హస్తం పార్టీలో అసంతృప్తి సెగలు

20 Mar, 2014 17:34 IST|Sakshi
హస్తం పార్టీలో అసంతృప్తి సెగలు

నల్లగొండ: తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు అందరి దృష్టి నల్లగొండ జిల్లాపైనే కేంద్రీకృతమైంది. జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ సీనియర్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ల ఉనికిని కూడా గుర్తిస్తున్నట్లు కనిపించడం లేదు. జిల్లా నాయకులతో మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ నాయకత్వం నిర్వహించిన సమావేశానికి మాజీ మంత్రి జానారెడ్డి, కోమటిరెడ్డి సోదరులు గైర్హాజరు కావడం చర్చనీయాంశం అయ్యింది. టీపీసీసీ నాయకత్వం ఒంటెద్దు పోకడలు పోతే తగిన గుణపాఠం చెబుతామంటూ వీరి అనుచర వర్గం సిద్ధమవుతోంది...!!

సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలోని పన్నెండు అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే ఆశావహుల జాబితా అగ్గి రాజేస్తోంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) టీపీసీసీకి నివేదించినట్లుగా చెబుతున్న ఈ జాబితాపై పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. ఎవరికి వారు తమ కుటుంబసభ్యుల పేర్లతో ఆయా నియోకవర్గాలకు పేర్లు ప్రతిపాదించడం, అదే జాబితాను ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ పంపినట్లు ప్రచారం జరగడంతో సిట్టింగు ఎమ్మెల్యేలే రగిలిపోతున్నారు. జిల్లా కాంగ్రెస్‌పై పట్టు సాధించేందుకు ఒక్కో నాయకుడు చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 

వాస్తవానికి టీపీసీసీ అధ్యక్షపదవి రేసులో ఉన్న మాజీ మంత్రి జానారెడ్డికి అవకాశం దక్కకపోవడం, జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కలిసి రావడంతో గ్రూపు రాజకీయాలకు ఊపు వచ్చింది. పార్టీ సంస్థాగత పదవులకు సంబంధించింది కాకపోయినా, ఎమ్మెల్యే టికెట్ల కోసం, ఎంపీ టికెట్ల కోసం సిఫారసు చేసిన పేర్ల దగ్గరే తగవు మొదలైంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గత ఎన్నికల సమయంలో టికెట్లు ఇచ్చిన వారిలో ముగ్గురు కొత్త వారు తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. జిల్లాలోని గుంపు రాజకీయాల పుణ్యమాని ఇద్దరు ఎమ్మెల్యేలకు ఎర్తు పెడుతున్నారన్న అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది.

తొలిసారి టికెట్‌తోనే, మహాకూటమి అభ్యర్ధిని భారీ మెజారిటీ తేడాతో ఓడించి లోక్‌సభ సభ్యుడిగా విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో చికాకులు సృష్టిస్తున్నారని, అదే సమయంలో ఆయన సోదరుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ అసెంబ్లీ స్థానంలోనూ ప్రత్యామ్నాయ పేరును ప్రచారంలోకి తెచ్చారు. పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో డీసీసీ అధ్యక్షుడు నష్టనివారణ చర్యలు చేపట్టారు.

‘నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల పేర్లను ఒక్కొక్కటే పంపించాం. ఇక్కడ ప్రత్యామ్నాయ పేర్లనేవీ డీసీసీ ప్రతిపాదించలేదు..’ అని డీసీ సీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు.  కానీ, త మ వర్గంగా లే రని భావిస్తున్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, దే వరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్‌లకు చెక్ పెట్టేందుకు ఈ రెండు చోట్లా మరికొందరి పేర్లు జాబితాలో చేరాయి.

ఇక, స్థానిక ఎన్నికల్లో పార్టీ వ్యూహంపై చర్చించడం, భీ-ఫారాల విషయంపై చర్చించేందుకు హైదరాబాద్ గాంధీ భవన్‌లో టీసీసీసీ అధ్యక్షుడు పొన్నాల, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లా నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావే శానికి అటు కోమటిరెడ్డి సోదరులు, ఇటు జానారెడ్డి హాజరు కాలేదు. ఒక దశలో  టీపీసీసీ నాయక త్వ ఉనికినే వీరు గుర్తించడం లేదా, అన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. ముగ్గురు కీలకమైన నాయకుల గైర్హాజరీతో ఈనెల 21వ తేదీన మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం.

‘టీపీసీసీ నాయకత్వం ఒంటెద్దు పోకడలతో జిల్లా కాంగ్రెస్ రాజకీయాలను కలుషితం చేయాలని చూస్తోంది. ఒకరిద్దరు నాయకులు ఆధిపత్యం చూపించాలని ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారిని దెబ్బకొట్టాలని చూస్తారా..? కాంగ్రెస్ క్రియాశీలక రాజకీయాలతో సంబంధం లేని వారిని తెరపైకి తెచ్చి టికెట్లు ఇప్పించుకోవాలని చూస్తారా..? ఇదే జరిగితే గుణపాఠం చెప్పడం ఖాయం..’ అని జిల్లా కాంగ్రెస్‌లోని ముఖ్యనాయకుడు ఒకింత తీవ్రంగానే హెచ్చరించారు.

జరుగుతున్న పరిణామాలు, నాయకుల మధ్య జరుగుతున్న సంభాషణలు, మాటల యుద్ధాన్ని సునిశితంగా పరిశీలిస్తే.. అంతా సీనియర్లే ఉన్న జిల్లా కాంగ్రెస్‌లో నాయకుల మనసు లు కలవడం లేదని, అంతా కలిసి పనిచేసే వాతావరణం కని పించడం లేదన్న అభిప్రాయం కలగక మానదు. ముందు ముందు మరెన్ని ఉదంతాలు జరుగుతాయో..? జిల్లా కాంగ్రెస్ నావ ఏ తీరానికి చేరనుందో అన్న అంశాలు ఆసక్తి గొల్పుతున్నాయి.

మరిన్ని వార్తలు