మున్సి‘పోల్స్’కు పటిష్ట బందోబస్తు

30 Mar, 2014 00:28 IST|Sakshi

కాకినాడ క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో ఆదివారం జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎస్పీ జి.విజయ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికలు జరిగే పది మున్సిపాలిటీలకు ఇన్‌చార్జిలను, 2689 మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచారు.

ఇద్దరు అదనపు ఎస్పీలు, పది మంది ఏఎస్సీ, డీఎస్పీలు, 30 మంది సీఐలు, 114 మంది ఎస్సైలు, 302 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, 1337 మంది కానిస్టేబుళ్లు, 394 మంది హోంగార్డులు, 235 మంది ఆర్మ్‌డ్ రిజర్వు, మూడు కంపెనీల (265 మంది) పారా మిలటరీ సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నారు.
 
అత్యవసర సమయంలో సంబంధిత అధికారులను సంప్రదించేందుకు వారి సెల్ నంబర్లు, ఇతర వివరాలను పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు మరింత పెంచారు. ప్రతి మున్సిపాలిటీకి ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నియమించి వారి పర్యవేక్షణలో ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు ఎస్పీ విజయ్‌కుమార్ ఏర్పాట్లు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ సెల్ ఏర్పాటు చేశారు. ప్రజలు 1090, 94407 96514 నంబర్లకు ఫోన్ చేసి ఎలక్షన్ సెల్ సేవలను వినియోగించుకునే విధంగా సిబ్బందిని నియమించారు.
 
పోలీసులకు సహకరించాలి  
మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలీసులకు సహకరించాలి. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందిస్తే తగు చర్యలు తీసుకుంటాం. ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉంది. ప్రత్యేక దళాలు, అదనపు బలగాలు బందోబస్తు నిర్వహిస్తున్నందున అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలి.

మరిన్ని వార్తలు