-

‘స్థానిక’ విజేతలకు స్థానచలనం

21 May, 2014 02:43 IST|Sakshi
‘స్థానిక’ విజేతలకు స్థానచలనం

 సాక్షి, కాకినాడ :జిల్లాలో మెజారిటీ ఎంపీపీ పదవులపై కన్నేసిన టీడీపీతో పాటు ప్రాదేశిక పోరులో గట్టి పోటీనిచ్చిన వైఎస్సార్‌సీపీ కూడా తమతమ ఎంపీటీసీ సభ్యులు చేజారిపోకుండా క్యాంపులు నిర్వహిస్తున్నాయి. అలాగే మున్సిపల్ పోరులో బలాబలాలు సమానంగా ఉన్న ఏలేశ్వరం, గొల్లప్రోలు, ముమ్మిడివరం నగర పంచాయతీల చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కూడా క్యాంపులు ఏర్పాటు చేశారు. కొందరిని పర్యాటక ప్రాంతాలకు, మరికొందరిని పుణ్యక్షేత్రాలకు తరలించారు. గత నెలలో జరిగిన స్థానిక, ప్రాదేశిక ఎన్నికల్లో టీడీపీ పైచేయి సాధించింది. రాజమండ్రి కార్పొరేషన్‌తో పాటు ఏడు మున్సిపాలిటీల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. గొల్లప్రోలు, ముమ్మిడివరం నగర పంచాయతీల్లో మాత్రం వైఎస్సార్ సీపీ, టీడీ చెరిసగం సీట్లను దక్కించుకున్నాయి.
 
 ఏలేశ్వరంలో టీడీపీకి ఎక్కువ స్థానాలు లభించినా ఆ పార్టీకి రిజర్వ్‌డ్ చైర్‌పర్సన్ అభ్యర్థి లేని విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ముమ్మిడివరంలో ఇండిపెండెంట్లతో గట్టెక్కేందుకు టీడీపీ సిద్ధమవుతుండగా ఏలేశ్వరం, గొల్లప్రోలుల్లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎమ్మెల్యేల ఓట్లు కీలకం కానున్నాయి, కాగా ప్రాదేశికపోరులో  57 జెడ్పీటీసీలకు 43 స్థానాలను, 1063 ఎంపీటీసీలకు 608 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. 40 మండలపరిషత్‌లలో టీడీపీకి, 12 మండలాల్లో వైఎస్సార్ సీపీకీ మెజారిటీ స్థానాలు లభించాయి. నాలుగుమండలాల్లో ఇరుపార్టీలకు చెరి సగం సీట్లు వచ్చాయి. ఏలేశ్వరం నగర పంచాయతీ మాదిరే మండల పరిషత్‌లో కూడా టీడీపీకి ఎక్కువ స్థానాలు దక్కినా రిజర్వుడు చైర్మన్ అభ్యర్థి లేని అగమ్యగోచర పరిస్థితి తప్పలేదు.
 
 మెజారిటీ ఎంపీపీ పదవులు సొంతమయ్యే బలం ఉన్నా అభద్రతా భావం పీడిస్తున్నందునే టీడీపీ ఎమ్మెల్యేలు తమ ఎంపీటీసీ సభ్యులను క్యాంపులకు తరలిస్తున్నారు. ముఖ్యంగా మ్యాజిక్ ఫిగర్‌కు ఒకటి రెండు స్థానాలు మాత్రమే ఉన్న పలు మండలాల్లో తమ వారు చేజారిపోతారేమోనన్న భయం వారిని వెన్నాడుతోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఫలితాల కోసం నెలరోజులు, ప్రమాణ స్వీకారం కోసం మరో నెలరోజులు ఎదురుచూడాల్సి వస్తోంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రమాణ స్వీకారానికి, స్థానిక సంస్థల్లో కొత్తపాలక వర్గాలు కొలువు దీరేందుకు ఎన్నికల కమిషన్ లంకె పెట్టింది. అపాయింట్‌మెంట్ డే(జూన్-2) తర్వాత కానీ  ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి లేదు. ఆ తర్వాతే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది.
 
 కుటుంబాలతో సహా వేసవి వినోదం
 ప్రధానంగా పోరు హోరాహోరీగా జరిగిన మండలాల పరిధిలోని ఎంపీటీసీ సభ్యులను క్యాంపులకు తరలించారు. సఖినేటిపల్లి, రాజోలు, ఆత్రేయపురం, గోకవరం, బిక్కవోలు, తొండంగి, పెదపూడి, సామర్లకోట, తాళ్లరేవు, పిఠాపురం మండలాల్లో టీడీపీకి మ్యాజిక్ ఫిగర్‌కు ఒకటి లేదా రెండుస్థానాలు మాత్రమే ఎక్కువ వచ్చాయి. అలాగే మ్యాజిక్ ఫిగర్‌కు ఒకటి రెండు స్థానాలు మాత్రమే తక్కువ వచ్చిన ఏలేశ్వరం, అయినవిల్లి, కాట్రేనికోన వంటి మండలాలతో పాటు వైఎస్సార్ సీపీతో చెరిసగం సీట్లు సాధించిన కాజులూరు, యు.కొత్తపల్లి, రౌతులపూడి మండలాల పరిధిలోని ఎంపీటీసీలను కూడా కాపాడుకునే పనిలో టీడీపీ నిమగ్నమైంది. వీరితో పాటు మిగిలిన మండలాల పరిధిలో కూడా గోడ దూకుతారన్న అనుమానం ఉన్న ఎంపీటీసీలను కూడా శిబిరాలకు తరలించారు.
 
 అలాగే ఏలేశ్వరం, గొల్లప్రోలు, ముమ్మిడి వరం నగరపంచాయతీల పరిధిలోని వార్డు సభ్యులను కూడా క్యాంపులకు తీసుకువెళ్లారు. అవసరం లేని మండలాల్లోనూ ఉబలాటపడుతున్న సభ్యులను కూడా క్యాంపులకు తీసుకు వెళ్లక తప్పలేదు. వేసవి సెలవులను ఆస్వాదించేందుకు ఇదో అవకాశంగా చాలా మంది ఎంపీటీసీలు కుటుంబ సభ్యులతో క్యాంపులకు తరలారు. శిబిర నిర్వాహకులు వీరి వద్ద ఉన్న పర్సనల్ సిమ్‌లను స్వాధీనం చేసుకొని కొత్త సిమ్‌కార్డులందజేశారు. వారిపై నిఘా ఉంచారు. మందుబాబులకు తాగి నంత మద్యం, షడ్రుచులతో కూడిన భోజనాలు, వినోద కార్యక్రమాలతో వారిని కదలకుండా చేస్తున్నారు. ఎక్కువమంది సభ్యులను అరకు, విశాఖపట్నం, హైదరాబాద్, గుంటూరు హాయ్‌లాండ్ వంటి చోట్ల ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించగా, కొంత మందిని కుటుంబసభ్యులతో తిరుపతి, షిర్డీ వంటి పుణ్యక్షేత్రాలకు తరలించారు. కచ్చితమైన ఆధిక్యతను కనపర్చిన మండలాల పరిధిలోని ఎంపీటీసీల నుంచి కూడా ఒత్తిడి వస్తుండడంతో వారిని కూడా విహార యాత్రలకు తరలించాల్సిన పరిస్థితి టీడీపీకి తప్పడం లేదు.
 
 ఖర్చు తడిసిమోపెడు
 నగర పంచాయతీలతో పాటు మండల పరిషత్‌లు చేజిక్కించుకునే అవకాశం ఉన్న మండలాల పరిధిలోని తమ సభ్యులను వైఎస్సార్ సీపీ స్థానిక నాయకత్వం కూడా విశాఖ, అరకు వంటి ప్రాంతాలకు తరలించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో మూడు వారాలకు పైగా క్యాంపులను నిర్వహించే పరిస్థితి ఏర్పడడంతో చైర్మన్, ఎంపీపీ పదవులను ఆశిస్తున్న వారికి తడిసి మోపెడు ఖర్చవుతోంది. పేరుకు స్థానిక, ప్రాదేశిక ఎన్నికలే అయినా సార్వత్రిక ఎన్నికలతో సమానంగా ఖర్చయిందని, ఇప్పుడు అదనపు భారం మోసేదెలా అని ఆశావహులు తలలు పట్టుకుంటున్నారు. జూన్ రెండో వారంలో కానీ వీటి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం లేనందున అప్పటి వరకు క్యాంపులను నిర్వహించక తప్పదని వాపోతున్నారు.
 

మరిన్ని వార్తలు