అసలు సమస్య పురంధ్రేశ్వరేనా?

18 Apr, 2014 11:39 IST|Sakshi
అసలు సమస్య పురంధ్రేశ్వరేనా?

* బిజెపిపై బాబుకు కోపమెందుకు?

* బిజెపికి బలం లేని సీట్లిచ్చిందెవరు?

* ఎన్టీఆర్ వారసత్వం ఇంకొకరికి దక్కకుండా ప్రయత్నమా?

చంద్రబాబు నాయుడు ఉన్నట్టుండి బిజెపిపై విరుచుకుపడటానికి కారణం ఏమిటి? బిజెపి బలహీనమైన అభ్యర్థులను పెట్టిందని, దీని వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ కే లాభమని ఆయన విమర్శించి, అసలు బిజెపితో పొత్తు ఉండబోదని అనడానికి కారణమేమిటి?


చంద్రబాబుకే పొత్తు అవసరం: నిజంగానే చంద్రబాబుకు పొత్తు అవసరం లేదని అనిపిస్తోనుకుంటే పొరబాటే. ఆయనే పొత్తు కోసం వెంపర్లాడారు. బిజెపి సదస్సులకు పిలవకుండానే వెళ్లి మరీ నరేంద్ర మోడీ తదితరులను కలిశారు. మోడీని తెగపొగిడారు. తెలంగాణ బిజెపి వద్దు వద్దంటున్నా యాసిడ్ ప్రేమికుడిలా వెంటపడ్డారు. తెలంగాణలో, సీమాంధ్రలో బిజెపి డిమాండ్లన్నిటినీ ఒప్పుకున్నారు. ఇదంతా బిజెపి అవసరం కాబట్టే చేశారు. సీమాంధ్రలో బీజేపీ కొండకు వెంట్రుక కట్టింది. వస్తే కొండ వస్తుంది. పోతే వెంట్రుక పోతుంది. కానీ టీడీపీకి మాత్రం ఈ సారి గెలవడం చాలా అవసరం.


నిజంగా బలహీనమైన క్యాండిడేట్లే సమస్యా?: చంద్రబాబు బిజెపికి ఇచ్చిన సీట్లు టీడీపీ గెలవడం కష్టం. అంతే కాదు. బిజెపికి చాలా చోట్ల కనీస బలం కూడా లేదు. ఉదాహరణకు రాజోలు, రాజమండ్రిలలో బిజెపి గెలవడం చాలా కష్టమన్నది రాజకీయాలు తెలిసిన వారి అభిప్రాయం.   బిజెపి సీట్లలో ఇలాంటివి చాలా ఉన్నాయి. 'గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం' అన్నట్లు ఈ సీట్లు ఇచ్చినప్పుడు చంద్రబాబుకు తెలియదా? ఇప్పుడు హఠాత్తుగా బిజెపి బలహీనమైన అభ్యర్థులను నిలబెడుతోందని విమర్శించడంలో అంతరార్థం ఏమిటన్నదే ప్రశ్న!


ఎన్టీఆర్ తనయతోనే సమస్యంతా: నిజానికి అసలు సమస్య ఇవేవీ కాదు. ఎన్టీఆర్ తనయ పురంధ్రేశ్వరికి రాజంపేట టికెట్ ఇవ్వడమే అసలు సమస్య. ఎన్టీఆర్ కుటుంబం నుంచి ప్రజలకు మరో ప్రత్యామ్నాయం రాకుండా ఉండటం, ఎన్టీఆర్ వారసత్వానికి పోటీదారు ఇంకొకరు రావడం చంద్రబాబుకు అసలు ఇష్టం లేదు. పురంధ్రేశ్వరి ఉంటే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తాను చక్రం తిప్పుతున్నానని చెప్పుకోవడం చంద్రబాబుకు చాలా కష్టం అవుతుంది.


తెగేదాకా లాగుతారా చంద్రబాబు?: గతంలోనూ చంద్రబాబు పురంధ్రీశ్వరి, దగ్గుబాటిలను ఇదే విధంగా దెబ్బతీశారు. 2004 నాటికి వీరిద్దరూ బిజెపిలో ఉన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు చాలా యాక్టివ్ గా పనిచేశారు కూడా. కానీ 2004 ఎన్నికల పొత్తు పేరిట వీరిద్దరినీ బిజెపి పక్కనపెట్టేలా చేశారు చంద్రబాబు. ఫలితంగా వారు కాంగ్రెస్ లో చేరారు. ఆ తరువాత దగ్గుబాటి ఎమ్మెల్యే అయ్యారు. పురంధ్రేశ్వరి ఎంపీ గా ఎన్నికై కేంద్ర మంత్రి అయ్యారు. ఇప్పుడు కూడా చంద్రబాబుకి పురంధ్రీశ్వరికి టికెట్ ఇవ్వడం ఇష్టం లేదు. అందుకే చంద్రబాబు కోపం తెచ్చుకున్నారు. కానీ బేరం పూర్తిగా తెగేదాకా చంద్రబాబు లాగగలరా అన్నది మాత్రం ప్రశ్నార్థకమే.

మరిన్ని వార్తలు