రఘురాజుకు డౌటే

10 Apr, 2014 00:45 IST|Sakshi
కనుమూరి రఘురామకృష్ణంరాజు

తమకే కావాలంటున్న కృష్ణంరాజు, గంగరాజు
చంద్రబాబుపైనే రఘురాజు ఆశలు

 
 సాక్షి ప్రతినిధి, ఏలూరు : బీజేపీలో తనకు ఎదురే లేదని చెప్పుకున్న బీజేపీ నేత, పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజు (రఘురాజు)కు నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సీటు ఇవ్వడం ప్రశ్నార్థకంగా మారింది. ఐదు నెలల క్రితమే రాజకీయ అరంగేట్రం చేసి.. అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను నిర్ణయించే స్థాయిలో పావులు కదుపుతున్నట్లు హడావుడి చేసిన ఆయన ఇప్పుడు తన సీటు కోసం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.


 నరసాపురం ఎంపీ సీటు కోసం టీడీపీ అధినేత చంద్రబాబుతో లోపారుకారీ ఒప్పందం చేసుకున్న రఘురాజు కొద్దినెలల క్రితం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. బీజేపీ అధిష్టానాన్ని కూడా మచ్చిక చేసుకుని ఎంపీ స్థానాన్ని దక్కించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తన సీటుకు ఢోకా లేదనుకున్న ఆయన తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లోనూ వేలు పెట్టారు. పలువురు నేతలను చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి టీడీపీలో చేర్పించి వారికి సీట్లివ్వాలని సూచిం చారు. దీంతో ఆయా నియోజకవర్గాల తెలుగుదేశం నేతలు రఘురాజు తీరుపై కారాలు మిరియాలు నూరారు.

ఈ తంతు ఇలా నడుస్తుండగానే బీజేపీ, తెలుగుదేశం మధ్య పొత్తు వ్యవహారం రసకందాయంలో పడినా ఎట్టకేలకు కుదిరింది. అనుకున్నట్లుగానే చంద్రబాబు నరసాపురం సీటును బీజేపీకి వదిలేశారు. కానీ అక్కడ రఘురాజు అభ్యర్థిత్వానికి మాత్రం భరోసా ఇవ్వలేకపోతున్నారు.

 రెబల్‌స్టార్ ఒత్తిడి

 నరసాపురం ఎంపీ సీటు కోసం రఘురామకృష్ణంరాజుతోపాటు సినీ ప్రముఖుడు, మాజీ కేంద్ర మంత్రి యూవీ కృష్ణంరాజు తొలినుంచీ పోటీ పడుతున్నారు. రఘురాజు కంటే ముందే ఆయన బీజేపీలో చేరి తనకున్న విస్తృత పరిచయాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్టీఏ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయనకు బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని నరసాపురం సీటును చేజిక్కించుకునేందుకు కృష్ణం రాజు పావులు కదుపుతున్నారు.

జిల్లా బీజేపీలోని ఒక వర్గం ఆయనకే సీటివ్వాలని అగ్ర నేతలను కోరుతోంది. తాజాగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, లైలా గ్రూపు కంపెనీల అధినేత గోకరాజు గంగరాజు (గంగతాతరాజు) అదే సీటు కోసం ప్రయత్నిస్తుండటంతో రఘురాజు అవకాశాలకు గండిపడ్డాయి. వీహెచ్‌పీ నాయకుడైన ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నారుు. వాటిని ఆధారం చేసుకుని గంగరాజు ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

 చంద్రబాబుపై ఆశలు

 దీంతో రఘురాజు పరిస్థితి గందరగోళంగా మారింది. చంద్రబాబుపైనే ఆయన పూర్తిగా ఆధారపడినట్లు ప్రచారం జరుగుతోంది. చివరి నిమిషంలో అయినా చంద్రబాబుతో బీజేపీ పెద్దలకు రికమండ్ చేయించుకుని నరసాపురాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. అయితే బీజేపీలోని ఒకవర్గం రఘురాజును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. తన వ్యా పారాలను కాపాడుకోవడానికే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని, అలాం టి వ్యక్తికి ఎలా సీటిస్తారని ఆ వర్గం బీజేపీ జాతీయ నేతలను ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.

అదీగాక చంద్రబాబు వ్యూహంలో భాగంగానే రఘురాజు బీజేపీలోకి వచ్చారని.. ఈ దృష్ట్యా ఆయనకు సీటు ఇచ్చినా పేరుకు బీజేపీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తారని ప్రత్యర్థులు వాదిస్తున్నారు. దీంతో నరసాపురం సీటు విషయంలో బీజేపీ అధిష్టానం సతమతం అవుతోంది. బీజేపీ రాష్ట్ర శాఖ తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ ఎంపీ స్థానం కోసం పట్టుబడుతోంది.

 ఒకవేళ ఆ దిశగా చర్చలు సఫలమై కాకినాడ సీటును బీజేపీకి ఇస్తే కృష్ణంరాజును అక్కడి నుంచి పోటీ చేయించే యోచనలో బీజేపీలో నేతలు ఉన్నారు. అది జరగని పక్షంలో నరసాపురం సీటు ఎవరికివ్వాలనే దానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. దీంతో రఘురాజు పరిస్థితి ఇరకాటంలో పడింది.

>
మరిన్ని వార్తలు