పాపం పురందేశ్వరి

24 Apr, 2014 20:10 IST|Sakshi
పాపం పురందేశ్వరి

నిన్నటి వరకు కేంద్ర మంత్రిగా అధికారం చలాయించిన దగ్గుబాటి పురందేశ్వరి ఇప్పుడు కాషాయ కండువా కప్పుకున్నారు. కమలదళంలో చేరి కడప జిల్లా రాజంపేట నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే అక్కడ తెలుగు దేశం కార్యకర్తలు ఆమెకు మద్దతు ప్రకటించడం లేదు. పురందేశ్వరి వల్ల లాభం కంటే తమకు నష్టమే ఎక్కువ జరుగుతోందని టీడీపీ ఆందోళన చెందుతోంది. రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో కీలకంగా ఉన్న మైనార్టీ ఓటర్లు ఆమెను వ్యతిరేకిస్తుండటంతో తెలుగు తమ్ముళ్లూ ఆమెకు దూరందూరంగా ఉంటున్నారు.

రాజంపేట లోక్‌సభ పరిధిలో వైఎస్ఆర్ జిల్లాలో మూడు, చిత్తూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కోడూరు, రాజంపేట, రాయచోటి కడప జిల్లాలో ఉండగా.. మదనపల్లె, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. వీటిలో మొదటి నుంచీ మైనార్టీ ఓట్లు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా రాయచోటి, మదనపల్లి వంటి ప్రాంతాల్లో మరీ ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడు నియోజకవర్గాల్లో ఆరింట టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులుండగా.. మదనపల్లెను మాత్రం బీజేపీకి కేటాయించారు. అయితే మైనారిటీ ఓటర్లు ఆమెకు మద్దతు పలికే విషయంలో మాత్రం ముఖం చాటేస్తున్నారు.

పురందేశ్వరి నియోజకవర్గంలో జోరుగానే పర్యటిస్తున్నారు. ఎన్టీఆర్ కూతురునని గుర్తు చేస్తున్నారు. ఆయన ఆశయాల మేరకు పని చేస్తానంటూ హామీలు గుప్పిస్తున్నారు. అయితే ఆమె ఎంత ఎన్టీఆర్ కూతురైనా.. పార్టీ మారి బీజేపీలో చేరడం, సమైక్యాంధ్ర విషయంలో చివరి వరకూ ఏమీ చేయలేకపోవడం వంటి అంశాలు ప్రజల్లో వ్యతిరేకతకు కారణమవుతున్నాయి. ఇది తమ అభ్యర్థులకు కూడా ఇబ్బందికరంగా మారిందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు ఇక్కడి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నాలుగేళ్లుగా జనంలో పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతన్ని ఎదుర్కోవడం కత్తిమీద సామేనని టిడిపి నాయకులు బహిరంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని వార్తలు