పవన్‌కల్యాణ్‌తో పొట్లూరి సమాలోచనలు

18 Apr, 2014 03:41 IST|Sakshi
పవన్‌కల్యాణ్‌తో పొట్లూరి సమాలోచనలు

సాక్షి, హైదరాబాద్: జనసేన నేత, సినీనటుడు పవన్ కల్యాణ్ మద్దతుతో పారిశ్రామిక వేత్త, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది. చకచకా మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విజయవాడ లోక్‌సభ వదులుకుంటామంటూ సమాచారం పంపించి తీరా సమయానికి టీడీపీకి చెందిన కేశినేని నానికే ఆ స్థానాన్ని ఖరారు చేయడంతో పొట్లూరి సన్నిహితులు ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే.
 
నిజానికి పొట్లూరి మొదట్లో విజయవాడ కుదరని పక్షంలో విశాఖ, రాజమండ్రి, ఏలూరు స్థానాల్లో ఒక చోట నుంచి పోటీ చేయాలని తొలుత ఆలోచించారు. రాజకీయ భవితవ్యంపై ఆయన గురువారం పవన్ కల్యాణ్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. విశాఖపట్టణం లోక్‌సభ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో.. ఆమెపై పోటీ చేసి గెలవలేనని పొట్లూరి చెప్పినట్లు సమాచారం.
 
టీడీపీ దిగిరాని పక్షంలో విజయవాడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ఆయన తన ఆకాంక్షను వ్యక్తంచేసినట్లు ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయంలో శుక్రవారం లేదా శనివారం నాటికి ఒక స్పష్టత వస్తుందని, ఇంకా తుది నిర్ణయం జరగలేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు