రబ్రీకి ఇంటిపోరు... లాలూకు ‘పుత్రిక వాత్సల్య’ తిప్పలు!

26 Mar, 2014 03:47 IST|Sakshi
రబ్రీకి ఇంటిపోరు... లాలూకు ‘పుత్రిక వాత్సల్య’ తిప్పలు!

 పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌కు పుత్రిక వాత్సల్యంతో, ఆయనభార్య రబ్రీదేవికి ఇంటిపోరుతో కొత్త కష్టాలొచ్చాయి. సరాన్ లోక్‌సభ నియోజకవర్గంలో బరిలోకి దిగనున్న రబ్రీదేవికి వ్యతిరేకంగా తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆమె సొంత సోదరుడు అనిరుధ్ ప్రసాద్ అలియాస్ సాధూయాదవ్ మంగళవారం ప్రకటించారు. 1990 నుంచి 2005 వరకు ఆర్జేడీ పాలనలో లాలూ బావమరిదిగా చక్రంతిప్పిన సాధూ వివాదాస్పద నేతగా నిలిచారు. తర్వాత 2009 లోక్‌సభ ఎన్నికల్లో లాలూతోనే గొడవ పెట్టుకొని పార్టీ నుంచి బహిష్కృతులయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బెట్టియాలో లాలూపై పోటీ చేసి భంగపడ్డారు.  
 
నేరస్థుడికి కీలక పదవి: పుత్రికపై వాత్సల్యం లాలూను చివరకు ఓ నేరస్థుడిని కాళ్లావేళ్లా పడి బతిమిలాడుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చింది. లాలూ పుత్రిక మీసా భారతి పాటలీపుత్ర నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేస్తోంది. అక్కడ జేడీయూ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ రంజన్ ప్రసాద్ యాదవ్, రామ్‌క్రిపాల్ యాదవ్ (బీజేపీ) బరిలో ఉన్నారు. ఈ ముగ్గురు యాదవులే.అదే వర్గానికి చెందిన గ్యాంగ్‌స్టర్ రిత్‌లాల్ యాదవ్ కూడా స్వతంత్ర అభ్యర్థిగా మంగళవారం నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బీజేపీ నేత సత్యనారాయణ్ సిన్హా హత్య కేసులో ముద్దాయిగా ప్రస్తుతం పాట్నా జైలులో ఉన్న అతనికి సాధారణ ఎన్నికలలో పోటీ చేసేందుకు దిగువ కోర్టు అనుమతి ఇచ్చింది.

ఇలా పాటలీపుత్ర నియోజకవర్గంలో యాదవుల ఓట్లన్నీ చీలిపోతే తన కుమార్తెకు కష్టాలు తప్పవని గ్రహించిన లాలూ అప్రమత్తమయ్యారు. గత సోమవారం రాత్రి రిత్‌లాల్ స్వగ్రామానికి వెళ్లి అతని తండ్రి రామసిశా రాయ్‌తో మంతనాలు జరిపారు. రిత్‌లాల్ పోటీ నుంచి విరమించేలా, అలాగే మీసా భారతికి మద్దతు తెలిపేలా ఒప్పించారు. ఇందుకు ప్రతిఫలంగా రిత్‌లాల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రకటన జారీ చేశారు. అంతేకాదు 2015 అసెంబ్లీ ఎన్నికల్లో రిత్‌లాల్ తండ్రికి ఆర్జేడీ తరఫున టికెటు ఇచ్చేందుకు లాలూ ఒప్పందం కుదుర్చుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
 

>
మరిన్ని వార్తలు