నిస్తేజం

3 May, 2014 00:42 IST|Sakshi
నిస్తేజం

- పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపలేకపోయిన కాంగ్రెస్ సభ
- చప్పగా సాగిన అధినేత్రి సోనియా ప్రసంగం
- పునర్విభజన బిల్లులోని అంశాలే ప్రస్తావన
- సీమాంధ్ర అభివృద్ధి ప్రస్తావన శూన్యం
- జనం లేక వెలవెలబోయిన సభా ప్రాంగణం

 
 అరండల్‌పేట(గుంటూరు), న్యూస్‌లైన్ : పార్టీ శ్రేణుల్లో నెలకొన్ని నిరాశ, నిస్పృహలను కొంత వరకైనా దూరం చూస్తుందనుకున్న కాంగ్రెస్ సభ మరింత నీరుగార్చింది.కార్యకర్తల్లో ఉత్తేజం నింపుతుందనుకున్న సోనియా ప్రసంగం చప్పగా సాగింది. అధినేత్రి వేంచేసినా సభాప్రాంగణం జనం లేక వెలవెల బోయింది. యూపీఏ చైర్‌పర్సన్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి గుంటూరు వచ్చారు. శుక్రవారం ఇక్కడి ఆంధ్రా ముస్లిం కళాశాలలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. సీమాంధ్రలోని పదమూడు జిల్లాలు ఉన్నా ఇక్కడి నాయకులు ఏరికోరి ఆమె సభ గుంటూరులో పెట్టేలా ప్రయత్నించినా సభను విజయవంతం చేయలేకపోయారు.  జిల్లాలోని 17 అసెంబ్లీ, మూడు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేందుకు చాలా చోట్ల అభ్యర్థులు ముందుకు రాలేదు. గుంటూరు పశ్చిమ, తెనాలి, వినుకొండ, సత్తెనపల్లి అసెంబ్లీ నియోకజవర్గాల అభ్యర్థులు మినహా మిగిలిన ఎవరూ ప్రజలకు అంతగా పరిచయం లేరు.

బాపట్ల ఎంపీ అభ్యర్థిగా మరోసారి బరిలో నిలిచిన పనబాక లక్ష్మి తప్ప నరసరావుపేట, గుంటూరు పార్లమెంటు అభ్యర్ధులు ఇంతకు ముందు ప్రజలకు పరిచయం లేదు. ఈ పరిస్థితిని అధిగమించి కనీసం గుంటూరు జిల్లాలోనైనా క్యాడర్‌లో ఉత్తేజం నింపుతారని భావించిన నాయకులకు సోనియా సభ నిరాశే మిగిల్చింది. సీమాంధ్ర  అభివృద్ధికి, సంక్షేమానికి కొత్తగా హామీలేవీ ఇవ్వలేదు. సీమాంధ్రుల మనోభావాలను, ఆవేదనను అర్థం చేసుకోగలన ని చెప్పిన సోనియాగాంధీ సీమాంధ్రులకు ఏమి కావాలో గుర్తించలేకపోయారు. రాష్ట్ర విభజన సందర్భంగా పునర్విభజన బిల్లులో పొందుపరిచిన పథకాలనే ఆమె మరోసారి వల్లెవేశారు.

సీమాంధ్ర రాజధాని ఏర్పాటు, కొత్తగా రాష్ట్రం ఏర్పాటైతే లోటు బడ్జెట్‌ను అధిగమించేందుకు ఏం చేస్తారు అనే విషయాలను ప్రస్తావించలేదు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని పదేళ్ల పాటు విశ్వవిద్యాలయాల్లో ఉమ్మడి ప్రవేశాలు జరగుతాయని చెప్పిన ఆమె నిరుద్యోగుల సమస్య ఎలా పరిష్కరిస్తారో చెప్పలేదు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖ, తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి పెంచడం, కొత్తగా ైరె ల్వేజోన్‌ల ఏర్పాటు వంటివి ప్రస్తావించారు.

 
అనువాదంపై అసహనం..
తన ప్రసంగానికి తెలుగు అనువాదం చేసిన జేడీ శీలంతో సోనియా ఇబ్బంది పడ్డారు. ఆయనే ప్రసంగించినట్లు ఉండటంపై ఆమె పలుమార్లు అభ్యంతరం, అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డికి చెప్పినా జేడీశీలం మాత్రం పట్టించుకోలేదు. సోనియాగాంధీ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారో కొంతసేపు వేదికపై ఉన్న నాయకులకు అర్థంకాక తలలు పట్టుకున్నారు. సభా ప్రాంగణం మొత్తం ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో సమన్వయలోపం సైతం కొట్టొచ్చినట్లు కనిపించింది. ప్రజలను తరలించే బాధ్యతను కేవలం కొంతమంది నాయకులు మాత్రమే తీసుకున్నారు. సభకు వచ్చిన ప్రజలు సైతం సోనియాగాంధీ ప్రసంగం పూర్తికాకుండానే వెనుతిరిగారు.

పార్టీ జిల్లా అధ్యక్షునికి వేదికపై లభించని స్థానం..
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావుకు సభావేదికపై స్థానం లభించలేదు. తొలుత ఎమ్మెల్యే మస్తాన్‌వలికి సైతం సభావేదికపైకి వెళ్లేందుకు సెక్యూరిటీ అధికారులు అనుమతించలేదు. తర్వాత దిగ్విజయ్‌సింగ్ చొరవతో ఆయన సభావేదికపైకి వచ్చారు. అలాగే మాజీ మంత్రులు కాసు కృష్ణారెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్‌లను సైతం నాయకులు పట్టించుకోలేదు.

మరిన్ని వార్తలు