కాదేదీ ఎలక్షన్లకనర్హం!

21 Mar, 2014 16:08 IST|Sakshi
కాదేదీ ఎలక్షన్లకనర్హం!

చెరువులో చేప,


అడవిలో వెదురు,


అడవి పందీ,


ఏనుగు మంద....


పొలంలోని ఉల్లిగడ్డలు


ఇవి కూడా ఎన్నికల్లో ప్రధాన సమస్యలౌతాయా? కూడు, గుడ్డ, గూడు కన్నా ముఖ్యమైన ఎన్నికల ఇష్యూలుంటాయా? అధికధరలు, అవినీతి వంటి అంశాలకన్నా ముఖ్యమైనవి ఉంటాయా?


గోవా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే అక్కడ అన్నిటికన్నా ముఖ్యమైన ఎన్నికల ఇష్యూ చేప! గోవా ప్రజలకు చేపలంటే ఎంతో ఇష్టం. ప్రతి భోజనంలోనూ చేపలుండాల్సిందే. కానీ గత అయిదేళ్లలో చేపల ధరలు నూరు శాతం పెరిగాయి. ఇది గోవా వాసుల పర్సులు కరుసైపోయేలా చేస్తున్నాయి.


కొన్ని రకాల చేపలు అసలు మార్కెట్ లో దొరకడమే లేదు. వాటి పేరు వినగానే గోవన్ల నోట్లో లాలాజలం ఊరుతోంది. కానీ ధర ఆకాశంలో, లభ్యత పాతాళంలో ఉంటున్నాయి. ఉదాహరణకి సొరచేపలతో తయారుచేసే అంబాట్ తీఖ్ అనే కర్రీ అంటే గోవన్లు నాలిక కోసుకుంటారు. ఇప్పుడా కర్రీ దొరకడం లేదు. అదే గోవన్లకు అతిపెద్ద వర్రీ. అందుకే 'మత్స్యావతారాన్ని మాముందుంచే వాడికే మా ఓటు' అంటున్నారు గోవా ప్రజలు.


పశ్చిమ తీరం లోని గోవా నుంచి ఈశాన్య భారతదేశంలోని మిజోరాం కి వస్తే అక్కడ వెదురు శవపేటికలే ఎన్నికల ప్రధాన ఇష్యూ. అధికార కాంగ్రెస్ ఎన్నికల మానిఫెస్టోలో వెదురు తో చేసే శవపేటికలు సరఫరా చేస్తామన్నదే అతి ముఖ్యమైన వాగ్దానం.


మిజోలు వెదురుతో శవపేటికలను తయారు చేస్తారు. ఇప్పుడు అక్కడ వెదురు లభ్యత బాగా తగ్గిపోయింది. దీంతో శవపేటికలను తయారు చేయాలంటే చాలా ఇబ్బందులు వస్తున్నాయి. చనిపోయిన వారికి అంత్యక్రియలు చేయడానికి కావలసిన వెదురు శవపేటికలను ఎవరు అందిస్తామని చెబితే ఓట్లు వాళ్లకే పడతాయి. మిజో యూత్ ఫ్రంట్ ఇప్పటికే శవపేటికల డిమాండ్ ను ముందుకు తెచ్చింది. రాజకీయ పార్టీలు వెదురు శవపేటికల విషయంలో హామీల మీద హామీలు గుప్పించేస్తున్నారు.


కేరళలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో అడవిపందులు ఒక పెద్ద సమస్య. రాత్రిపూట పొలాల్లోచొరబడి అవి పంటల్ని నాశనం చేస్తాయి. దీంతో అక్కడి ఓటర్లు అడవిపందులను అదుపు చేసేవాడే మాకు ఎమ్మెల్యే కావాలని అంటున్నారు.


ఇక ఝార్ఖండ్ రాష్ట్రంలోని గ్రామాలకు వెళ్తే అక్కడ మాకు ఏనుగుల బెడద తగ్గించండి అన్నదే ప్రజల ఏకైక డిమాండ్. ఏనుగులు ఊళ్లను, పంటలను భారీగా దెబ్బతీస్తున్నాయి. ఏనుగులు ఇప్పటికే దాదాపు వంద మందిని తొక్కి చంపాయి. గ్రామీణులు ఒక నలభై ఏనుగుల్ని చంపేశారు. 'మాకు ఏనుగుల సమస్యను తొలగించండి. ఎవరు ఏనుగుల్ని తరిమితే వారికే మా ఓటు' అంటున్నారు వారు.

మరిన్ని వార్తలు