-

పక్కలో బల్లెం

13 Apr, 2014 04:06 IST|Sakshi

సాక్షిప్రతినిధి, వరంగల్ : సాధారణ ఎన్నికల్లో అసలు ఘట్టం మొదలైంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ శనివారం ముగిసింది. బరిలో ఉండేది ఎవరనేది తేలిపోయింది. టికెట్ దక్కకపోవడంతో తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో దిగిన పలు రాజకీయ పార్టీల నాయకులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
 
 నేతల బుజ్జగింపులతో దిగివచ్చారు. మరికొందరు మాత్రం ఎన్నికల్లో సత్తా చాటేందుకు పోటీలోనే ఉన్నారు. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని ఆయా పార్టీల అధికారిక అభ్యర్థులకు సవాల్ విసిరారు.
 
 రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల పోరులో సొంత పార్టీకి చెందిన వారు పక్కలో బల్లెంలా మారారు. ఉపసంహరణ ఘట్టం ముగిసినా... బరిలోనే ఉండడంతో అధికారిక అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగింది. ఓట్లను చీల్చితే ఫలితాలు తారుమారవుతాయని వారు ఆందోళన పడుతున్నారు. సొంత పార్టీ నుంచి తిరుబాటుదారులతో ఇబ్బంది పడుతున్న వారిలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఉన్నారు. జనగామలో కాంగ్రెస్ అధికారిక అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నారు.
 
 కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి బక్క జడ్సన్ తిరుబాటు అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. మరో కార్యదర్శి ఎండీ.రజీయుద్దీన్ ఉపసంహరించుకున్నారు. టీడీపీతో పొత్తులో భాగంగా జనగామ సీటును బీజేపీకి ఇచ్చారు. కమలం తరఫున కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికి పోటీకి దిగారు. టికెట్ దక్కకపోవడంతో తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేసిన బీజేపీ నేత జనగామ సోమిరెడ్డి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. జనగామ సీటును బీజేపీకి ఇవ్వడాన్ని నిరసిస్తూ నామినేషన్ వేసిన మండలి శ్రీరాములు సైతం తన నామినేషన్ విత్‌డ్రా చేసుకున్నారు. ఈయన కాంగ్రెస్‌లో చేరుతారని సమాచారం.
 
 కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డికి నర్సంపేట అసెంబ్లీ టికెట్‌ను కేటాయించి... ఆ తర్వాత జేఏసీ నేత కత్తి వెంకటస్వామికి ఇచ్చారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత దొంతి మాధవరెడ్డి బరిలోనే ఉన్నారు. దొంతి పోటీలోనే ఉండడంతో కాంగ్రెస్ అధికారిక అభ్యర్థి విజయావకాశాలపై తీవ్ర ప్రభావం పడే పరిస్థితి ఉంది.
 
 పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ అధికారిక అభ్యర్థిగా దుగ్యాల శ్రీనివాసరావు బరిలో ఉన్నారు. ఈ స్థానం నుంచి అదే పార్టీకి చెందిన డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ పోటీలోనే ఉన్నారు. పొన్నాల లక్ష్మయ్య వైఖరి వల్లే టికెట్ల కేటాయింపులో తనకు అన్యాయం జరిగిందని... పాలకుర్తిలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో కొనసాగుతున్నట్లు లక్ష్మీనారాయణ చెబుతున్నారు.
 
 కాంగ్రెస్‌కు చెందిన మరో నేత లింగాల శ్రీరాంరెడ్డి సమాజ్‌వాదీ పార్టీ తరఫున బరిలో ఉన్నారు.
 టీడీపీకి తిరుబాటు సెగ తప్పలేదు. టీడీపీ తెలంగాణ ఎన్నికల కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి దయాకర్‌రావు పోటీ చేస్తున్న పాలకుర్తిలో ఆ పార్టీ రెబల్ అభ్యర్థి బరిలో ఉన్నారు. దయాకర్‌రావుకు వ్యతిరేకంగా తెలుగురైతు రాష్ట్ర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రబెల్లి రాఘవరావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలోని స్థానికులను నిర్లక్ష్యం చేసినందుకే తాను పోటీలో ఉన్నానని ఆయన చెబుతున్నారు.
 
  మహబూబాబాద్‌లో టీడీపీ అభ్యర్థిగా మూడు బాలుచౌహాన్‌కు అవకాశం ఇవ్వడంతో ఇక్కడ పార్టీకి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు గుగులోతు దేవిక స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో కొనసాగుతున్నారు.
 
 పొత్తులో భాగంగా టీడీపీకి సీట్లు కేటాయించడంతో అసంతృప్తితో నామినేషన్లు వేసిన బీజేపీ నేతలు నాగపురి రాజమౌళి (భూపాలపల్లి), జనగామ సోమిరెడ్డి(జనగామ), పి.విజయచందర్‌రెడ్డి(పరకాల) పోటీ నుంచి వైదొలిగారు.
 
 తెలంగాణ రాష్ట్ర సమితికి జిల్లాలో అసంతృప్తుల బెడద తప్పింది. పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు టికెట్ ఇవ్వకపోవడంపై స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన మొలుగూరి బిక్షపతి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. పరకాల టీఆర్‌ఎస్ టికెట్ ఆశించి నామినేషన్ వేసిన నాగుర్ల వెంకటేశ్వర్లు సైతం ఉపసంహరించుకున్నారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో స్వతంత్రులుగా బరిలో దిగిన ఇద్దరు టీఆర్‌ఎస్ నేతలు కూడా పోటీ నుంచి తప్పుకున్నారు.
 

మరిన్ని వార్తలు