అమరుల త్యాగం వృథా కారాదు

2 Apr, 2014 01:51 IST|Sakshi
అమరుల త్యాగం వృథా కారాదు

తెలంగాణ పోరుబాటలో ప్రాణార్పణ చేసింది బడుగు, బలహీనులేనని.. అయితే ఆ శక్తులన్నీ ఐక్యం కాలేకపోయాయని  విప్లవకవి వరవరరావు అభిప్రాయపడ్డారు. త్యాగాలు చేసిన వాళ్లంతా ఒకే తాటిపైకి రాలేకపోవడంతో ఒక్కో ఉద్యమ కెరటం ఒక్కో పార్టీ పక్షానికి వెళ్లిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ప్రశాంతంగానే వచ్చిందని పాలకులు చెబుతున్నా.. వందలాదిమంది ప్రాణాలు పోగొట్టుకుంటే అది ప్రశాంతత ఎలా అవుతుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. అమరుల త్యాగఫలం వృథా కాకూడదని, వారి ఆలోచనల్లోంచే తెలంగాణ పునర్నిర్మాణం జరగాలని ఆకాంక్షిస్తున్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..
 
కొత్త రాష్ట్రాల నవ నిర్మాణంపై ప్రజలకు పెద్దగా ఆశలున్నాయని అనుకోవడం లేదు. ప్రజాస్వామ్య హక్కుల గురించే మాట్లాడని పార్టీలు, వాటి పరిరక్షణకు హామీలివ్వని నేతలు నవ నిర్మాణం ఎలా చేస్తాయి? పార్టీలన్నీ సామ్రాజ్య శక్తుల గిరిదాటి వెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి, కొత్త రాష్ట్రాల్లోనూ ప్రజాస్వామ్య హక్కుల కోసం ఉద్యమాలు తప్పవు. నిజానికి జనశక్తి, మావోయిస్టుల ఐక్యఫ్రంట్ 1997లోనే భూ సంస్కరణల అమలుకు పట్టుబట్టాయి.  ఎక్కడెక్కడ మిగులు భూమి ఉందనే జాబితాలు ఇచ్చాయి. 2004 చర్చల సందర్భానూ ఇదే ప్రధానాంశమైంది. ఈ డిమాండ్ నేపథ్యంలోనే కోనేరు రంగారావు కమిటీని వేశారు. అది కొన్ని సూచనలు చేసినా అమలుకు నోచుకోలేదు. చంద్రబాబు తప్పిదాల వల్ల  బలహీనవర్గాల భూములన్నీ బడా కంపెనీల చేతుల్లోకి వెళ్లాయి. కొత్త రాష్ట్రాలు ఎన్ని వచ్చినా భూమి లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు.
 
చంద్రబాబే దోపిడీదారు

 చంద్రబాబు పేదలు, అట్టడుగు వర్గాలకు ఇప్పటికీ శత్రువే. పెట్టుబడిదారీ విధానాలకు బీజం వేసిందే ఆయన.  ప్రపంచ బ్యాంకుకు అమ్ముడు పోయి వాళ్ల ఆలోచనలను అమలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అనుకున్నట్టే వైస్రాయి కుట్రను అమలు చేశారు. దీనివెనుక పెట్టుబడిదారీ శక్తుల హస్తం కూడా ఉంది. ఆయన సీఎంగా అసెంబ్లీలో ‘దీన్ని ప్రపంచ బ్యాంకు ఒప్పుకోదు’ అని నిర్లజ్జగా చెప్పారు.
 
 ప్రజల కోసమేనని చెప్పే నేత ఈ మాట అనొచ్చా. ఆయన ప్రపంచబ్యాంకు ఏజెంట్ అనడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఇంకెందుకు? ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నప్పుడు జనం పెద్ద ఎత్తున ఉద్యమించారు. పరిశ్రమలు మూసివేస్తుంటే శ్రామిక వర్గం తిరగబడింది. అయినా ఆయన పట్టించుకోలేదు. ఉద్యమకారులపై నిర్బంధం అమలు చేశాడు. తుపాకులు ఎక్కుపెట్టాడు. ఇది చరిత్ర. సామాజ్య్రవాద కుట్రకు సాక్ష్యం. తాళిపుస్తెలు తెగుతున్న మహిళలు సారా వద్దు మొర్రో అంటే, నిషేధం ఎత్తివేయలేదా? సబ్సిడీలు రద్దు చేయలేదా? సబ్సిడీ బియ్యం రేటు పెంచలేదా? ఇదంతా ప్రపంచబ్యాంకు ఆదేశాల మేరకు కాదా? ఇలాంటి చరిత్ర ఉన్న బాబు ఇప్పుడు మారాననడం హాస్యాస్పదం.
 
 కేసీఆర్ ఇస్తామంటున్నారా?
 ఇంటికి నాలుగెకరాల భూమి ఇస్తామంటున్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాటల్లో విశ్వసనీయత ఎంత? వాళ్ల భూములు వాళ్లకే కొనిస్తామంటున్నారు? ఇది ఎంతమాత్రం పరిష్కారం కాదు. దగాపడ్డ తెలంగాణలో దళితులు, బడుగు జీవులదే ప్రధాన పాత్ర. ఆ వర్గానికి కేసీఆర్ ఏం చేస్తారో చెప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా ప్రతిఘటన తప్పదు. హక్కులు, కనీస అవసరాల కోసం సాగే ఉద్యమాన్ని వాగ్దానాలతో ఆపడం ఎంతమాత్రం సాధ్యం కాదు.  పరిశ్రమల ఏర్పాటును ఏ ఉద్యమ పార్టీలు, సంఘాలు అడ్డుకోవు. కాకపోతే వారి ప్రయోజనాలను దెబ్బతీస్తూ, పెట్టుబడిదారీవర్గ ప్రయోజనాలు కాపాడే చర్యలకే వ్యతిరేకం.  
 
 జనం కోరుకునేదేంటి?
 ప్రాంతీయ వాదాలు వేరుకావచ్చు. ఆలోచన ధోరణులు భిన్నంగా ఉండొచ్చు. కానీ రెండు ప్రాంతాల ప్రజలు స్వావలంబన, స్వపరిపాలన ఆశిస్తున్నారు. అభివృద్ధే ఎజెండా అంటున్న ఏ పార్టీనీ వాళ్లు నమ్మడం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకూ వాళ్ల ఆలోచనలకు అనుగుణంగా మేనిఫెస్టోలు రావడం లేదు. హైటెక్ సిటీ కడితేనే అభివృద్ధి జరిగిపోలేదు. 90 శాతం మంది ప్రజల దారిద్య్రం పోలేదు. విద్య, వైద్యం, ఉపాధి, కూడు, గుడ్డ అడుగుతున్నారు. కానీ వీటిని అందిస్తామని పార్టీలు భరోసా ఇవ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో నవ నిర్మాణం ఎలా సాధ్యం. ఎన్నికల మ్యానిఫెస్టోలు రూపొందించేప్పుడు ఒక్కసారి ప్రజల దగ్గరకు వెళ్లాలి. వాళ్లకు కావాల్సింది ఏమిటో వాళ్లనే అడగాలి. అప్పుల కోసం విదేశీ బ్యాంకులను ఆశ్రయించనక్కర్లేదు. ప్రజల కోసమే ప్రభుత్వాలు అప్పులు చేయాల్సి వస్తే వాటిని ప్రజలే అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. డబ్బుల కన్నా మించిన శ్రమశక్తి వాళ్ల దగ్గరుంది. వాళ్లకు మేలు జరుగుతుందనే భరోసా ఇస్తే ఎందుకు ఇవ్వరు? కానీ నేతలు అలా ఆలోచించడం లేదు.
 
 కావల్సింది ఇదే...
 ఆంక్షలు లేని... నిర్బంధం లేని... నిషేధాలు లేని రాష్ట్రాలు కావాలి. ప్రజావసరాలే ఎజెండాగా పనిచేసే ప్రభుత్వాలు కావాలి. ఆ పరిస్థితి వచ్చే వరకూ ప్రజా పోరాటాలకు విశ్రాంతి ఉండదు.
 
జన  తెలంగాణ
 యువతకు ప్రోత్సాహం ...
 నవ తెలంగాణ నిర్మాణంలో యువత కీలక పాత్ర నిర్వహించాలి. మనకేం లాభమన్న దృష్టితో కాకుండా యువత  కొత్త రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా పనిచేయాలి. వనరులను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలు కల్పించాలి. పరిశ్రమలను నెలకొల్పే దిశగా యువతను ప్రోత్సహించాలి. అన్ని రంగాల్లో నీతి, నిజాయితీ గల వారిని నియమించాలి. వెలుగులు విరజిమ్మే నవ తెలంగాణను నిర్మించాలి.
 - ఎండీ. అజీమొద్దీన్, లక్ష్మీనగర్, గోదావరిఖని, కరీంనగర్ జిల్లా
 
 ఆకుపచ్చ తెలంగాణ కావాలి....
 అరవైఏళ్ల కల నెరవేరింది.  అమరవీరుల త్యాగం ఫలించింది. ఇక జరగాల్సింది నవ తెలంగాణ నిర్మాణమే. ఆధిపత్య భావజాలం లేని సామాజిక తెలంగాణ నిర్మాణం జరగాలి. తెలంగాణ రైతాంగం పూర్తిగా బోర్ల మీద ఆధారపడాల్సి వస్తోంది. దీనివల్ల విద్యుత్ కోసం ఇక్కట్లు పడుతున్నారు. ఖర్చు కూడా అధికమే. ఈ పరిస్థితిని అధిగమించాలంటే కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయమైన వాటా 700 టీఎంసీలను సాధించి కోటి ఎకరాలకు సాగునీరందించాలి. గిట్టుబాటు ధర కల్పించి ఆత్మహత్యలను నిరోధించాలి. చెరువులను తవ్వించి ఆకుపచ్చ తెలంగాణ నిర్మించాలి. అత్యుత్తమ విద్య వైద్య అవకాశాలను కల్పించాలి. ఇక్కడి సంస్కృతీసంప్రదాయాలను పాఠ్యాంశాలుగా చేర్చాలి.           - కలకొండ నరేష్‌కుమార్, టీచర్, పరకాల
 
 20 జిల్లాలుండాలి...
 అమరుల త్యాగాలు, ఉద్యోగుల పోరాటాలు, సకల జనుల సమ్మె, కోట్లాది ప్రజల ఉద్యమాల ఫలంగా తెలంగాణ ఏర్పడింది. జూన్2న ఏర్పడుతున్న కొత్త తెలంగాణలో పరిపాలన ప్రజలకు చేరువగా సాగాలి. అందుకు జిల్లాల సంఖ్య పెరగాలి. కనీసం 20 జిల్లాలుండాలి. పెద్ద జిల్లాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఐదు నియోజకవర్గాలు దూరంగా ఉంటాయి. దూరభారాన్ని తీర్చేందుకు బెల్లంపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలి. ఇప్పటికే ఈ మేరకు గవర్నర్‌తో సహా అందరికీ ఇక్కడి ప్రజలు వినతిపత్రాలు సమర్పించారు.
 - కోలిపాక శ్రీనివాస్, పద్మశాలివీధి, బెల్లంపల్లి

మరిన్ని వార్తలు