యువహో.. యంగ్ ఏపీ

21 Mar, 2014 04:30 IST|Sakshi
యువహో.. యంగ్ ఏపీ

బి.గణేశ్‌బాబు:  ఇప్పటిదాకా మత రాజకీయాలు విన్నాం. ధన రాజకీయాలు చూశాం. కుల, వర్గ, ప్రాంతీయ రాజకీయాలనూ పరికించాం. కానీ ఇకపై యువ రాజకీయాలు చూడబోతున్నాం. ఎందుకంటే దేశంలోని మొత్తం ఓటర్లలో 47 శాతం మంది 18-35 ఏళ్ల లోపు యువ ఓటర్లే. ఈసారి దాదాపు 15 కోట్ల మంది యువతీ యువకులు కొత్తగా ఓటర్లుగా నమోదైనట్టు ఒక అంచనా. 2014లో వారు ఎవరి వైపు మొగ్గితే వారిదే విజయం. ప్రస్తుతం దేశంలో ప్రతి మూడో ఓటరూ 30 ఏళ్ల లోపు వ్యక్తే. మరో ఏడేళ్లలో దేశంలో జనాభా సగటు వయసు 29 ఏళ్లకు చేరుకోనుంది. 2020 నాటికి ప్రపంచంలోనే ‘అతి పిన్నవయసు’ దేశంగా భారత్ అవతరించనుంది. ఈ లెక్కన రానున్న దశాబ్దాల్లో యువతే దేశ రాజకీయాలను శాసించనుంది. దాంతో యువ ఓటును ఆకర్షించేందుకు పార్టీలన్నీ మేనిఫెస్టోలను సవరించుకుంటున్నాయి.

దేశవ్యాప్తంగా వెల్లువలా యువ ఓటర్ల నమోదు
భారత ఎన్నికల చరిత్రలో తొలిసారి బలమైన ముద్ర

కొత్త ఓటర్లు భారీ సంఖ్యలో నమోదవడం వెనక ఎన్నికల సంఘం పాత్ర అంతా ఇంతా కాదు. 18 ఏళ్లునిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఈసీ ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించింది. అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయడం, నమోదైన వారంతా పోలింగ్‌లో పాల్గొనేలా చేయడమే లక్ష్యంగా ‘సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్’ (స్వీప్) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో సెమినార్లు, వ్యాస రచన పోటీలు, వక్తృత్వ పోటీలు, మానవహారాలు, దృశ్య శ్రవణ ప్రకటనలు... ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలను నిర్వహించింది.  ఓటర్ల నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు కాలేజీలకు వెళ్లి అక్కడే ఓటర్ల నమోదు చేయడం, పోస్టాఫీసులు, బహిరంగ ప్రదేశాల్లో ‘డ్రాప్ బాక్సు’లు ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరించడం, ఆన్‌లైన్‌లో నమోదు వంటి వినూత్న చర్యలు చేపట్టింది.  

 నవ భారత్
 2014 సార్వత్రిక ఎన్నికల్లో 18-19 ఏళ్ల వయసు గల దాదాపు 2.31కోట్ల మంది యువతీ యువకులు తొలిసారిగా ఓటు వేయనున్నారు
 
 పెరుగుతున్న రాజకీయాసక్తి
 దేశవ్యాప్తంగా యువతలో రాజకీయాసక్తి బాగా పెరుగుతోందని సర్వేలన్నీ చెబుతున్నాయి. ఢిల్లీలో నిర్భయ హత్య సందర్భంగా వెల్లువెత్తిన నిరసనలో, అన్నాహజారే, కేజ్రీవాల్ ఉద్యమాల్లో, సమైక్యాంధ్ర, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో యువత క్రియాశీలకంగా పాల్గొంది. దేశ వ్యాప్తంగా పట్టణ యువతలో రాజకీయ ఆసక్తి పెరిగినట్లు అమెరికాకు చెందిన ‘గ్లోబల్ అర్బన్ యూత్ రీసర్చ్ నెట్‌వర్క్’ నివేదిక తేల్చింది. 1996లో 43 శాతం యువత రాజకీయాల పట్ల ఆసక్తి చూపితే అది ప్రస్తుతం 71 శాతానికి పెరిగిందని వివరించింది.
 
 అంకెల్లో యువ భారతం
*     దేశంలోని మొత్తం ఓటర్ల సంఖ్య దాదాపు 82 కోట్ల పై చిలుకు (మార్చి 9, 16 తేదీల్లో కూడా నమోదు చేసుకున్న వారిని  కలుపుకుంటే)
*     వారిలో యువ ఓటర్ల సంఖ్య 47 శాతం
*     యువ ఓటర్లలో 51.4 శాతం పురుషులు, 48.6 శాతం మహిళలు
*     ఇటీవలి నాలుగు ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లో పోలైన ఓట్ల శాతం బాగా పెరిగింది. ప్రధానంగా కొత్త ఓటర్లే ఇందుకు కారణం.
*     ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ 58 నుంచి 67 శాతానికి పెరిగింది. రాజస్థాన్‌లో 67 శాతంనుంచి 74 శాతానికి, ఛత్తీస్‌గఢ్‌లో 71 శాతం నుంచి 74 శాతానికి, మధ్యప్రదేశ్‌లో 70 శాతం నుంచి 71 శాతానికి పెరిగింది.
 *    దేశవ్యాప్తంగా కళాశాలల్లో ప్రస్తుతం 3 కోట్ల మంది విద్యార్థులున్నారు
*     ఏటా 90 లక్షల మంది గ్రాడ్యుయేట్లు బయటికొస్తున్నారు
*     మళ్లీ వారిలో 40 శాతం మంది యవతులున్నారు
*     భారత్‌లో అత్యంత పిన్న వయస్కులైన ప్రజాప్రతినిధులు 38 మంది ఉన్నారు (అయితే వారిలో 33 మంది తల్లిదండ్రులు కూడా రాజకీయాల్లో ఉన్నారు!)
 
 ఇకపై రికార్డు పోలింగే!
 ఈ సార్వత్రిక ఎన్నికల్లో యువ ఓటర్ల పాత్ర గతంలో ఎన్నడూ లేనంతగా పెరగనుందని ఇటీవలి ‘గూగుల్’ సర్వేలో వెల్లడయ్యింది. దేశంలోని 86 నగరాల్లో విస్తరించి ఉన్న 108 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 18-35 ఏళ్ల మధ్య వయసున్న 41,000 మందిని సర్వే చేయగా, కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్న వారిలో ఏకంగా 94 శాతం మంది ఈసారి తప్పకుండా ఓటేస్తామని చెప్పారు. పార్టీకే కాకుండా అభ్యర్థికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తామని పట్టణ యువ ఓటర్లు తెలిపారు.

35 శాతం మంది పార్టీని బట్టి ఓటేస్తామని తెలిపితే, 36 శాతం మంది అభ్యర్థికే ప్రాధాన్యత ఇస్తామనడం విశేషం. ప్రధాని అభ్యర్థిని బట్టి ఓటేస్తామన్నవారు 11 శాతమే. అభ్యర్థి సమర్థుడు కావాలని, ఆ సమర్థుడు యువకుడు కూడా అయితే తమ ఓటు వారికేనని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు సంబంధించిన వెబ్‌సైట్లు చూసేవారి సంఖ్య ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిందని ‘గూగుల్ ఇండియా’ ఎండీ రజన్ ఆనందన్ పేర్కొన్నారు.

యంగ్ ఏపీ:  18-19 మధ్య వయసు గలవారు..

>
మరిన్ని వార్తలు