పెన్షన్ టెన్షన్

26 Apr, 2014 02:48 IST|Sakshi
పెన్షన్ టెన్షన్

* ఏళ్ల తరబడి డీఆర్‌ను ఎగవేసిన బాబు
* ప్రతిపక్షంలోనైనా కూర్చుంటా...
* కానీ పెన్షనర్ల డిమాండ్లు నెరవేర్చేది లేదంటూ మొండి వైఖరి
* వైఎస్ హామీతో ఎన్నికల ముందు హడావుడిగా జీవోలు

 
 2003 ఆగస్టు 15..
 కొత్తగూడెంలోని ఆర్డీఓ కార్యాలయం...
 పెన్షనర్ కృష్ణమూర్తి ఆత్మహత్య చేసుకున్నారు...
 కారణం: ఏళ్ల తరబడి కరవు భత్యం (డీఆర్) ఎగవేస్తున్న చంద్రబాబు ప్రభుత్వ వైఖరిపై నిరసన
 వయసుడిగిన దశలో మరో జీవనాధారం లేని లక్షలాది విశ్రాంత ఉద్యోగులకు భరోసా ఏది?
 రోగానికీ, నొప్పికీ, ఆకలికీ...  అన్నింటికీ ఆసరా ఏది?
 ...పెన్షన్!

కానీ ఆ పెన్షన్‌ను కూడా ప్రభుత్వం సరిగ్గా ఇవ్వకపోతే...? ఏళ్ల తరబడి కరవు భత్యమూ (డీఆర్) ఇవ్వకపోతే...? డీఆర్ బకాయిలనూ సైతం ఎగ్గొడితే..? పనికొచ్చినన్నాళ్లూ వారి చేత యంత్రాల్లా పనిచేయించుకున్న ప్రభుత్వమే... రిటైరయ్యాక కరివేపాకుల్లా వదిలేస్తే..? పెన్షనర్లు జీవితం నుంచే రిటైరైపోతే... ఆ ఫ్యామిలీ పెన్షన్లపై ఆధారపడే కుటుంబాలను పట్టించుకునేదెవరు..?  2001 నుంచి 2003 దాకా... నాటి చంద్రబాబు ప్రభుత్వం పెన్షనర్ల పట్ల అమానుషంగా వ్యవహరించింది.
 
చింతకింది గణేష్: ఓటర్లుగా కాదు, కనీసం మనుషులుగానైనా గుర్తించలేదు. అదేమంటే... ప్రభుత్వ ఉద్యోగులు సరిగ్గా ఎప్పుడు పనిచేశారంటూ గద్దించారు. అవసరమైతే ప్రతిపక్షంలోనైనా కూర్చుంటాను గానీ జీవిత చరమాంకంలో ఆర్థికభరోసా కోసం ఉద్యమించే పెన్షనర్ల డిమాండ్లను నెరవేర్చేది లేదంటూ మొండికెత్తారు. దాదాపు 4.5 లక్షల మంది పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు అష్టకష్టాలను తట్టుకోలేక ఆందోళనలకు దిగారు. రోడ్డెక్కారు. ఉద్యమించారు. 2003 డిసెంబరు దాకా ఆదుకునే నాథుడే లేకుండా పోయాడు.
 
 ఎడాపెడా ఉద్యోగుల తొలగింపు, వయోపరిమితి కుదింపు, ప్రభుత్వ సంస్థల మూసివేత, ప్రైవేటీకరణ, కొత్త ఉద్యోగాలపై నిషేధం వంటి ఉద్యోగవ్యతిరేక చర్యలకు తోడు.. పెన్షనర్ల పట్ల కూడా అమానవీయంగా ప్రవర్తించిన ప్రభుత్వ వైఖరి ఉద్యోగవర్గాన్ని తీవ్రంగా కలచి వేసింది. వరుసగా ఐదు విడతల డీఆర్ కూడా ఎగ్గొట్టిన తీరు విమర్శలకు కారణమైనా బాబు సర్కారు పట్టించుకోలేదు. ఆనాడు అంతటి అమానుషానికి ఒడిగట్టిన చంద్రబాబే... ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన జీతభత్యాలు  ఇస్తామనీ, వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచుతామనీ నమ్మబలుకుతున్నారు!
 
 వైఎస్ వచ్చాకే భరోసా!

 డీఆర్ పెంపు, బకాయిల చెల్లింపుపై విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబాలు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి స్పందించారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే డీఆర్ విడుదల చేస్తామంటూ స్పష్టంగా ప్రకటించారు. దీంతో ఎన్నికల్లో ఓడిపోతాననే భయం, ఎన్నికలయ్యాక చూసుకోవచ్చులే అనే భావనతో 2004 ఫిబ్రవరిలో డీఆర్ ఇచ్చేందుకు చంద్రబాబు ముందుకొచ్చారు. ఎన్నికల ముందు (2004 ఫిబ్రవరి 21న...) జీఓ 156 జారీ చేశారు. 2004 ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి అదే  ఏడాది అన్నమాట ప్రకారం ఆగస్టు 9న (జీఓ నంబర్ 591) ద్వారా పెన్షనర్ల డీఆర్‌ను విడుదల చేశారు.
 
ప్రతిపక్షంలోనైనా కూర్చుంటానన్నారు
 డీఆర్ కోసం అనేక ఆందోళనలు చేశాం.  పెన్షనర్ల సంఘాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి, 2002లో జేఏసీని ఏర్పాటు చేసి పోరాటాలు చేశాం. అయినా చంద్రబాబు పట్టించుకోలేదు. ప్రభుత్వంతో జేఏసీకి జరిగిన ఓ సమావేశంలో ‘నేను ప్రతిపక్షంలోనైనా కూర్చుంటా కాని పెన్షనర్లకు డీఆర్ ఇచ్చే ప్రసక్తేలేద’న్నారు. అప్పట్లో వచ్చిన కొత్త పీఆర్‌సీ ప్రకారం పెన్షన్‌ను 1-7-1998 నుంచి అమలు చేయ కుండా 1-4-1999 నుంచి అమలు చేశారు. దీంతో 9 నెలల ఎరియర్స్, గ్రాట్యుటీ నష్టపోవాల్సి వచ్చింది.
- విశ్వాస్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకుడు  
 
 ఓటమికి ఇదీ ఓ కారణమే
 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమికి పెన్షనర్లకు డీఆర్ ఇవ్వకపోవడం కూడా ఒక కారణమే. పెన్షనర్లు పని చేయడం లేదు కాబట్టి కరువు భత్యం ఇవ్వాల్సిన అవసరం లేదనే సిద్ధాంతాన్ని తెచ్చారు. దాంతో ఆయనపై ఉద్యోగ, పెన్షనర్లలో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది.
 - ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం, పీడీఎఫ్
 
 హడావుడిగా జీఓలు
 డీఆర్ నిలిపివేయడంతో చంద్రబాబు ప్రభుత్వంపై పెన్షనర్లలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పెన్షనర్లకు డీఆర్ వెంటనే ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో చంద్రబాబు హడావుడిగా జీఓలు ఇచ్చారు.
 - ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి

మరిన్ని వార్తలు