-

హస్తవ్యస్తం..

2 Apr, 2014 02:59 IST|Sakshi

భద్రాచలం, న్యూస్‌లైన్:  భద్రాచలం నియోజకవర్గంలో ఏకఛత్రాధిపత్యం వహించిన సీపీఎంని 2009 ఎన్నికల్లో ఖంగు తినిపించిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలకు పూర్తిగా డీలా పడిపోయింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న కామ్రేడ్లకు అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి చరిస్మాతో కళ్లెం పడింది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారింది. నియోజకవర్గంలో దాదాపుగా ఆ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే అండగా ఉన్నప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం జరుగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా పరాభవం తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు.

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లుగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికలబడడానికి కూడా అనేక కారణాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కుంజా సత్యవతి గెలిచిన తర్వాత ఎల్‌డబ్ల్యూఈఏ పథకం పుణ్యమా అని గతంలో ఎప్పుడూ లేని విధంగా వందల కోట్ల రూపాయల నిధులు వచ్చాయి. కానీ వచ్చిన నిధుల్లో ‘అధికారం’ పేరిట వచ్చిన కమీషన్ పంపకాలే ఆ పార్టీ నాయకుల మధ్య చిచ్చురేపిందనే విమర్శలు బాహాటంగానే వినిపించాయి. ఈ నేపథ్యం లోనే  మూడేళ్లగా ఆ పార్టీ నాయకులు ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే సత్యవతిపై కూడా ఆ పార్టీలో చాలామంది నాయకులు తీవ్రమైన విమర్శలే సంధించారు. మహబూబాబాద్ ఎం పీ, కేంద్రమంత్రి బలరామ్‌నాయక్‌తో కూడా సత్యవతికి సఖ్యత లేకపోవటంతో సీటు రాకుం డా చేసేందుకు వ్యతిరేక వర్గం పెద్ద లాబీయింగే చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

 సీటుకోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు :
 జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు మిగతా పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో పూర్తిగా విఫలమైంది. ఇప్పటి వరకూ ఆ పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహించేందుకు ఏ ఒక్క నాయకుడు కూడా ముందుకు రావటం లేదు. వనమాకు సీటురాదనే ప్రచారంతో నియోజవర్గంలోని కేడర్ అంతా ఆయనకు బాసటగా నిలిచే క్రమంలో అసలు భద్రాచలం సీటు తమకు వద్దని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.

 దీంతో సీటు చేజారుపోతుందని బెంగపట్టుకున్న ఎమ్మెల్యే సత్యవతి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జిల్లాలో గెలిచిన ఏకైక గిరిజన మహిళా ఎమ్మెల్యే కావడంతో వ్యతిరేకత ఉన్నప్పటికీ తిరిగి అధిష్టానం ఆమెకే సీటు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలిసింది. ఆమెకు సీటు వచ్చినప్పటికీ గెలుపు అసాధ్యమేనని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. పంచాయతీ ఫలితాల్లో ప్రజాభిమానం తమకే ఉందని వెల్లడి చేసుకున్న వైఎస్సార్‌సీపీ రెట్టింపు ఉత్సాహంతో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో నిలిచేం దుకు ఉవ్విళ్లూరుతోంది. సీపీఎం, టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు బరిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌కు ఓట్లు ఏ మేరకు పడతాయో అనే విషయంపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

 పంచాయతీ ఎన్నికల ఫలితాలే

 పునరావృతం :  ప్రస్తుతం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని గత అనుభవాలు చెబుతున్నాయి. గత ఏడాది జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో అధికార కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నవి కేవలం 12 మాత్రమే కావడం గమనార్హం. భద్రాచలం పట్టణంలోని ఓ వార్డులో ఎమ్మెల్యే సత్యవతి బంధువు పోటీ చేసినప్పటికీ చిత్తుగా ఓడిపోయింది. ఆ ఎన్నికల్లో సంఖ్యా పరంగా వైఎస్సార్‌సీపీ ముందు వరుసలో నిలువగా, ఆ తర్వాత సీపీఎం, టీడీపీ, సీపీఐ నిలవగా చివరి స్థానం లో కాంగ్రెస్ మిగిలింది. పంచాయతీ ఎన్నికల  ఫలితాల తర్వాత కాంగ్రెస్ కేడరంతా ఆలోచనలో పడ్డారు.

 ప్రస్తుతం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఉత్సాహంగా నామినేషన్ లు వేసిన అభ్యర్థులంతా నాయకుల వ్యవహార శైలితో ప్రచారానికి కూడా వెళ్లడం లేదు. దీంతో నాటి ఫలితాలే పునరావృతం అవుతాయని, సార్వత్రిక ఎన్నికల నాటికి కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందనేది పరిశీలకులు భావిస్తున్నారు. మరోపక్క తమను వేరే రాష్ట్రంలో కలిపారనే ఆగ్రహంతో రగిలిపోతున్న నియోజకవర్గంలోని పోలవరం ముంపు మండలాల ఓటర్లు కూడా కాంగ్రెస్ పార్టీపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత దాదాపుగా భద్రాచలం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తలు