ఎంచుకో.. దోచుకో

25 Apr, 2014 01:15 IST|Sakshi
ఎంచుకో.. దోచుకో

సెలక్ట్ ఏరియా డెవలప్‌మెంట్.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డంపెట్టి తన బినామీలు, బంధుమిత్రులకు లాభం చేకూర్చేందుకు ఉద్దేశించిన బృహత్తర పథకం. ఇది అక్కడి రైతులను బికారీలుగా మారిస్తే తనవారిని రూ.వందల కోట్లకు అధిపతులను చేసింది. శిల్పారామం, సైబర్‌టవర్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సైబ రాబాద్ పోలీస్ కమిషనరేట్.. ఇలా ప్రతీసంస్థను ఆనుకుని తన బినామీ మురళీమోహన్‌కు చెందిన ‘జయభేరి’ ఎన్‌క్లేవ్, కౌంటీ,వ్యాలీలు ఉండేటట్టు ప్రణాళిక రూపొందించిన బాబు, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని వేలాది ఎకరాలను పథకం ప్రకారం కొల్లగొట్టారు.
 

 శ్రీగిరి విజయ్‌కుమార్ రెడ్డి

 చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఆయన బినామీలు రెచ్చిపోయారు. మాదాపూర్‌లో సైబర్ టవర్స్ ఏర్పాటు యోచనను మురళీమోహన్ బృందానికి బాబు లీక్ చేసిందే తడవుగా మాదాపూర్ పరిధిలోని సర్వే నంబర్ 65, 65(అ), 67(అ)లో రమీజా బీ, చాంద్ పాషా, నజీర్ అనే సాధారణ రైతుల నుంచి అతి చౌకగా ‘జయభేరి’ పేరుతో 22 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు వ్యవహారం పూర్తవగానే 1997 ఏప్రిల్ 27న చంద్రబాబు సైబర్ టవర్స్‌కు శంకుస్థాపన చేసి 1998 నవంబర్ 22న ప్రారంభించారు. సైబర్ టవర్స్, శిల్పారామాలను ఆనుకుని ఉన్న భూమిని ముందస్తు లీకులతో సొంతం చేసుకున్న మురళీమోహన్ అక్కడ జయభేరి ఎన్‌క్లేవ్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు.  
 
మూడు వెంచర్లు.. ఆరు కౌంటీలుగా

 శేరిలింగంపల్లి మండలంలో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వరంగ సంస్థలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ల వివరాలన్నీ భూసేకరణకు ముందుగానే బాబు తన బినామీలకు లీక్ చేశారు. దీంతో వారు కొనుగోలు చేసిన భూములను ఏపీఐఐసీ భూ సేకరణ నోటిఫికేషన్‌లోకి రాకుండా జాగ్రత్తపడ్డారు. ఆ తర్వాత జయభేరి రియల్ ఎస్టేట్ వ్యాపారం అనతికాలంలోనే మూడు వెంచర్లు, ఆరు కౌంటీలుగా వెలిగిపోయింది. గచ్చిబౌలిలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు చంద్రబాబు జనవరి 2004లో శంకుస్థాపన చేశారు. అంతకుముందే గచ్చిబౌలి సర్వే న ంబర్ 55,56,57,58లలో 18 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు సొంతం చేసుకున్న మురళీమోహన్‌కు చెందిన పయొనీర్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ, ఆ తర్వాత దాన్ని ‘జయభేరి పైన్ వ్యాలీ’ పేరుతో అభివృద్ధి చేసి విక్రయించింది. అదే పంథాలో గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ను అనుకుని ఉండే సర్వే నంబర్ 103, 105, 106,109లలో పదిహేను ఎకరాల్లో జయభేరి ఎన్‌క్లేవ్ పేరుతో వెంచర్ చేసి విక్రయించారు. కొండాపూర్‌లో జయభేరి నిర్మించిన సిలికాన్ కౌంటీ భూములు కూడా బాబు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొనుగోలు చేసినవే. కారుచౌకగా భూములు కొట్టేసిన ‘జయభేరి’.. చివరకు విక్రయించిన భూమిని సైతం కబ్జా చేసేం దుకు వెనుకాడలేదు. తాము కొనుగోలు చేసిన స్థలాన్ని మరో సంస్థకు జయభేరి అమ్మినట్టు బండరెడ్డి మధుసూదన్ అనే బాధితుడు ఫిర్యాదు చేయడంతో మురళీమోహన్‌పై 420 సెక్షన్ కింద కేసు నమోదైంది.

 భూ సేకరణ పేరుతో భారీ దందా

 2003లో చంద్రబాబు ప్రభుత్వం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోసం నానక్‌రాంగూడలో భూ సేకరణ పేరుతో భారీ దందా నడిపింది. ప్రభుత్వ అవసరాల కోసం భూమిని సేకరిస్తున్నామంటూ ఏపీఐఐసీ సర్వే బృందాలను రంగంలోకి దింపి అక్కడి రైతులు, భూ యజమానుల్లో భయాందోళనలు రేకెత్తించారు. తర్వాత ఆ భూములను ఏపీఐఐసీ నోటిఫికేషన్ నుంచి మినహాయించి సొంత బావమరిది  బాలకృష్ణ, ఆయన భార్య వసుంధర తదితరుల చేత చౌకగా కొనుగోలు చేయించారు. ఈ భూముల్లోనే నేడు భారీ భవంతులు లేవగా, దాన్ని ఆనుకునే జయభేరి ఆరెంజ్ కౌంటీ విస్తరించింది.  

 ‘సైబరాబాద్’లోనూ అవినీతి

 సైబరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ(సీడీఏ) ఏర్పాటులోనూ చంద్రబాబు అవినీతికి తెరతీశారు. ఐటీ జోన్‌లో మౌలిక సదుపాయాల సత్వర కల్పన కోసం  జీఓ ఎస్‌ఎం నంబర్ 21(జనవరి 20,2001) జారీ చేసి శేరిలింగంపల్లి మునిసిపాలిటీలోని 17 గ్రామాల పరిధిలో 51.70 చదరపు కిలోమీటర్ల మేరకు సైబరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ( సీడీఏ)ను విస్తరించారు. సీడీఏలో సైబర్‌టవర్స్‌కు 12 కి.మీల దూరంలో ఉన్న గోపనపల్లి మురికివాడలు, లంబాడీతండాలను చేర్చిన ప్రభుత్వం సైబర్‌టవర్స్‌ను ఆనుకుని  ఉన్న కొండాపూర్‌ను మాత్రం మినహాయించింది. ఇక్కడ తన భార్య భువనేశ్వరి, తన బినామీ సంస్థ జయభేరితోపాటు తన బంధువుల ఆస్తులుండడమే అందుకు కారణమంటూ అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. సీడీఏ ఉత్తర్వులు వచ్చిన సమయంలో కొండాపూర్‌లో ఆరు ఎకరాల విస్తీర్ణంలో జయభేరి  సిలికాన్ టవర్స్, మరో నాలుగు ఎకరాల్లో జయభేరి క్లబ్ నిర్మాణాలు ప్రారంభం కావడంతో డెవలప్‌మెంట్ చార్జీల భారాన్ని తప్పించేందుకే బాబు అలా చేశారన్న ఫిర్యాదులున్నాయి. అంతేకాక సీడీఏ ప్లాన్‌లో పేర్కొన్నట్టుగా దారిని 120:120 అడుగుల మేర విస్తరించాల్సి ఉన్నా తన జేబు సంస్థ జయభేరి భూములకు నష్టం కలుగుతుందన్న ఉద్దేశంతో విస్తరణను నిలిపేశారు.

మురికివాడలపై ప్రతాపం

 హైటెక్ సిటీలో విస్తృత మౌలిక సదుపాయాల కోసం సైబరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ అసలు ప్రాంతాలను వదిలేసి మురికివాడలపై తన ప్రతాపాన్ని చూపింది. సీడీఎ అమలు వల్ల నిర్మాణ చార్జీలు మూడింతలయ్యాయి. 2002 నుంచి సీడీఏ నిబంధనల ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలని నిబంధన విధించారు. హైదరాబాద్ మునిసిపల్, శివారు మునిసిపాలిటీల కంటే రెట్టింపు బెటర్‌మెంట్ చార్జీలు వడ్డించారు. నిర్మాణాల అనుమతులకు చదరపు మీటరుకు రూ.200 అదనంగా చెల్లించాలని షరతులు విధించారు. ఇది సాధారణ ప్రజలకు పెను శాపమైంది.

మరిన్ని వార్తలు