వారసులదే రాజ్యం!

6 Apr, 2014 23:11 IST|Sakshi
వారసులదే రాజ్యం!

కీలక పదవులు చేపట్టింది నేతలు, వారి కుటుంబసభ్యులే
 తాజా లోక్‌సభ ఎన్నికల్లోనూ పలువురి పోటీ

సాక్షి, ముంబై: రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలే రాజ్యమేలుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 30కి పైగా కుటుంబాలు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌తో పాటు దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రే, మాజీ సీఎం అశోక్ చవాన్, బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే, దివంగత నేత ప్రమోద్ మహాజన్ తదితర నేతల వారసులు రాజకీయ రంగంలోకి అడుగిడారు.

వీరిలో కొందరైతే తండ్రి, కుమారులు కూడా ముఖ్యమంత్రితో పాటు కీలక మంత్రి పదవులను చేపట్టినవారు ఉన్నారు. ఇప్పుడు జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ పలువురు నేతలు, వారి వారసులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

 ‘పవర్’ ఫుల్...

 రాష్ట్రంతోపాటు దేశ రాజకీయాల్లో పవార్ కుటుంబం కీలకపాత్ర పోషిస్తోంది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ దేశంలోని ప్రముఖ నాయకులలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఈయనకు తల్లి నుంచి రాజకీయ వారసత్వం లభించింది. ఆయన ప్రస్తుతం యూపీఏ ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా ఉండగా, ఆయన సోదరుని కుమారుడు అజిత్ పవార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం బారామతి లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా ఉన్న ఆయన కూతురు సుప్రియా సూలే మళ్లీ ఈసారి ఎన్నికల బరిలో దిగారు.

 తండ్రి కుమారులిద్దరు ముఖ్యమంత్రులుగా...

 రాష్ట్ర రాజకీయాలలో తండ్రి కుమారులిద్దరు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఘనత చవాన్ కుటుంబీకులకు దక్కింది. దివంగత శంకర్‌రావ్ చవాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. కేంద్రంలో రక్షణమంత్రిగా కూడా విధులు నిర్వహించారు.

 ఆయన వారసుడైన అశోక్ చవాన్ కూడా సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. ముంబై 26/11 ఉగ్రవాదుల దాడుల ఘటన అనంతరం రాష్ట్రంలో మంత్రి పదవులతో పాటు పలు కీలక బాధ్యతలు నిర్వహించిన అశోక్ చవాన్‌కు ముఖ్యమంత్రి పదవి వరించింది. అయితే ఆదర్శ్ కుంభకోణంలో ఆయన పేరు రావడంతో పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం నాందేడ్ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు.

 రాష్ట్రంలో హవా ఠాక్రే లదే...

 శివసేన పార్టీ ఠాక్రే కుటుంబీకులకే వారసత్వంగా లభించింది. ఠాక్రే కుటుంబీకులు ఇంత వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయాలను తెరవెనుక నుంచే నడిపిస్తున్నారు. దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రే శివసేన పార్టీ స్థాపించారు.

ఆయన తర్వాత ఉద్ధవ్ ఠాక్రేను వారసుడుగా ప్రకటించడంతో బాల్‌ఠాక్రే సోదరుని కుమారుడైన రాజ్ ఠాక్రే శివసేన నుంచి బయటకు వెళ్లి మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీని ఏర్పాటు చేశారు. మరోవైపు బాల్‌ఠాక్రే మనుమడు, ఉద్ధవ్‌ఠాక్రే కుమారుడైన ఆదిత్య ఠాక్రే కూడా రాజకీయాల్లో రంగప్రవేశం చేశారు. ఈసారి ఎన్నికల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు.  

 దేశ్‌ముఖ్ కుటుంబీకులు...

 దివంగత మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ వారసులు కూడా రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఎనిమిదన్నరేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన విలాస్‌రావ్, ముంబై 26/11 ఉగ్రవాదుల దాడుల ఘటనతో పదవికి రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆయనకు కేంద్రమంత్రి పదవిని అప్పగించింది. ఆయ న మరణించిన తర్వాత కుమారుడు అమిత్ దేశ్‌ముఖ్, సోదరుని కుమారుడు దిలీప్ దేశ్‌ముఖ్ రాజకీయాల్లో రాణిస్తున్నారు.
 
 ముండే కుటుంబీకులు..

 బీజేపీ సీనియర్ నాయకుడైన గోపీనాథ్ ముండే కూడా రాష్ట్రంతోపాటు దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. సోదరుని కుమారుడు ధనంజయ్ ముండేతోపాటు ఆయన కుమార్తె పంకజా ముండేలు ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే గోపీనాథ్ ముండేతో వచ్చిన విభేదాల వల్ల ధనంజయ్ ముండే ఎన్సీపీలో చేరారు.

 మరోవైపు దివంగత ప్రమోద్ మహా జన్ కుమార్తె పూనమ్ మహాజన్ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో వాయవ్య ముంబై నుంచి మహాకూటమి అభ్యర్థినిగా పోటీ చేస్తున్నారు. దివంగత మాజీ సీఎం వసంత్‌దాదా పాటిల్ కుటుంబీకులలో ఆయన భార్య శాలినీతాయి పాటిల్, కుమారుడు ప్రతీక్, మనుమడు మదన్ పాటిల్‌కు మంత్రి పదవులు లభించాయి. ప్రస్తుత అటవీశాఖ మంత్రి పతంగ్‌రావ్ కదం కుమారుడు విశ్వజీత్  కదంను పుణే లోక్‌సభ నుంచి బరిలో ఉన్నారు.

రాష్ట్ర మంత్రి నారాయణ రాణే, ఆయన కుమారుడు నీలేష్ రాణే రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఎన్సీపీ సీనియర్ నాయకుడు  గణేష్ నాయక్‌తోపాటు ఆయన కుమారులు సంజీవ్ నాయక్, సందీప్ నాయక్‌లతోపాటు ఆయన సోదరుని కుమారుడు సాగర్ నాయక్‌లు రాజకీయాల్లో రాణిస్తున్నారు.

 సందీప్ నాయక్ ఎమ్మెల్యేగా, సంజీవ్ నాయక్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఈసారి కూడా సంజీవ్ లోక్‌సభ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలు జోరుగానే సాగుతున్నట్టు కనబడుతోంది.

>
మరిన్ని వార్తలు