పింఛనుతో ఆసరా

29 Apr, 2014 02:01 IST|Sakshi
పింఛనుతో ఆసరా
  • జిల్లాలో 3.32 లక్షల మందికి మేలు
  •  అర్హులైన మరో 2 లక్షల మందికి...
  •  చంద్రబాబు పాలనను గుర్తుతెచ్చుకునేందుకు భయపడుతున్న వైనం
  •  వైఎస్ స్వర్ణయుగం మళ్లీ రావాలని ఆకాంక్ష
  •  సాక్షి, విజయవాడ :  చంద్రబాబు హయాంలో పింఛను కష్టాలు ఎదుర్కొన్న లబ్ధిదారులకు వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక అవన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోయాయి. అవ్వాతాతలకు నాడు ఇంటికి పెద్ద కొడుకులా వైఎస్సార్ నిలవడమే దానికి కారణం. వారి కష్టాలను పాదయాత్రలో ప్రత్యక్షంగా చూసి చలించిపోయిన వైఎస్... అధికారంలోకి రాగానే అర్హతనే ప్రామాణికంగా తీసుకొని జిల్లాలో ఫించన్లు మంజూరు చేశారు. అప్పటివరకు రూ.70 చొప్పున ఇస్తున్న పింఛన్ మొత్తాన్ని రూ.200కు పెంచారు. దీంతోపాటు అర్హులైన ప్రతి ఒక్కరికి దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లోనే ఫించన్లు మంజూరయ్యేలా చూసి వృద్ధుల జీవితాల్లో ఆర్థిక వెలుగురేఖలు నింపారు. ఆ తర్వాత దివంగత వైఎస్సార్ మరణంతో మళ్లీ పింఛన్ల కడగండ్లు మొదలయ్యాయి. నాటి నుంచి నేటి వరకు అదే రీతిలో కొనసాగుతున్నాయి.
     
    జగన్ హామీతో భవితపై మళ్లీ ఆశలు...
     
    మళ్లీ దివంగత వైఎస్సార్ తనయుడు, వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పింఛనుదారుల భవితకు భరోసా ఇచ్చేలా హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి రాగానే పింఛను రూ.700కు పెంచుతూ రెండో సంతకం చేస్తానని ప్రకటించారు. దీంతో జిల్లావాసుల్లో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 3,32,836 మందికి వివిధ రకాల పింఛన్లు అందుతున్నాయి. వీటిలో 1,39,074 మంది వృద్ధులకు, 1,21, 1478 మంది వితంతువులకు, 4,968 మంది చేనేతలకు, 1,919 మంది గీత కార్మికులకు, 45,614 మంది వికలాంగులకు, 20,103 మందికి అభయ హస్తం ద్వారా పింఛన్లు అందుతున్నాయి. వీరిలో అభయహస్తం పథకం లబ్ధిదారులకు, వికలాంగులకు నెలకు రూ.500, మిగిలిన వారందరికి నెలకు రూ.200 చొప్పున పింఛన్లు ఇస్తున్నారు.
     
    వైఎస్‌కి ముందు...
     
    వైఎస్ అధికారంలోకి రాక ముందు వృద్ధులు, వికలాంగులకు, వితంతువులకు నెలకు రూ.70 మాత్రమే పింఛను ఇచ్చేవారు. అది కూడా మూడు, నాలుగు నెలలకోసారి ఇచ్చేవారు. వైఎస్ అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా ఒకటో తేదీన పింఛను ఇచ్చే వెసులుబాటు కల్పించారు. 2004కు పూర్వం చంద్రబాబు పాలనా కాలంలో 53 వేల మందికి మాత్రమే పింఛన్లు అందేవి, వైఎస్ అధికారంలోకి వచ్చాక జిల్లాలో వివిధ రకాల పింఛన్లు పొందే వారి సంఖ్య 2.34 లక్షలకు చేరింది.

    వైఎస్ మరణానంతరం రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల పరిపాలనలో 95 వేల మందికి మాత్రమే ఈ ఐదేళ్లలో కొత్తగా పింఛన్లు మంజూరు చేశారు. వాస్తవానికి రచ్చబండ, ఇతర కార్యక్రమాల ద్వారా జిల్లాలో సుమారు రెండు లక్షలకు పైగా కొత్త పింఛన్లకు దరఖాస్తులు అందాయి. వాటిని కనీసం పరిశీలించిన దాఖలాలు కూడా లేవు. దీంతో కొత్త పింఛన్ల కోసం అర్హులైన వారంతా ఏళ్లతరబడి ఎదురుచూస్తున్నారు. మళ్లీ దివంగత వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ అధికారంలోకి వస్తేనే తమ కడగండ్లు తీరతాయని వారు విశ్వసిస్తున్నారు.
     
    పింఛన్ల పెంపునకు రెండో సంతకం...
     
    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వృద్ధాప్య, వితంతు పింఛన్లు రూ.200 నుంచి నెలకు రూ.700కు పెంచుతామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. 45,614 మంది వికలాంగులకు ప్రస్తుతం నెలకు రూ.500 చొప్పున ఇస్తున్న పింఛను మొత్తాన్ని వెయ్యి రూపాయలకు పెంచుతామని ప్రకటించారు. వీటితో పాటు గూడు లేని వృద్ధులు, అనాథల కోసం నియోజకవర్గానికో అనాథ, వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
     
    డెబ్బయ్ రూపాయల పింఛను కోసం పంచాయతీ కార్యాలయాల ముందు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన రోజులను జిల్లా వాసులు ఇంకా మర్చిపోలేదు.
         
     కొత్త పింఛను కావాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన దుర్భర పరిస్థితులను మర్చిపోవాలన్నా సాధ్యం కాదు.
         
     ఇచ్చే పింఛను కూడా మూడు నాలుగు నెలలకోసారే అందే ఆ రోజులను గుర్తుచేసుకోవడానికే భయపడే పరిస్థితి.
     
     చంద్రబాబు హయాంలో పింఛను లబ్ధిదారులు ఎదుర్కొన్న కష్టాలవి. మళ్లీ  ఆ రోజులు రాకూడదని పింఛనుదారులు కోరుకుంటున్నారు.
     

మరిన్ని వార్తలు