సబితా ఇంద్రారెడ్డి ఒక్కరే...

25 Apr, 2014 12:12 IST|Sakshi
సబితా ఇంద్రారెడ్డి ఒక్కరే...

ఎంతలో ఎంత మార్పు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక హోం మంత్రిత్వ శాఖ నిర్వహించిన చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యే పరిస్థితికి వచ్చారు. నోరు తెరిచి టిక్కెట్ అడిగినా అధిష్టానం ఆమెను కరుణించలేదు. తనతో పాటు పనిచేసిన మహిళా మంత్రులందరూ తిరిగి పోటీ చేస్తున్నా సబితకు మాత్రం ఆ అవకాశం దక్కలేదు.

సబితతో పాటు మంత్రులుగా పనిచేసిన వి.సునీత లక్ష్మారెడ్డి, జె.గీతారెడ్డి, డి.కె. అరుణ.. కాంగ్రెస్ తరపునే పోటీ చేస్తున్నారు. గల్లా అరుణకుమారి మాత్రం టీడీపీ తరపున బరిలో ఉన్నారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నుంచి వి.సునీత లక్ష్మారెడ్డి, జహీరాబాద్ (ఎస్సీ) స్థానం నుంచి జె.గీతారెడ్డి అసెంబ్లీకి పోటీకి పడుతున్నారు. డి.కె. అరుణ మహబూబ్నగర్ జిల్లాలోని తన సొంత నియోజకవర్గం గద్వాల్ నుంచి పోటీ చేస్తున్నారు.

కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి మారిన గల్లా అరుణ కుమారి చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె తనయుడు గల్లా జయదేవ్ కూడా గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇక వైఎస్సార్ హయాంలో మంత్రిగా పనిచేసిన కొండా సురేఖ ఈసారి వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. మహిళా మంత్రుల్లో ఒక్క సబితా ఇంద్రారెడ్డి మాత్రమే ఈసారి పోటీలో లేరు. కుమారుడి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ తన ఉనికిని చాటు ప్రయత్నం చేస్తున్నారీ మహిళా మాజీ హోంమంత్రి.

మరిన్ని వార్తలు