బాలయ్య ఆస్తులు రూ.424 కోట్లు

17 Apr, 2014 01:05 IST|Sakshi
బాలయ్య ఆస్తులు రూ.424 కోట్లు

అఫిడవిట్‌లో వెల్లడి..
హిందూపురంలో నామినేషన్
ధర్మవరం టీడీపీ అభ్యర్థి వరదాపురం సూరికి అవమానం

 
 హిందూపురం,అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా సినీనటుడు నందమూరి బాలకృష్ణ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తనకు రూ. 424.18 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అంతకుముందు హిందూపురం సమీపంలోని సూగూరు ఆంజనేయస్వామి దేవస్థానంలో బాలకృష్ణ కుటుంబసభ్యులతో కలసి పూజలు చేశారు. అనంతరం మహాత్మా గాంధీ, పూలే, అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి టీడీపీ నాయకులు, అభిమానులతో ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఒక సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు.

బాలకృష్ణ.. తనతో పాటు భార్య, కుమారుడు పేరిట సుమారు రూ. 424.18 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. తన పేరున రూ. 170.47 కోట్ల ఆస్తులు, భార్య వసుంధరాదేవి పేరిట రూ. 130.78 కోట్ల ఆస్తులు, కుమారుడు మోక్షజ్ఞ పేరున రూ. 122.92 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. తన తండ్రి ఎన్టీఆర్‌ను ఆదరించిన విధంగా తననూ గెలిపించాలని ప్రజలను కోరారు. తాను గెలిస్తే హిందూపురం అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, ధర్మవరం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి వరదాపురం సూరికి బాలకృష్ణ తీరుతో అవమానం ఎదురైంది. నామినేషన్ వేయడానికి వెళ్తున్న సమయంలో తన వెంట రావద్దంటూ సూరిని బాలకృష్ణ గట్టిగా హెచ్చరించారు. ‘మళ్లీ చెప్పాలా... పక్కకు వెళ్లు...’ అంటూ బాలయ్య హూంకరించడంతో చేసేది లేక సూరి వెనుదిరిగారు.
 
 

మరిన్ని వార్తలు