ప్రజా ‘దాసు’డు

6 May, 2014 19:21 IST|Sakshi
రామ్‌సుందర్ దాస్

 రామ్‌సుందర్ దాస్,  ప్రస్తుతం జరుగుతున్న సాధారణ ఎన్నికలలో పోటీ చేస్తున్న అత్యంత వయో వృద్ధుడు. ఈయన వయసు కేవలం 93 సంవత్సరాలు మాత్రమే.  ఈయన జనతాదళ్ పార్టీ సభ్యుడు. ఉత్తర బీహార్‌లోని హాజీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.  పతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు మెరూన్ రంగులో ఉన్న ఒక కారు దాస్ ఇంటి ముందు ఆగుతుంది. ఆ కారులో ఒక క్షురకుడిని తీసుకు వస్తారు. అతగాడు దాసుగారికి క్షురకర్మ చేస్తాడు. ఎందుకంటే వయోభారం వల్ల ఆయన తనకు తాను చేసుకోలేకపోతున్నారు.

 దాస్‌కి నడవడం కష్టంగా ఉంది. ఒక్కోసారి మాట్లాడటం కూడా ఇబ్బందికరంగా మారుతోంది.  1921, జనవరి 9 న జన్మించిన దాస్, దేశంలో లోక్సభకు పోటీ చేసేవారిలో అత్యంత వయో వృద్ధుడు.  కిందటి పార్లమెంటు ఎన్నికలలో రిషాంగ్ కేషింగ్ (94)అత్యంత వృద్ధ పార్లమెంటు సభ్యుడిగా గుర్తింపు పొందారు.  ఈ సారి జరుగుతున్న ఎన్నికలలో దాస్ నామినేషన్ వేసిన తరువాత, ఏప్రిల్ 16వ తేదీన ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. వెళ్లడమంటే ఆయనంతట ఆయన వెళ్లలేదు, ఇద్దరు పరిచారకులు ఆయనను  మోసుకొచ్చి వేదిక మీద కూర్చోబెట్టారు.  హిజాపూర్‌లో ఎన్నికలు మే 7 వ తేదీన జరగనున్నాయి. అయితే దాస్ మాత్రం కేవలం నాలుగైదు సార్లు మాత్రమే ఎన్నికల ప్రచారం చేయగలిగారు. ఇంత వృద్ధాప్యంలో ఎన్నికలలో ఎందుకు పోటీ చేస్తున్నారని ఆయనను ప్రశ్నిస్తే, ‘‘నేను నడవలేనని ఎవరన్నారు? నా ఆఖరి శ్వాస వరకూ నేను రాజకీయాలలో ఉంటాను, నా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాను’’ అంటారు దాస్.

 భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందరే దాస్ 1945లో రాజకీయాలలోకి ప్రవేశించారు. అతి కొద్దికాలం... ఏప్రిల్ 1979 నుంచి 1980 ఫిబ్రవరి వరకు బీహార్ ముఖ్యమంత్రిగా చేశారు.  బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో రెండు సార్లు విజయం సాధించారు. పార్లమెంట్ సభ్యుడిగా రెండుసార్లు గెలిచారు.  నిజాయితీ గల రాజకీయనాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తన రెండంతస్తుల ఇంట్లోఅతి సామాన్యంగా  నివసిస్తున్నారు. మూడు మిలియన్ల నగదు, ఒక పాత అంబాసిడర్ కారు ఉన్నట్లుగా ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు దాస్.

 అనారోగ్యంగా ఉంటే ఏ విధంగా ప్రజలకు సేవ చేయగలరు? అని ప్రశ్నిస్తే,  ‘‘నేను అనారోగ్యంతో బాధపడుతున్నారని ఎవరన్నారు? నియోజక వర్గ అభివృద్ధి కోసం, పార్లమెంట్ సభ్యులకిచ్చే ఫండ్‌ని సక్రమంగా ఖర్చుచేసిన వారిలో నేనే అత్యుత్తమంగా నిలిచాను’’ అంటారు దాస్. ఎటువంటి అభివృద్ధి పనులు చేశారని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి ఆయన మౌనం వహిస్తారు.  దాస్‌కి గతంలో రెండుసార్లు గుండెకు శస్త్రచికిత్సలు జరిగాయి. రాజగిరిలో జరిగిన పార్టీ సమావేశానికి హాజరయినప్పుడు ఆయన కుప్పకూలారు. బీహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఆంబులెన్స్ పిలిపించి, అందులో దాస్‌ను పాట్నా ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం  ఢిల్లీ పంపారు.

 ఆయన మాటలలో కూడా మధ్యమధ్యలో తడబాటు, మతిమరపు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  ‘‘ఇదీ నా పరిస్థితి, కొన్ని విషయాలు మర్చిపోతున్నాను. ఇంతకు ముందు నేను యోగా చేసేవాడిని. ధ్యానం కూడా చేసేవాడిని. ప్రస్తుతం అవేమీ చేయట్లేదు’’ అంటారు దాస్.  శరీరంలో సత్తువ లేకపోవడంతో ప్రచారానికి దూరంగా ఉన్నారు దాస్. ఆయనను రాజకీయాల నుంచి ఎప్పుడు రిటైర్ అవుతారని ప్రశ్నిస్తే... ‘‘నేను కిందటి ఎన్నికల (2009) లో పోటీ చేయకూడదనుకున్నాను. కాని అప్పటి ముఖ్యమంత్రి అందుకు అంగీకరించలేదు. ఈ సారి కూడా అంతే. పోటీకి దూరంగా ఉందామనుకున్నాను. కాని నితీశ్, నా ప్రజలు నన్ను పోటీ చేయమని ఒత్తిడి చేశారు’’ అంటారు దాస్.  ‘‘అయితే ఇది నా ఆఖరి ఎన్నికల సంగ్రామం. అది మాత్రం వాస్తవం’’ అంటారు.  ఇంతకుముందు దాస్‌కి ఓటు వేసిన ఓటర్లు, ‘ఇదే ఆయన చివరి పోటీ’ అంటున్నారు.  ‘‘రామ్‌విలాస్‌పాశ్వాన్ (లోక్‌జనశక్తి పార్టీ) ని ఓడించడానికి, కిందటిసారి మేం దాస్‌కు ఓట్లు వేశాం’’ అంటున్న సదరు ఓటర్లు, ‘‘ఈసారి మాత్రం దాస్‌కు ఓటు వేయలేం, ఎందుకంటే ఆయన కనీసం నడిచే స్థితిలో కూడా లేరు’’ అంటున్నారు.

 ‘‘దాస్ నిజాయితీకి మారు పేరు, సామ్యవాది. అందువల్లే మేం ఆయనకు 2009లో ఓట్లు వేసి గెలిపించాం. అయితే ఆయన మమ్మల్ని నిరాశపరిచారు’’ అంటున్నారు ఓటర్లు.  ‘‘ఆయన ఇంక రాజకీయాలకు రాజీనామా చేయాలి. ఇప్పుడు ఆయన గెలిచినా కూడా, ఈ వయస్సులో ఆయన మాకు ఏ మంచి చేయగలరు?’’ అని ప్రశ్నిస్తున్నారు ఓటర్లు.  ఏది ఏమైనా ఇంత పెద్ద వయసులో కూడా సేవ చేయడానికి అత్యుత్సాహంగా ఉన్న దాస్‌కు సలాం చేయాల్సిందే.

మరిన్ని వార్తలు