‘ప్రధాని అయ్యేందుకు మోడీకే నైతికత’

18 Apr, 2014 05:07 IST|Sakshi
‘ప్రధాని అయ్యేందుకు మోడీకే నైతికత’

ముంబై: లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి మారొచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో.. మోడీకి మాత్రమే ప్రధాని అయ్యేందుకు నైతికత ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంచేశారు. ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏ 300 సీట్ల మార్కును చేరుకుంటుందని, మోడీ ప్రధాని అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
 
ప్రధాని పదవిని చేపట్టేందుకు పాలనా దక్షతతోపాటు నైతికత అవసరమని, అది  మోడీకే ఉందన్నారు. మోడీపై విభజనవాది అన్న ముద్ర వల్ల ఎన్‌డీఏకు తగినంత మెజారిటీ రాకపోవచ్చని, అప్పుడు కొత్త మిత్రులను ఆకర్షించేందుకు ప్రధానిగా రాజ్‌నాథ్ పేరు తెరపైకి వస్తుందంటూ సాగుతున్న ఊహాగానాలపై గురువారమిక్కడ విలేకరులు ప్రశ్నించగా ఆయన ఈ మేరకు స్పందించారు.
 
మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో ఎన్‌డీఏలో 24 పార్టీలున్నాయని, ఇప్పుడు ప్రధాని అభ్యర్థిగా మోడీ ఉన్నప్పుడు కూడా 25 పార్టీలున్నాయన్నారు. తమది సమైక్య పార్టీనే కానీ విభజన పార్టీ కాదన్నారు.

మరిన్ని వార్తలు