సైకిల్ టైరు పంక్చర్!

14 May, 2014 02:26 IST|Sakshi
సైకిల్ టైరు పంక్చర్!

* టీడీపీకి ఖమ్మం ఒక్కటే ఊరట.. 

 *మిగతాచోట్ల అంతంతే

* మహబూబ్‌నగర్, వరంగల్, మెదక్‌లో కీలకంగా సైకిల్

* ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీకి నిరాశే

* నిజామాబాద్ జెడ్పీలో ప్రాతినిధ్యమే కరువు

 సాక్షి, హైదరాబాద్: పురపాలక ఎన్నికల్లో తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయిన తెలుగుదేశం పార్టీకి ప్రాదేశిక ఎన్నికలు సైతం నిరాశనే మిగిల్చాయి. ఒక జిల్లాలో ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయిందంటే టీడీపీ ఎంతగా చతికిలపడిందో అర్థమవుతోంది. ఒక్క ఖమ్మం జెడ్పీ స్థానాన్ని మాత్రం బొటాబొటీ మెజారిటీతో దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది.
 
అంతే తప్ప మిగతా అన్నిచోట్లా సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. చివరకు ఎంపీటీసీ స్థానాల విషయంలోనూ కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలకు ఏ దశలోనూ, ఏ ప్రాంతంలోనూ సరైన పోటీని ఇవ్వలేకపోయింది. ఖమ్మంలో మాత్రం మంగళవారం అర్ధరాత్రి కడపటి సమాచారం అందేసరికి 20 జెడ్పీటీసీ స్థానాలతో జిల్లాలో ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది.
 
మరో మూడు స్థానాలపై స్పష్టత రావాల్సి ఉంది. అవసరమైతే ఇతర పార్టీల మద్దతుతో ఇక్కడ జెడ్పీని టీడీపీ కైవసం చేసుకోవచ్చు. కాగా, మహబూబ్‌నగర్, వరంగల్, మెదక్ జెడ్పీల్లో టీడీపీ గెలుచుకున్న  సీట్లు జిల్లా పరిషత్ చైర్మన్‌ల ఎన్నికలో కీలకమయ్యేలా ఉన్నాయి. ఇది టీడీపీకి మరికొంత ఊరట.
 
అంతే తప్ప నేరుగా జెడ్పీ అధ్యక్ష స్థానాన్ని సాధించే స్థాయిలో ప్రభావాన్ని ఇతర ఏ జిల్లాలోనూ టీడీపీ చూపలేదు. ఉత్తర తెలంగాణలో మరోసారి బొక్కబోర్లా పడింది. దక్షిణ తెలంగాణలో ఓ మోస్తరుగా ఎంపీటీసీ సీట్లు సాధించినా అవి మండల పరిషత్తుల్లో పెద్దగా ప్రభావం చూపే స్థాయిలో లేవు. ఖమ్మం, మహబూబ్‌నగర్‌తో పాటు నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్ ఎంపీటీసీల్లో టీడీపీ 100 చొప్పున మార్కు దాటింది. కడపటి వార్తలందేసరికి తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో 1,000 పైగా ఎంపీటీసీ, 45 పైగా జెడ్పీటీసీ స్థానాల్లో గెలిచింది.
 
  ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల్లో మాదిరిగానే టీడీపీ కుదేలైంది. జెడ్పీటీసీల్లో ఒకటి నుంచి   మూడు స్థానాలకే పరిమితమైంది. ఎంపీటీసీ కాస్త పర్వాలేదనిపించింది. ఒకప్పుడు కరీంనగర్ జిల్లా పరిషత్ పీఠంపై జెండా ఎగరేసిన టీడీపీ, ఈసారి జిల్లాలో కేవలం ఒక్క జడ్పీ స్థానానికే పరిమితమైంది. 36 ఎంపీటీసీలు గెలిచింది. ఆదిలాబాద్‌లోనూ రెండు జడ్పీటీసీలే గెలిచింది.
 
ఎంపీటీసీలు 63 సాధించింది. నిజామాబాద్ జిల్లా పరిషత్‌లోనైతే టీడీపీ ఖాతాయే తెరవలేదు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఘోరంగా దెబ్బతింది. 583 ఎంపీటీసీల్లో కేవలం 31 స్థానాల్లోనే గెలవగలిగింది. ఒకప్పటి కంచుకోటైన రంగారెడ్డి జిల్లాలో కేవలం 6 జడ్పీటీసీలే గెలిచింది. అయితే 129 ఎంపీటీసీలు గెలవడం టీడీపీకి కాస్త ఊరట. మహబూబ్‌నగర్ జిల్లాలో 8 జడ్పీపీటీసీల్లో గెలిచింది.
 

మరిన్ని వార్తలు