వీరవరం గరంగరం

18 May, 2014 23:54 IST|Sakshi
వీరవరం గరంగరం

 కిర్లంపూడి, న్యూస్‌లైన్ : తనకు ఓట్లు తక్కువ పడ్డాయనే అక్కసుతో స్వగ్రామంలో దాడులకు బరి తెగించిన మాజీ మంత్రి, కాకినాడ ఎంపీ తోట నరసింహంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆదివారం నిరశన దీక్షలు చేపట్టారు. తోట స్వగ్రామమైన తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వీరవరంలో టీడీపీ కన్నా వైఎస్సార్ సీపీకి ఎక్కువ ఓట్లు రావడంతో విచక్షణ కోల్పోయిన నరసింహం, ఆయన వర్గీయులు శుక్రవారం రాత్రి విజ యోత్సవ ర్యాలీలో, శనివారం వైఎస్సార్ సీపీ నాయకుల ఇళ్లపై దాడులకు దిగి, గాయపరిచారు.
 
 అది జరిగి 24 గంటలైనా పోలీసులు నరసింహంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితులైన తోట గాంధీ, గొల్లపల్లి సూరిబాబు, గరగా భీమరాజు, గంగారావు ఆదివారం గ్రామకూడలిలో రోడ్డుకు అడ్డంగా టెంట్ వేసి నిరశన దీక్ష చేపట్టారు. పలువురు  గ్రామస్తులు వారికి మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. జగ్గంపేట సీఐ సుంకర మురళీమోహన్, కిర్లంపూడి ఎస్సై సి.హెచ్.విద్యాసాగర్ ఆందోళన విరమించాలని నచ్చచెప్పబోయారు. అయితే తమ ఇళ్లపైకి వచ్చి దాడి చేసిన ఎంపీ తోటపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని బాధితులు తేల్చిచెప్పారు. వైఎస్సార్ సీపీ నేతలు, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, దాడిశెట్టి రాజా వీరవరం చేరుకుని ఆందోళనకారులకు సంఘీభావం వ్యక్తం చేశారు.
 
 ఒకానొక సమయంలో గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. గ్రామంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన సీఐ పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలిపారు. చివరికి రెండురోజులు వ్యవధి ఇస్తే ఎంపీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇచ్చారు. దాంతో జ్యోతుల ఆందోళనకారులకు నచ్చచెప్పి శాంతింపజేశారు. ఈ ఆందోళనలో తోట ఈశ్వరరావు, తోట సర్వారాయుడు, వీర వెంకట సత్యనారాయణమూర్తి, తోట రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
 
 హామీ నెరవేర్చకపోతే తీవ్ర పరిణామాలు : జ్యోతుల  
 ఆందోళన విరమణ అనంతరం జ్యోతుల విలేకరులతో మాట్లాడుతూ పోలీసు వ్యవస్థపై గౌరవం, నమ్మకం ఉన్న తాము సీఐ హామీతో తాత్కాలికంగా ఆందోళన విరమించామన్నారు. రెండు రోజుల్లో నరసింహంపై చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. మెట్ట ప్రాంతంలో వైఎస్సార్ సీపీ నేతలు సీమ సంస్కృతిని తెస్తున్నారన్న ఎంపీ నరసింహం ఆరోపణను ఖండించారు. ఓట్లు వేయలేదనే కక్షతో ఫ్యాక్షనిస్టుగా వ్యవహరించినది ఆయనేనని అందరికీ తెలుసన్నారు.
 
 భారీగా పోలీసు బలగాల మోహరింపు
 ఎలాంటి ఉద్రిక్తతలూ చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా వీరవరంలో భారీగా పోలీసు బలగాలను మోహరించినట్టు సీఐ మురళీమోహన్ తెలిపారు. ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశామన్నారు. జరిగిన సంఘటనలపై పూర్తి స్థాయిలో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు