47 నామినేషన్లు తిరస్కరణ..!

11 Apr, 2014 05:36 IST|Sakshi

అసెంబ్లీ బరిలో 227 మంది
లోక్‌సభకు 37 మంది పోటీ
 
 సాక్షి, కరీంనగర్ : జిల్లాలోని 13 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల ఎన్నికలకు సంబంధించి ఈనెల 2 నుంచి 9 వరకు నామినేషన్లు స్వీకరించారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 270 మంది 500 నామినేషన్ల సెట్లు దాఖలు చేశారు. గురువారం పరిశీలనలో 43 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 227 మంది బరిలో నిలిచారు. రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో 41 మంది 70 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులోంచి నాలుగు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 37 మంది బరిలో ఉన్నారు. ఈనెల 12న నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశముంది.

  హుస్నాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి గట్టి దెబ్బతగిలింది. నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ విజయేందర్‌రెడ్డిని ఆ పార్టీ ముందుగానే ప్రకటించింది. దీంతో టికెట్టు విజయేందర్‌రెడ్డికే వస్తుందని అందరూ భావించారు. నాటకీయ పరిణామాల మధ్య పార్టీ బీ ఫామ్ తెచ్చుకున్న దేవిశెట్టి శ్రీనివాసరావు ఈనెల 9న నామినేషన్ వేశారు. అయితే ఏ ఫాం సమర్పించకపోవడంతో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది.


  హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన   ప్యాట రమేశ్ బీఫాం సమర్పించకపోవడంతో తిరస్కరణకు గురైంది.  టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి పెద్దపల్లి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. బీఫాం రాకపోవడంతో నామినేషన్ తిరస్కరణకు గురైంది.


  టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా కోరుట్ల నియోజకవర్గం బీజేపీకి కేటాయించా రు. అక్కడ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి సాంబరి ప్రభాకర్ పార్టీ తరఫున నామినేషన్ వేశారు. బీఫాం లేకపోవడంతో తిరస్కరణకు గురైంది.
  రామగుండంలో కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేసిన కోలేటి దామోదర్ బీ ఫారం సమర్పించకపోవడంతో తిరస్కరించారు. పెద్దపల్లి పార్లమెంట్ కునామినేషన్ వేసిన సిరిపురం మాణిక్యం బీ ఫాం ఇవ్వకపోవడంతో తిరస్కరణకు గురైంది.


  వేములవాడలో కాంగ్రెస్ టికెట్ బొమ్మ వెంకటేశ్వర్లుకు కేటాయించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగు మనోహర్‌రెడ్డి  నామినేషన్ వేశారు. బీఫాం లేకపోవడంతో నామినేషన్‌ను తిరస్కరించారు. టీఆర్‌ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సతీమణి కల్వకుంట్ల సరోజ, మంథనిలో పుట్ట  శైలజ నామినేషన్లు తిరస్కరించారు.
 
 

మరిన్ని వార్తలు