కండల వీరుడు.. ఎన్నికల యోధుడు

8 May, 2014 12:07 IST|Sakshi
కండల వీరుడు.. ఎన్నికల యోధుడు

కండలు తిరిగి గండర గండడిలా కనిపిస్తున్న ఈ వీరుడిని చూశారా? ఈయనేదో వెయిట్ లిఫ్టరో, బాడీ బిల్డరో అనుకుంటున్నారా? అవి మాత్రమే కాదు.. ప్రత్యర్థులకు తన కండలతో పాటు తన హిస్టరీతో దడ పుట్టిస్తున్న పార్లమెంటేరియన్ కూడా. ఈయన పేరు కేసీ సింగ్ బాబా. ఉత్తరాఖండ్లోని నైనిటాల్ - ఉధం సింగ్ నగర్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రెండుసార్లు ఎంపీగా నెగ్గారు. ముచ్చటగా మూడోసారి కూడా అక్కడినుంచే పోటీ చేస్తున్నారు. కేవలం అక్కడి ప్రత్యర్థులు మాత్రమే కాదు.. ఎంపీలుగా పోటీ చేస్తున్నవారందరిలోకీ అత్యంత ఫిట్నెస్ ఉన్న అభ్యర్థి ఈయనేనని అంతా అనుకుంటున్నారు. ఇంతకీ సింగ్ బాబా వయసు ఏమాత్రం ఉంటుందో ఊహించగలరా? అక్షరాలా 66 ఏళ్లు!! దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందే.. అంటే 1947 మార్చి నెలలో పుట్టిన ఈయన ఇప్పటికి ఒకసారి మునిసిపల్ చైర్మన్, రెండుసార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు ఎంపీగా పనిచేశారు.

ఇప్పటికీ ప్రతిరోజూ జిమ్కు వెళ్లి, గంటన్నర పాటు ఒళ్లంతా అలిసేలా వ్యాయామం చేయకపోతే ఈయనకు అస్సలు ఏమాత్రం కుదరదట. అలా చెయ్యకపోతే తనకు ఒళ్లు నొప్పులు మొదలవుతాయని, 50 కిలోల వెయిట్ లిఫ్టింగ్ చేస్తేనే కాస్త బాగుంటుందని సింగ్ బాబా చెబుతున్నారు. ప్రచారంలో తలమునకలుగా ఉన్నా సరే, ముందు పొద్దున్నే జిమ్కు వెళ్లాల్సిందే, వ్యాయామం చేయాల్సిందేనట.  మరో విషయం తెలుసా.. ఈయన పక్కా శాకాహారి. కాయగూరలు, ఆకు కూరలు తినే ఈయన ఇన్ని కండలు పెంచారు. ఉత్తరప్రదేశ్లో అత్యంత బలమైన వ్యక్తిగా అవార్డు, రెండుసార్లు జాతీయ ఛాంపియన్ షిప్, ఒకసారి ఆసియా ఛాంపియన్షిప్ కూడా గెలుచుకున్నారు.

గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై 90వేల ఓట్ల మెజారిటీతో నెగ్గినా, ఈసారి మాత్రం గట్టిపోటీయే ఉంది. బీజేపీ నుంచి భగత్ సింగ్ కోషియారీ, బీఎస్సీ నుంచి లయీక్ అహ్మద్, సమాజ్ వాదీ నుంచి అవతార్ సింగ్, ఆప్ నుంచి బల్లీ సింగ్ చీమా ఈయనతో పోటీపడుతున్నారు. కాంగ్రెస్ అంటే స్వతహాగా జనానికి ఉన్న ఆగ్రహంతో పాటు రెండుసార్లు ఎంపీగా చేయడంతో వ్యతిరేకత కూడా ప్రజల్లో ఉన్నట్లు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు