ప్రజా సంక్షేమమే ధ్యేయం కావాలి

31 Mar, 2014 03:44 IST|Sakshi
ప్రజా సంక్షేమమే ధ్యేయం కావాలి

సివిల్ సర్వెంట్లకు రాష్ట్రపతి పిలుపు
 ఐఐపీఏ గోల్డెన్ జూబ్లీ వేడుకలను
 ప్రారంభించిన ప్రణబ్‌ముఖర్జీ  
 
 సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో సివిల్ సర్వీసులు కీలక భూమికను పోషిస్తున్నాయని, సివిల్ సర్వెంట్లు ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. ఆదివారం ఢిల్లీలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్(ఐఐపీఏ) గోల్డెన్ జూబ్లీ వేడుకలను రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టపర్చాలంటే శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ప్రజాసేవలో నాణ్యత ప్రమాణాలు పాటించడం అత్యంత ముఖ్యమని సూచించారు.

 ప్రజలు మరింత ప్రభావవంతమైన పాలనను కోరుకుంటున్నారని, వారు పరిపాలన వ్యవహరాల్లో లోపాలను ఎంతమాత్రం క్షమించబోరని అన్నారు. త్వరితగతిన అభివృద్ధి సాధించాలంటే నిర్ణయాలు తీసుకోవడంలోనూ వేగాన్ని కనబర్చాలన్నారు. అయితే ఆ నిర్ణయాలు సహేతుకంగా ఉండాలన్నారు. దీటైన భారతదేశాన్ని నిర్మించడంలో పబ్లిక్ సర్వీస్ వ్యవస్థలే ముఖ్య పాత్ర పోషిస్తాయని, అందుకే ఐఐపీఏ వంటి సంస్థలు ఉత్తమ పనితీరును కనపర్చాలని ఆకాంక్షించారు. పబ్లిక్ సర్వెంట్‌లను తీర్చిదిద్దడంలో ఐఐ పీఏ పనితీరు ఎంతో సంతృప్తికరంగా ఉందని అభినందించారు.
 
  అనంతరం ‘ఇండియన్ గవర్నెన్స్ రిపోర్ట్-2012’ , ‘జవహర్‌లాల్ నెహ్రూ అండ్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్’ పుస్తకాలను రాష్ట్రపతి ఆవిష్కరించారు. కార్యక్రమానికి విచ్చేసినందుకుగాను రాష్ట్రపతి ప్రణబ్‌కు రిటైర్డ్ ఐఆర్‌ఎస్, ఐఐపీఏ గోల్డెన్ జూబ్లీ కమిటీ చైర్మన్ బి.వి. కృష్ణకుమార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇతర అతిథులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఐఐపీఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, డెరైక్టర్, ఫేకల్టీ, అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు