నేడు పలకజీడిలో రీపోలింగ్

13 May, 2014 01:10 IST|Sakshi
నేడు పలకజీడిలో రీపోలింగ్

వై.రామవరం, న్యూస్‌లైన్ :మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడిన తూర్పు ఏజెన్సీలోని వై.రామవరం మండల సరిహద్దు ప్రాంతమైన విశాఖ జిల్లా కొయ్యూరు మండలం యు.చీడిపాలెం పంచాయతీ పలకజీడిలో మంగళవారం రీపోలింగ్ జరుగుతోంది. ఈ నెల ఏడున సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలకజీడి పోలింగ్ బూత్‌ను మావోయిస్టులు స్వాధీనం చేసుకుని, ఎన్నికల సామగ్రి, ఈవీఎంలు, జీపునకు నిప్పంటించిన విషయం తెలిసిందే. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరగ్గా, పలకజీడిలో మాత్రం మావోల విధ్వంసక చర్యలతో పోలింగ్ నిలిచిపోయింది. 400 ఓట్లు ఉన్న పలకజీడి గ్రామం చుట్టూ అధిక మెజారిటీ కోసం వివిధ రాజకీయ పార్టీల నాయకులు తిరుగుతున్నారు. అందరి దృష్టి పలకజీడి రీపోలింగ్‌పై కేంద్రీకృతమైంది.
 
 భారీ పోలీసు బందోబస్తు మధ్య, తుపాకీ నీడలో ఈ రీపోలింగ్ జరగనుంది. ముందు జాగ్రత్త చర్యగా ఏఓబీలో భారీగా పోలీసు బలగాలు మోహరించి, అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. తూర్పు-విశాఖ సరిహద్దు అటవీ ప్రాంతాన్ని పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. రీపోలింగ్‌ను పోలీసులు సవాలుగా తీసుకుని, పోలింగ్ బూత్ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. తూర్పు, విశాఖ జిల్లాలకు చెందిన సుమారు రెండు వేల మంది పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. రెండు జిల్లాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు వై.రామవరం పోలీసు స్టేషన్‌లో మకాం వేసి, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పోలీసు భద్రత మధ్య ఎన్నికల సామగ్రిని సోమవారం సాయంత్రానికి పలకజీడి గ్రామానికి తరలించారు.
 
 

మరిన్ని వార్తలు