టీజీ నిర్వేదం

19 May, 2014 00:04 IST|Sakshi
టీజీ నిర్వేదం

కర్నూలు, న్యూస్‌లైన్: ఓటమితో టీడీపీ నేతల్లో నిర్వేదం నెలకొంటోంది. ఓటర్లకు పంపిణీ చేయమని అందించిన డబ్బు సక్రమంగా పంపిణీ చేయకపోవడమే తన ఓటమికి కారణమంటూ కర్నూలు నియోజకవర్గ ‘దేశం’ అభ్యర్థి టి.జి.వెంకటేష్ సహచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు చర్చ జరుగుతోంది. నగరంలోని మౌర్యఇన్ హోటల్‌లో ఎమ్మెల్యే కార్యాలయం పేరిట సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యాలయాన్ని ఎత్తేసి అందులోని కంప్యూటర్ ఆపరేటర్లు, ఇతర సిబ్బందిని తొలగించాలని నిర్వాహకులను ఆదేశించినట్లు తెలిసింది.

ఇకపై సేవలకు స్వస్తి పలుకుతూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు వెలువడే చివరి నిముషం వరకు గెలుపు ఆశతో ఉన్న టీజీ.. ఫలితం ఆయనకు అనుకూలంగా రాకపోవడంతో నగర ప్రజలు ఝలక్ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్.వి.మోహన్‌రెడ్డికి ప్రజలు పట్టంకట్టారు. ఓటమిని జీర్ణించుకోలేని టీజీ తీవ్ర నిర్వేదానికి లోనై తన పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులపైనా ఆగ్రహంతో ఊగిపోయినట్లు తెలుస్తోంది. ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఈ ఎన్నికల్లో భారీ మొత్తంలో డబ్బు పంపిణీ చేశారు. దాదాపు 25 మంది మాజీ కార్పొరేటర్లు టీజీకి అనుచరులుగా ఉన్నారు.

ఓటర్లకు పంపిణీ చేసేందుకు వారికి భారీ మొత్తమే అందజేసినట్లు వినికిడి. అయితే అందులో సగం కూడా పంపిణీ చేయకపోవడమే తన ఓటమికి కారణమైందనే నిర్ణయానికి టీజీ వచ్చినట్లు ఆ పార్టీ వర్గీయులు చెబుతున్నారు. ఇప్పటికే పాతబస్తీలోని నలుగురు మాజీ కార్పొరేటర్లపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. కర్నూలు నియోజకవర్గంలో మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టగా 9 రౌండ్లలో ఎస్వీకి ఆధిక్యం లభించగా.. 7 రౌండ్లలో టీజీ ముందున్నారు. తక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాల్లో అనుచరులపై విచారణ జరిపించగా.. అక్కడ డబ్బు పంపిణీ జరగలేదనే విషయం బయటపడటంతో ఆయా ప్రాంతాల ద్వితీయ శ్రేణి నాయకులపై టీజీ మండిపడినట్లు సమాచారం.

ప్రకాష్‌నగర్, ఎన్.ఆర్.పేట, బుధవారపేట, జొహరాపురం, గరీబ్‌నగర్, జమ్మిచెట్టు ప్రాంతం, గాంధీ నగర్, కప్పల్‌నగర్, డాక్టర్ గఫార్ వీధి ప్రాంతాల్లో ఎస్వీ కంటే టీజీకి తక్కువ ఓట్లు పోలయ్యాయి. 2, 3, 5, 8, 12, 13, 14 రౌండ్లలో మాత్రమే టీజీకి మెజార్టీ లభించింది. 1, 4, 6, 7, 9, 10, 11, 15, 16 రౌండ్లలో ఎస్వీ హవా నడిచింది. ఆయా ప్రాంతాల్లో డబ్బు ఎవరికి పంపిణీ చేశారు.. వారి జాబితాతో ఫోన్ నెంబర్లు ఇవ్వండి.. స్వయంగా నేనే మాట్లాడతానంటూ ద్వితీయ శ్రేణి నాయకులు, మాజీ కార్పొరేటర్లను టీజీ నిలదీస్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా కొందరు కేబుల్ ఆపరేటర్లు కూడా డబ్బు సక్రమంగా పంపిణీ చేయలేదని అనుచరుల వద్ద మండిపడినట్లు సమాచారం.

>
మరిన్ని వార్తలు