50 స్థానాల్లో వారసులు

2 Apr, 2014 02:38 IST|Sakshi
50 స్థానాల్లో వారసులు

ఎన్నికల బరిలో కాంగ్రెస్ నుంచి అత్యధికులు
జాబితాలో ప్రణబ్ తనయుడు, పలువురు సీఎంల బిడ్డలు  

 
 న్యూఢిల్లీ: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన్ననలు అందుకుంటున్న మన దేశంలో వారసత్వ రాజకీయాలు కూడా జోరుగానే సాగుతున్నాయి. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు 50 స్థానాల్లో వివిధ పార్టీల నేతల కొడుకులు, కూతుళ్లే బరిలో ఉన్నారు. వీరిలో అత్యధికం కాంగ్రెస్ అభ్యర్థులే కావడం గమనార్హం. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ నుంచి రాహుల్, వరుణ్ గాంధీల వరకు వారసత్వ అభ్యర్థుల్లో ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని జాంగీపూర్ సిట్టింగ్ ఎంపీ అయిన అభిజిత్ ప్రస్తుతం అక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగారు.
 
 మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సతీమణి, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ రాయబరేలీ నుంచి, ఆమె తనయుడు రాహుల్ అమేథీ నుంచి తిరిగి పోటీ చేస్తున్నారు. రాజీవ్ సోదరుడు సంజయ్ భార్య మేనక, ఆమె తనయుడు వరుణ్ కూడా బరిలో ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రాతినిధ్యం వహిస్తున్న శివగంగ స్థానం నుంచి ఈసారి ఆయన తనయుడు కార్తి పోటీ చేస్తున్నారు. బీజేపీ లోక్‌సభ ఎంపీ యశ్వంత్ సిన్హా తనయుడు జయంత్ హజారీబాగ్(జార్ఖండ్) నుంచి, దివంగత కాంగ్రెస్ నేత మాధవరావ్ సింధియా తనయుడు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య గుణ(మధ్యప్రదేశ్) నుంచి బరిలో ఉన్నారు.
 
 బరిలో ఉన్న ఇతర వారసత్వ అభ్యర్థుల్లో కేంద్ర మంత్రి సచిన్ పైలట్, కేంద్ర  మంత్రి జితేంద్ర ప్రసాద తనయుడు జితిన్ ప్రసాద, కాంగ్రెస్ నేత మురళీ దేవరా కుమారుడు, కేంద్ర మంత్రి మిలింద్, కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ తనయుడు సందీప్, హర్యానా సీఎం భూపీందర్ హూడా కొడుకు దీపీందర్, అస్సాం సీఎం తరుణ్ గొగోయ్ తనయుడు గౌరవ్, ఛత్తీస్ సీఎం రమణ్‌సింగ్ పుత్రుడు అభిషేక్, రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే తనయుడు దుష్యంత్ తదితరులు ఉన్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలే కాకుండా ఆర్జేడీ, ఎల్జేపీ, ఆరెల్డీ వంటి ప్రాంతీయ, చిన్నాచితకా పార్టీల నేతల సంతానం కూడా ఎన్నికల గోదాలో ఉన్నారు. వీరిలో ఆర్జేడీ చీఫ్ లూలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి, ఎల్జేపీ చీఫ్ రామ్‌విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు