నిమ్మలకు ఎదురుగాలి

21 Apr, 2014 03:31 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, అనంతపురం :  హిందూపురం లోక్‌సభ స్థానంలో సిట్టింగ్ ఎంపీ, టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్పకు ఎదురు గాలి వీస్తోంది. టీడీపీలో తీవ్రమైన వర్గ విభేదాలు.. ఎంపీగా ఐదేళ్లలో ఏమాత్రం అభివృద్ధి చేయక పోవడం.. పవర్‌లూమ్స్ నిర్వహిస్తూ నేతన్నల కడుపు కొడుతుండటం నిమ్మల కిష్టప్పకు ప్రతికూలంగా మారింది. లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్‌సీపీ బలంగా ఉండటం.. అభివృద్ధిపై స్పష్టమైన విధానం.. మహానేత, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దుద్దేకుంట శ్రీధర్‌రెడ్డికి అనుకూలంగా మారాయి.
 
 రాష్ట్ర విభజన నేపథ్యంలో నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖాళీ అయిన నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థి చిన్న వెంకటరాముడు కనీసం పోటీ ఇచ్చే పరిస్థితిలో కూడా లేరు. పైగా ఇతను భూముల వివాదాల్లో చిక్కుకున్నారు. హిందూపురం లోక్‌సభ నుంచి 14 మంది అభ్యర్థులు బరిలోకి దిగినా.. పోటీ ప్రధానంగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యే కేంద్రీకృతమైంది. గత ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే పోటీ సాగింది. పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసిన కడపల శ్రీకాంత్‌రెడ్డి లక్షకు పైగా ఓట్లను చీల్చడంతో కాంగ్రెస్ అభ్యర్థి ఖాసీంఖాన్‌పై టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప 22,835 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కడపల శ్రీకాంత్‌రెడ్డి బరిలో లేకుండా నిమ్మల కిష్టప్ప విజయం సాధించి ఉండేవారు కాదని రాజకీయ విశ్లేషకులు అప్పట్లో విశ్లేషించారు.
 
 ఎంపీగా విఫలమైన నిమ్మల..
 సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్పను మరోసారి టీడీపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు బరిలోకి దించారు. ఐదేళ్లలో ఎంపీగా ఆయన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేకపోయారు. కదిరి-పుట్టపర్తి, పుట్టపర్తి-చిక్‌బళ్లాపూర్ రైలు మార్గాలను సాధిస్తానని చెప్పిన నిమ్మల.. చివరకు వాటిని మంజూరు చేయించలేకపోయారు.
 
 హిందూపురం లోక్‌సభ స్థానంలో బీడీఎల్(భారత్ దైనిక్స్ లిమిటెడ్), ఈసీఐఎల్(ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్), హెచ్‌ఏఎల్(హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్), బీఈఎల్(భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్) సంస్థలు రూ.11 వేల కోట్ల వ్యయంతో పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి 2008లోనే అప్పటి వైఎస్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. వైఎస్ మరణంతో కేంద్రం ఆ పరిశ్రమలను ఏర్పాటు చేయలేదు. వాటిని ఏర్పాటు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. చేనేత వర్గానికి చెందిన నిమ్మల కిష్టప్ప.. హిందూపురం మండలం ముద్దిరెడ్డిపల్లిలో బినామీ పేర్లతో స్వయంగా పవర్‌లూమ్స్ నిర్వహిస్తున్నారని ఆ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. పవర్ లూమ్స్ వల్ల ధర్మవరం, సోమందేపల్లి, హిందూపురం పరిసర ప్రాంతాల్లోని చేనేత కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ఐదేళ్లలో హిందూపురం లోక్‌సభ స్థానం పరిధిలోని 58 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బాధిత చేనేత కుటుంబాల్లో ఏ ఒక్క కుటుంబాన్ని కూడా నిమ్మల కిష్టప్ప పరామర్శించిన దాఖలాలు లేవు. ఇది సొంత సామాజికవర్గంలోనే నిమ్మలకు ప్రతికూలంగా మారింది.
 

మరిన్ని వార్తలు