మురళీ మనోహర్ జోషీకి అవమానం

31 Mar, 2014 16:16 IST|Sakshi
మురళీ మనోహర్ జోషీ
కాన్పూర్ ఎంపీ ఎన్నికల్లో పాల్గొంటున్న బిజెపి వృద్ధ నేత మురళీ మనోహర్ జోషీకి సోమవారం సొంత పార్టీ సమావేశంలోనే అవమానం జరిగింది. ఆయన్ను సొంత పార్టీ నేతలే అవమానించారు. బిజెపి భీష్ముల్లో ఒకరైన జోషీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి.
 
కాన్పూర్ లో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన కూర్చుని ప్రసంగిస్తూండగా, మాజీ కార్పొరేటర్ వికాస్ జైస్వాల్ 'ఎంత కాలం కూచుంటారు. కాస్త లేచి నిలబడండి. కార్యకర్తలకు మర్యాదనివ్వండి' అంటూ బిగ్గరగా అరిచారు. ఖంగుతిన్న జోషీ స్పందించేలోపు జైస్వాల్ నినాదాలివ్వడం మొదలుపెట్టాడు. ఆయన అనుచరులు కూడా గొంతు కలపడంతో కార్యక్రమం రసాభాస అయింది. చివరికి పార్టీ జిల్లా అధ్యక్షుడు జైస్వాల్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసేదాకా ఈ గొడవ సాగింది.
 
ఆ తరువాత కూడా జైస్వాల్ శాంతించలేదు. ఆయన, ఆయన అనుచరులు కలిసి మురళీ మనోహర్ జోషీ దిష్టిబొమ్మను దహనం చేశారు. వారణాసిలో పోటీచేయాలని భావించిన జోషీని బిజెపి కాన్పూర్ లో పోటీ చేసేలా ఒప్పించింది. అయితే కాన్పూర్ లో ఇప్పుడు పరిస్థితులు ఆయనకు ఇబ్బందికరంగా మారాయి. 
మరిన్ని వార్తలు