పొత్తులు...కత్తులు

5 Apr, 2014 01:26 IST|Sakshi
పొత్తులు...కత్తులు

* టీడీపీ- బీజేపీ పొత్తులపై ఇరుపార్టీల్లో ఆందోళన
* అవసరమైతే రెబల్స్‌గా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్న నేతలు
* గ్రేటర్ పరిధిలో పరిస్థితి తీవ్రం.. మిగతా జిల్లాల్లో కూడా అదే తీరు
* దాదాపు 25 నియోజకవర్గాల్లో కుదరని సయోధ్య
* తాము పోటీ చేయకపోతే ఓడిస్తామంటున్న తమ్ముళ్లు

 
పోలంపెల్లి ఆంజనేయులు: తెలుగుదేశం, బీజేపీ దోస్తీ ఖరారైనట్టే! తెలంగాణ లోని 119 సీట్లలో బీజేపీ అటు ఇటుగా 48 నుంచి 50 శాసనసభ, 8 లోకసభ సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది. ఏయే సీట్లలో ఎవరు పోటీ చేయాలన్న విషయంపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. బీజేపీ పోటీ చేయాలని భావిస్తున్న నియోజకవర్గాల్లోని దాదాపు 25 సీట్లలో తామే బలంగా ఉన్నామని తెలుగు తమ్ముళ్లు బల్లగుద్ది చెపుతున్నారు. 2004లో పొత్తుతో తెలంగాణలోని 15 సీట్లలో పోటీ చేసి కేవలం ఒక్కసీటు గెలుచుకున్న బీజేపీకి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే ధ్వజమెత్తుతున్నారు. హైదరా బాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, సీబీఐ మాజీ డెరైక్టర్ కె. విజయరామారావు వంటి నేతలు కూడా చంద్రబాబు పొత్తు ఎత్తులపై చిర్రెత్తుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసు కోవచ్చు. ఢిల్లీలో చక్రం తిప్పడమే ధ్యేయంగా బీజేపీకి తలొగ్గి మరీ పొత్తులకు తెరదీసిన బాబు ఇవేవీ పట్టించుకోవడం లేదు. అదే సమయంలో బీజేపీ నేతలు సైతం టీడీపీతో పొత్తు వల్ల తమ ఉనికి కోల్పోతుందన్న ఆందోళనలో ఉన్నారు. బీజేపీ- టీడీపీ పోటీ చేసే సీట్లపై నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడడమే తరువాయి. ఆ వెంటనే పొత్తుల పై కత్తులు దూసేందుకు అనేక నియోజక వర్గాల్లో టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు.
 
 ఈ నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా..?
 తెలంగాణలో బీజేపీ దాదాపు 50 సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నా... 48 సీట్లు బీజేపీకి ఖరారయ్యే అవకాశం ఉంది. ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితా కూడా సిద్ధం చేశారు. అయితే ఈ సీట్లన్నీ గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన సీట్లో, లేక ఆపార్టీ అంతో ఇంతో బలంగా ఉన్న నియోజకవర్గాలే కావడం గమనార్హం.
 
 గ్రేటర్‌లోనే అసలు గొడవ
 హైదరాబాద్ జిల్లాలోని అంబర్‌పేట నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఉన్నారు. గతంలో ఇక్కడి నుంచి పోటీ విజయం సాధించిన సి. కృష్ణయాదవ్ టీడీపీ టిక్కెట్టు కోసం పోటీ పడుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు పోటీ చేసే అవకాశం ఉన్నందున టీడీపీ వదులుకున్నా, కార్యకర్తల యంత్రాంగం పనిచేసే పరిస్థితి లేదు.  ముషీరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్ పోటీ పడనున్నారు. ఈ సీటు కోసం టీడీపీ నుంచి ఎం.ఎన్. శ్రీనివాస్‌రావు, ముఠా గోపాల్ దశాబ్ధాల కాలంగా వేచి చూస్తున్నారు.  
 
 టీడీపీకి సీటివ్వకపోతే రెబల్‌గా రంగంలోకి దిగాలని ఎం.ఎన్. శ్రీనివాస్‌రావు సిద్ధపడు తున్నారు. గోషామహల్ సీటు నుంచి టీడీపీ తరపున ప్రేంకుమార్ ధూత్ పోటీకి సిద్ధమయ్యారు. బీజేపీ ఈ సీటును కోరుతున్నా, అభ్యర్థి విషయంలో ఇంకా ఏకాభిప్రాయం లేదు. మాజీ ఎమ్మెల్యే ప్రేంసింగ్ రాథోడ్, నందకిషోర్ వ్యాస్, కార్పొరేటర్ రాజు సింగ్‌లలో ఒకరికి వచ్చే అవకాశం ఉంది. అయితే టీడీపీ యంత్రాంగం బీజేపీకి సహకరించకపోగా అవసరమైతే రెబల్‌గా పోటీలో నిలవాలని యోచిస్తోంది.  ఎల్‌బీనగర్ నుంచి టీడీపీ తరపున ఎస్.వి. కృష్ణప్రసాద్ పోటీకి సిద్ధపడుతుండగా, ఆ సీటును బీజేపీ గట్టిగా కోరుతోంది. సీటు బీజేపీకి వస్తే ఎవరో ఒకరు అభ్యర్థిగా నిలపాలని ఆ పార్టీ యోచిస్తుంది. అయితే ఎల్‌బీ నగర్‌ను వదులు కునేది లేదని టీడీపీ నేతలు తెగేసి చెపుతున్నారు.
 
 చంద్రబాబు ఇంటి వద్ద ఆందోళనకు కూడా దిగారు.  సికింద్రాబాద్ నుంచి టీడీపీ తరుపున తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఇప్పటి వరకు మూడుసార్లు గెలుపొందగా, ఇప్పుడు ఆయన సనత్‌నగర్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. దాంతో సికింద్రాబాద్ సీటును బీజేపీ కోరుతోంది. అయితే ఇక్కడ టీడీపీ నుంచి పి.ఎల్. శ్రీనివాస్, పవన్‌కుమార్ గౌడ్‌లు టీడీపీ టికెట్టు తమకే కేటాయించాలని పార్టీపై ఒత్తిడి తెస్తున్నారు. అలాగే  ఖైరతాబాద్ నుంచి గతంలో టీడీపీ తరుపున గెలిచిన కె. విజయ రామారావు మరోసారి పోటీ చేయాలనుకుంటుంటే బీజేపీ పీటముడి వేస్తోంది. చింతల రామచంద్రారెడ్డి కోసం త మకే ఆ సీటు కావాలని పట్టుపడుతోంది. ఇక్కడ టీడీపీ పోటీ చేయకపోతే రెబల్‌గా బరిలో నిలిచే విషయాన్ని పరిశీలిస్తామని ఓ నాయకుడు స్పష్టం చేశారు.  రంగారెడ్డి జిల్లాలోని మల్కాజిగిరి నుంచి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పోటీకి సిద్ధపడుతుండగా, ఆ సీటును బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు నల్లు ఇంద్రసేనారెడ్డికి ఇప్పించాలనే ప్రయత్నంలో బీజేపీ ఉంది. అయితే మైనంపల్లి ఇప్పటికే ప్రచారంలో దిగారు. ఈ సీటు విషయంలో రెండు పార్టీల మధ్య గొడవ తప్పనిసరి కానుంది. ఉప్పల్ నుంచి టీడీపీ అగ్రనేత దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ పోటీకి సిద్ధమవుతుంటే ఆ సీటును కూడా బీజేపీ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది.
 
 మహేశ్వరంలో పోటీ చేయడం ద్వారా తన ఎమ్మెల్యే కలను నిజం చేసుకోవాలని  మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ప్రయత్నిస్తుంటే ఈ సీటును కూడా బీజేపీ కోరుతూ ఆయనకు ఆందోళన కలిగిస్తోంది. దీంతో తీగల గురువారం నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్లి తన అనుయాయులతో ఆందోళనకు దిగడం గమనార్హం. శేరిలింగం పల్లిలో కూడా టీడీపీ తరుపున మొవ్వా సత్యనారాయణ, ఎ. గాంధీ, బండి రమేష్ తదితరులు టిక్కెట్టు కోసం పోటీ పడుతుంటే తమకు కేటాయించాల్సిన సీటులో దాన్ని కూడా బీజేపీ తన ఖాతాలో వేసుకొంది.
 
 ఇతర జిల్లాల్లోనూ అదే సీను

-     భూపాలపల్లి నుంచి బీజేపీ నుంచి నరహరి వేణుగోపాలరెడ్డి, నాగపూర్ రాజమౌళి, మాజీ ఎంపీ సి. జంగారెడ్డి కుటుంబం గట్టిగా బీజేపీ టిక్కెట్టు కోరుతుండగా, ఈసీటును వదులుకొనేది లేదని, తానే టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటానని గండ్ర సత్యనారాయణ రావు పేర్కొంటున్నారు.
-     వరంగల్ తూర్పు  నుంచి మాజీ మేయర్ రాజేశ్వర్ రావు బీజేపీ టిక్కెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, దేశం తరుపున పార్టీ ఎంపీ గుండు సుధారాణి తన భర్త ప్రభాకర్‌కు టిక్కెట్టు ఇప్పించుకునే పనిలో ఉన్నారు.
-     వరంగల్ పశ్చిమ నుంచి బీజేపీ మాజీ ఎమ్మెల్యే ధర్మారావు బరిలో నిలిచేందుకు సిద్ధమవుతుండగా, మరోవైపు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి ముమ్మర ప్రయత్నాల్లో ఉన్నారు.
-     మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పోటీకి సిద్ధమవుతుండగా, ఈ సీటును కూడా బీజేపీ కోరుతోంది. ఇది టీడీపీ నేతలకు రుచించడం లేదు.
-     మెదక్ జిల్లా పటాన్‌చెరులో టీడీపీ కార్పొరేటర్ సఫాన్‌దేవ్ పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక్కడ నుంచి పోటీ చేయాలని బీజేపీ యోచిస్తోంది. అయితే సఫన్‌దేవ్ ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేసి విజయం సాధిస్తానన్న ధీమాతో ఉన్నారు.
-     అదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో టీడీపీ 2009లో విజయం సాధించింది. తరువాత ఇక్కడి ఎమ్మెల్యేలు జోగు రామన్న, నగేష్‌లు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకొని ఆపార్టీ నుంచి పోటీ చేస్తుండగా, అదే అదనుగా బీజేపీ ఈ సీట్లు కోరుతోంది.
-     నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, మునుగోడు, నాగార్జున సాగర్, సూర్యాపేట నియోజకవర్గాలను బీజేపీ కోరుతున్నప్పటికీ, ఆ జిల్లాలో బీజేపీకి అంత బలం లేదు. నాగార్జున సాగర్‌లో పేరా చిన్నపరెడ్డి టీడీపీ తరుపున 2009లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆయన మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నారు. మునుగోడు, నల్లగొండ, సూర్యాపేటల్లో కూడా టీడీపీ ఆశావహులు కర్నాసి వెంకటేశం, కె. భూపాల్‌రెడ్డి, పాల్వాయి రజనీదేవి బీజేపీ పొత్తు పట్ల తమ అసంతృప్తి బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు