టీడీపీ, బీజేపీ మధ్య పొత్తుల కుంపటి

8 Apr, 2014 02:57 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కర్నూలు : పొత్తు కుదిరింది కానీ.. టికెట్ల పంచాయితీ ఓ పట్టాన తేలడం లేదు. బీజేపీ ప్రతిపాదించిన మూడు అసెంబ్లీ స్థానాలను ఇచ్చేందుకు టీడీపీ ససేమిరా అంటోంది. ఇదే సమయంలో బీజేపీ కూడా పట్టువిడవని ధోరణి అవలంబిస్తోంది. ఆదోని, నంద్యాల, పాణ్యం అసెంబ్లీ సీట్లివ్వాల్సిందేనంటూ ఆ పార్టీ నేతలు భీష్మించారు.

 ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు జిల్లా నాయకులను విజయవాడకు రావాలని కబురు పెట్టడం చర్చనీయాంశమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడంపై ఇప్పటికే తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. జిల్లాలో మైనార్టీ ఓటర్లు అత్యధికంగా ఉండటంతో పొత్తు తమ పుట్టి ముంచుతుందేమోనని వారిలో కలవరం మొదలైంది.

రెండు కళ్ల సిద్ధాంతంతో ఓటమికి చేరువైన కారణంగా కనీసం మోడీని ముందుంచుకునైనా పరువు కాపాడుకునేందుకు బాబు ఈ పొత్తుకు తెర తీసినట్లు చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే పొత్తులో భాగంగా పాణ్యం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చేందుకు బాబు మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

 

ఈ స్థానంలో  టీడీపీ గెలిచే పరిస్థితి లేకపోవడం.. అక్కడ తమ్ముళ్ల మధ్య పోటీ ఉండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ అక్కడ ప్రముఖ రియల్టర్ కేజే రెడ్డి ప్రచారం చేస్తున్నారు. అదే విధంగా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి కూడా పాణ్యం టికెట్  ఆశిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలో తేల్చుకోలేక బాబు పాణ్యం ను వదులుకునేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదే ఖరారైతే ఎమ్మెల్యే కాట సాని రాంభూపాల్‌రెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా.. బీజేపీ కోరుతున్న ఆదోని, నంద్యాల స్థానాల విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది.

 మొత్తంగా పొత్తు ‘పంచాయితీ’ తమ్ముళ్లను అయోమయానికి గురి చేస్తోంది. అధినేత ఎవరి సీటుకు ఎసరు పెడతారోననే బెంగ వారిని వెంటాడుతోంది. ఆదోని, నంద్యాల, పాణ్యం అసెంబ్లీ స్థానాలను ఆశిస్తున్న నాయకులు టిక్కెట్ తమకే ఖరారనే భావనతో ప్రచారం చేసుకుంటున్నారు. ఇదే సమయంలో బీజేపీ ఈ సీట్లపై కన్నేయడంతో ఆయా ప్రాంతాల్లోని టీడీపీ అభ్యర్థులు వేచిచూసే ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఈనెల 11న ఆదోని డివిజన్‌లో ప్రాదేశిక ఎన్నికలపైనా పొత్తు ప్రభావం చూపవచ్చని తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు.

>
మరిన్ని వార్తలు