-

పోలింగ్ రోజున అమేథీకి షాకిచ్చిన రాహుల్

7 May, 2014 11:57 IST|Sakshi
పోలింగ్ రోజున అమేథీకి షాకిచ్చిన రాహుల్
ఉత్తరప్రదేశ్ లో అద్భుతం జరిగింది. ఎవరూ ఊహించని విధంగా ఎన్నికల రోజు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన నియోజకవర్గంలో పోలింగ్ రోజున ఉన్నారు. గాంధీ-నెహ్రూ కుటుంబం తమ కంచుకోటలైన రాయబరేలీ, అమేథీల్లో పోలింగ్ రోజున ఉండటం కనీసం పదిపదిహేనేళ్లలో జరగలేదు. తమ వోటర్లపై వారికి అంత నమ్మకం ఉంది. 
 
రాహుల్ ఉదయమే ఫుర్సత్ గంజ్ విమానాశ్రయం చేరుకుని, అక్కడనుంచి నియోజకవర్గంలో చాలా పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పార్టీ కార్యకర్తలతో ఆయన ప్రత్యేకంగా చర్చలు కూడా జరిపారు. అమేథీ లోకసభ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి స్మృతి ఇరానీ, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుమార్ విశ్వాస్ లు గట్టి పోటీ ఇవ్వడంతో రాహుల్ స్వయంగా పోలింగ్ రోజున హాజరయ్యారని తెలుస్తోంది. రాహుల్ స్వయంగా ఒక పోలింగ్ బూత్ లో బ్లాక్ బోర్డ్ పై కమలం గుర్తు ఉందని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.
 
ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ అమేథీలో ఎన్నికల సభలో మాట్లాడటం, దానికి భారీ సంఖ్యలో జనం హాజరుకావడంతో వాతావరణంలో గణనీయమైన మార్పు వచ్చిందని పరిశీలకులు అంటున్నారు. అందుకే రాహుల్ స్వయంగా పోలింగ్ సరళిని పరిశీలించేందుకు రంగంలోకి దిగారని అంటున్నారు.
మరిన్ని వార్తలు