ప్రియాంక- మో'ఢీ'

14 Apr, 2014 10:39 IST|Sakshi
ప్రియాంక- మో'ఢీ'

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీపై ప్రియాంక గాంధీ పోటీ చేస్తే ఎలావుంటుందో ఊహించండి. ఇదే నిజమైతే దేశం యావత్తు దృష్టి ఈ పోటీపైనే ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ ఆసక్తికర పోటీకి అవకాశం లేకపోలేదంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. మోడీ పోటీ చేస్తున్న వారణాసిలో సోనియా తనయ ప్రియాంక గాంధీని బరిలోకి దించాలని భావిస్తున్నారు. ఇక్కడ నుంచి ప్రియాంకను పోటీకి దించితే మోడీకి చెమటలు పట్టడం ఖాయమని కాంగీయులు అంచనా వేస్తున్నారు.

తన తల్లి సోనియా, సోదరుడు రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయబరేలీ, అమేథీలో ప్రజాకర్ష ప్రచారకర్తగా ఉన్న ప్రియాంక దూసుకుపోతున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ఆమె ఈ రెండు నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు. అయితే మోడీకి చెక్ పెట్టగల సమర్థురాలు ప్రియాంక గాంధీయేనని, ఆమెను వారణాసిలో పోటీకి దించాలన్న ప్రతిపాదన వచ్చింది. సీనియర్ నాయకులు ఇక్కడ నుంచి పోటీ చేయడానికి వెనుకంజ వేస్తున్న నేపథ్యంలో ఈ ఆలోచన చేశారు.

పోటీకి ప్రియాంక విముఖత వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ పెద్దలు వెనక్కు తగ్గారు. మోడీపై పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని ప్రియాంక గాంధీ స్పష్టం చేయడంలో ఆసక్తికర పోటీ ప్రతిపాదన ఆదిలోనే ఆగిపోయింది. రాయబరేలీ, అమేథీ మాత్రమే పరిమితమవుతానని ఆమె పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు