అవ్వతాతలకు బువ్వేది ?

25 Mar, 2014 01:10 IST|Sakshi
అవ్వతాతలకు బువ్వేది ?

* బాబు జమానాలో ఒకరు మరణిస్తేనే మరొకరికి పెన్షన్..
* రోశయ్య, కిరణ్ హయాంలోనూ అంతే
* వైఎస్ తరువాత పెరగని పింఛన్లు

పెద్ద కొడుకు కోసం ‘కోటి’ కళ్లేసుకొని...  కోటి మంది... వీళ్లంతా పింఛన్ల కోసం ఎదురుచూసే అభాగ్యులు. పిడికెడు మెతుకుల కోసం పరితపిస్తున్నవారు. ఇందులో పండుటాకులే సగానికి పైగా ఉన్నారు. జీవిత చరమాంకంలో బతుకు పోరు సాగిస్తున్న ఇలాంటివారిని ఆదుకోవాలని చంద్రబాబుకు ఏనాడూ అన్పించలేదు. కేవలం 75 రూపాయలు విదిల్చి అదే భారమని భావించారు. అది కూడా మూణ్ణెల్లకోసారే! ఎవరైనా లబ్ధిదారుడు చస్తేనే కొత్త పింఛన్‌దారుడిని ఎంపిక చేస్తామన్నారు.  అలాంటివారి కోసం నేనున్నానంటూ ముందుకొచ్చి భరోసా ఇచ్చారు వైఎస్ రాజశేఖరరెడ్డి. తల్లడిల్లే ముసలి తల్లిదండ్రులకు పెద్ద కొడుకయ్యాడు. అధికారంలోకి రాగానే పింఛన్‌ను రూ.200లకు పెంచడమేగాక నెలనెలా ఠంచనుగా అందించి వారి జీవితాల్లో మళ్లీ వెలుగులు నింపారు.  వైఎస్ హఠాన్మరణంతో ప్రభుత్వానికి అవ్వాతాతలు భారమయ్యారు. ఉన్న సంఖ్యలో కోతపెట్టి ‘ఖర్చు’ తగ్గించుకుంటున్నారు. ‘పెద్దకొడుకు’ రూపంలో వచ్చి తమ బతుకులు మార్చేవారి కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ముదిమి వయసులోనూ తమ ఓటును ఆయుధంగా మలిచేందుకు సిద్ధమవుతున్నారు.
 
 పెన్షన్.. బలహీనులకు ఆర్థిక భరోసానిచ్చే ఆయుధం. వృద్ధాప్యం వల్లనో, వైకల్యం వల్లనో సొంతంగా సంపాదించుకోలేని, వారికి ప్రభుత్వం కచ్చితంగా అందించాల్సిన చేయూత. కానీ వైఎస్ హయాం వరకు ప్రభుత్వాలు పింఛను అంశాన్ని ఆర్థికాంశంగా, ఖజానాపై భారంగా, అనవసర వ్యయంగానే చూశాయి. పెన్షన్ల పథకం 1995-96లో ప్రారంభమైంది. అంతకుముందు వితంతు పెన్షన్లు ఉన్నా అతి తక్కువ మందికి లబ్ధి చేకూరేది. 1995-96లో వృద్ధాప్య, 2000లో వికలాంగ, 2001లో చేనేత పెన్షన్ల ప్రక్రియ ప్రారంభ మైంది. 1995లో వితంతు, వృద్ధాప్య పెన్షన్లు అందుకునే వారి సంఖ్య 9.68 లక్షలు ఉంటే.. అందులో వృద్ధులకు రూ. 75, వితంతువులకు రూ. 50 మాత్రమే చెల్లించేవారు.  
 - కె. శ్రీకాంత్ రావు
 
పొన్ను కర్ర పోటేసుకుంటూ వచ్చిందా అవ్వ. వైఎస్ ఆ ఊరొచ్చాడని ఎవరో    చెప్పారట. జన ప్రవాహంలోనే రాజన్న దగ్గరకొచ్చింది. ‘ఏంటమ్మా?’ అని ప్రశ్నిస్తే ఆ అవ్వ కన్నీటి పర్యంతమైంది. ‘అయ్యా! ఆరేళ్లుగా పెన్షన్ కోసం తిరుగుతున్నాను. కన్పించిన ప్రతి నాయకుడిని వేడుకున్నా. ఎన్నికలప్పుడైతే ఇస్తామంటున్నారు. ఆ తర్వాత ఎవరైనా చస్తేనే పెన్షన్ వస్తుందని చెప్పారు. మా ఊరు వచ్చినచంద్రబాబును కలవాలనుకున్నా.
 
 కానీ ఆయన చుట్టూ ఉన్నోళ్లు ఎవరూ పోనివ్వలేదు. అయ్యా! ఆ పెన్షన్ ఇస్తే కాస్త ఆసరాగా ఉంటుంది కదా..’ ఆ అవ్వ కొంగుతో కళ్లు అద్దుకుంటూ వైఎస్ చేతులను తడిమింది. ‘వచ్చేది మన ప్రభుత్వమే, నీకు పెన్షన్ వస్తుంది’ అని రాజన్న మాట ఇచ్చారు. ఆ తర్వాత ఆ అవ్వకు పెన్షన్ వచ్చింది. ఆ ఊరి అధికారే ఆమె   దగ్గరకొచ్చి ఆ విషయం చెప్పారు. ఆ సమయంలో అవ్వ ఆనందంతో కన్నీళ్లు పెట్టింది. ఇదో యదార్థ గాథ. వైఎస్ పాదయాత్ర సందర్భంగా సంచలనం కలిగించిన వార్త.
 
 ‘బాబు’ కాలంలో ఓటు కోసమే పోలింగ్ బూతుకొచ్చిన ఆ అవ్వ... ఆ తర్వాత వైఎస్ కోసమే ఓటెయ్యాలని వస్తున్నా... అని చెప్పింది. మన రాష్ట్రంలో వయోవృద్ధులు, వితంతువులు, వికలాంగుల ఓటు శాతం తక్కువేమీ కాదు. దాదాపు కోటి మంది ప్రతిసారి ఓటేయడానికి వస్తున్నారు.. ఆ క్షణంలో వాళ్లు కోరుకునేది ఒకే ఒక్కటి. గెలిచిన ప్రభుత్వం తమకు ఎంతోకొంత మేలు చేయాలని వేడుకుంటారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సామాజిక పెన్షన్ల తీరు తెన్నులే మార్చిన తర్వాత వయోవృద్ధుల ఓటింగ్ శాతం పెరిగింది. వికలాంగుల్లోనే తమ ఓటుతో మనోగతాన్ని చాటుకోవాలనే ఆలోచన రెట్టింపయింది.
 
 ఈ పరిస్థితిని గుర్తించిన పార్టీలు సామాజిక పెన్షనర్ల ఓటింగ్‌ను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. పెన్షన్ల కోసం ఏళ్ల తరబడి తిప్పించుకున్న పార్టీలు సైతం, వాగ్దానాల మొసలి కన్నీరు కారుస్తున్నాయి. సామాజిక పెన్షన్ల వ్యవస్థే భారమన్న చంద్రబాబు సైతం తన మేనిఫెస్టోలో దీన్నో ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. అయితే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు నిర్దిష్టమైన హామీల వైపే దృష్టి పెట్టారు. కచ్చితమైన భరోసానే కోరుకుంటున్నారు.
 
 ఇప్పుడున్న పార్టీల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక పెన్షన్లపై స్పష్టమైన విధానాన్ని వెల్లడించడం వారిలో ఆశలు రేపుతోంది. అధికారంలోకి వస్తే ఏకంగా కోటి మందికి పెన్షన్లు ఇస్తామని ప్రకటించడం వారికి ఊరట కల్గిస్తోంది. ఏలికలు పేలికలైన చేనేతలూ పెన్షన్ల భద్రత కోసం రాజన్న తరహా వ్యూహం కావాలని, అలాంటి ఆశయాలతో ముందుకెళ్లే పార్టీలకే పట్టంకట్టాలనే ఆలోచనలో ఉన్నారు. పిసరంత సాయం కోసం పోటెత్తే పెన్షనర్ల ఓట్లు అన్ని స్థానాలను ప్రభావితం చేస్తాయనేది సుస్పష్టం.
 
 చంద్రబాబు
  -   చంద్రబాబు 2004లో పదవి నుంచి దిగిపోయేనాటికి.. రాష్ట్రంలో మొత్తం వృద్ధాప్య, వితంతు, చేనేత, వికలాంగ పెన్షన్ల సంఖ్య 18.97 లక్షలు.
 -    పెన్షన్ల కోసం ఏడాదికి చేసిన వ్యయం రూ.163.90 కోట్లు.
 -    అర్హులైన అందరికీ కాకుండా, ‘ఒకరు మరణిస్తేనే.. మరొకరికి’ పింఛన్ ఇచ్చేవారు. అదీ మూడు నెలలకోసారి గ్రామ సభల్లో అందించేవారు.
 
 వైఎస్ రాజశేఖరరెడ్డి
-  2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే.. 50 రూపాయలు, 75 రూపాయలున్న పెన్షన్లను వంద రూపాయలకు పెంచారు.
 - 2005-06 ఆర్థిక సంవత్సరంలోనే పెన్షన్ మొత్తాన్ని రూ.వంద నుంచి రూ. 200కు పెంచారు.
-  2006 సంవత్సరం నుంచి అర్హులైన అందరికీ పెన్షన్లు ఇవ్వాలనే ఆలోచనలో.. సంతృప్తస్థాయి విధానాన్ని ప్రారంభించారు. లబ్ధిదారుల సంఖ్య ఒక్కసారిగా 21 లక్షల నుంచి 71 లక్షలకు చేరింది.
 - దరఖాస్తు చేసుకున్న, తెల్లరేషన్‌కార్డు ఉన్న, అర్హులైన వారందరికీ.. ఎలాంటి మధ్యవర్తులు, సిఫారసులు లేకుండానే పెన్షన్లు మంజూరు చేశారు.
 - ప్రతినెలా పెన్షన్లు ఇచ్చేవారు.
 
 రెండో సంతకం చేస్తా.. పింఛన్ రూ.700 చేస్తా
 పనులకు పోతున్న అవ్వతాతల కోసం రెండో సంతకం చేస్తాను. ఇవాళ ఈ అవ్వతాతలకు ఇస్తున్న రూ. 200 ఫించన్‌ను మనవడిలా రూ. 700లకు పెంచుతూ రెండో సంతకం చేస్తాను. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత నేను చేసే ఐదు సంతకాలు రాష్ట్ర దశాదిశను మార్చేవిగా ఉంటాయి. పైనున్న రాజశేఖరరెడ్డి గర్వపడే విధంగా ఉంటాయి..
 - వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  
 
 

ఇదీ ప్రస్తుతం ఉన్న లెక్క (2014 మార్చి వరకు)
 కేటగిరి    లక్ష్యం    మంజూరు    పంపిణీ
 వృద్ధాప్య    42,89,616    37,50,325    33,10,111
 వైకల్యం    8,84,246    9,12,807     8,20,024
 వితంతు    17,77,658    22,83,351    19,52,955
 చేనేత    1,44,514    1,33,067    1,17,942
 గీతపని    1,00.000    37,841    33.927

 
 రోశయ్య, కిరణ్
-  వైఎస్ మరణం తరువాత అధికారం చేపట్టిన రోశయ్య, ఆ తరువాత అనూహ్యంగా సీఎం అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి పెన్షన్లను ఖజానాపై భారంగా భావించారు.
-  పెన్షనర్ల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఒకరు మరణిస్తేనే మరొకరికి పెన్షన్ అనే పాత పద్ధతికి మళ్లీ తెరతీశారు. బినామీలని, వలసలు వెళ్లారని, స్మార్ట్‌కార్డులంటూ చేతిముద్రలతో సరిపోలితేనే పెన్షన్ ఇవ్వాలని.. ఇలా రకరకాల పద్ధతుల్లో పెన్షన్ల సంఖ్యకు కత్తెరేశారు.
-  ఒక ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉన్నా.. ఇద్దరు వితంతువులు ఉన్నా.. ఒక్కరికి మాత్రమే పెన్షన్ మంజూరు చేసే పద్ధతిని రోశయ్య ప్రభుత్వం ప్రారంభించింది.
-  ఒకవైపు ధరలు ఆకాశానికి చేరుతున్నా.. పెన్షన్ మొత్తాన్ని మాత్రం పెంచలేదు. దీనిని కనీసం రూ.400 చేయాలని కేంద్రం పలుమార్లు రాష్ట్రానికి సూచించినా ఏనాడు పట్టించుకోలేదు.
-     80 సంవత్సరాల వయస్సు దాటిన వారికి  కేంద్రం రూ.500 చెల్లిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం వాటినీ తన ఖాతాలోనే వేసుకుంది. పెన్షన్‌దారుల అర్హత వయసును కేంద్రం 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.
-     వైఎస్ హయాంలో 71 లక్షలుగా ఉన్న పెన్షన్ల సంఖ్య ఇప్పుడూ అలాగే ఉంది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు వైఎస్ తరువాత వచ్చిన ప్రభుత్వాల పనితీరు ఎలా ఉందో..
 
ఓదార్పు ఇచ్చేదెవరు?
 అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. మనదేశంలో 60 ఏళ్లు పైబడిన వారు 27 కోట్ల మంది ఉన్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 2001లో దేశ జనాభాలో 7.6 శాతమే ఉన్న వృద్ధులు... తాజా సర్వేలో 20 శాతానికి చేరినట్టు తేలింది. గడచిన దశాబ్దకాలంగా వీరు హక్కుల కోసం సమైక్య పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో వృద్ధుల సంక్షేమం దిశగా తొలి అడుగు వేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే.
 
తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంరక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రిగా ఆయన ఆకాంక్షించారు. ఆరోగ్య శ్రీ పరిధిలోకి వృద్ధులను చేర్చే అంశంపై అధికారులతో సమీక్షించి విధివిధానాల రూపకల్పనకు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాతి ప్రభుత్వాలు ఆ ఫైళ్లను ముట్టుకోలేదు. కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో రాష్ట్రంలోని 100 జిల్లాల్లో అమలు చేస్తున్న ఎన్‌పీహెచ్‌సీఈ పథకాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. సర్కారీ నిర్లక్ష్యంపై వయో వృద్ధుల సంఘాలు అనేకసార్లు ప్రభుత్వానికి నివేదించినా ఫలితంలేదు.

మరిన్ని వార్తలు