలో ఎలక్ట్రీషియన్ శ్రీనివాసుతో మాట్లాడగా, కొత్త వాళ్లకు మద్దతివ్వడం గోదావరి జిల్లాలకు అలవాటేనని ఈసారి జగన్‌కు మద్దతిస్తున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి చిత్రాడకు వెళ్లి సామ్రాజ్యం, జ్యోతి, కస్తూరి, రత్నకుమారిలతో మాట్లాడగా.. వైఎస్ కొడుకుపై కాంగ్రెస్ కుట్రలను ప్రజలకు తెలియజేసేందుకు బయటికి వచ్చిన విజయమ్మ తన భర్త ఆశయ సాధనకు ముందుకు సాగుతున్నారన్నారు. జగన్ సోదరి షర్మిల పాదయాత్రతో స్త్రీ శక్తిని లోకానికి చాటిందన్నారు. ఆ కుటుంబం అధికారంలోకి రావాల న్నారు.  పండూరు గ్రామంలో రైతులను కదిలిస్తే రైతులెవరూ బాబును నమ్మరన్నారు. బాబు పాలనలో తమ జిల్లాలో కూడా కరువు వచ్చిందని.. వ్యవసాయం కష్టమైపోయిందన్నారు. ఆరోజులను ఎప్పటికీ మర్చిపోలేమని కట్టా మల్లికార్జునరావు, కావూరి సత్యనారాయణ అన్నారు. మరో రైతు నరసింహం.. మాట్లాడుతూ జగన్  వాళ్ల నాన్నలా చేస్తారనే అనుకుంటున్నాం. ఈసారికి ఆయనకే మద్దతిస్తాం... అని స్పష్టం చేశారు.
 
 వైఎస్  కార్డుతోనే ఇలా ఉన్నా..


 నేను జగన్ కే మద్దతిస్తా... వాళ్ల నాన్న ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డుతోనే నేను ఈ రోజు నడవగలుగుతున్నా. నా నడుము పడిపోతే కాకినాడ పెద్దాస్పత్రిలో వైఎస్ ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డుతో ఉచితంగా    ఆపరేషన్ చేయించారు. ఆయన బిడ్డకు మద్దతిచ్చి రుణం తీర్చుకుంటా.
 
- నాగమణి, మాధవ పట్నం
 

మరిన్ని వార్తలు