టీడీపీలో వలసల చిచ్చు

25 Mar, 2014 01:13 IST|Sakshi

 భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ :
 భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారాస్థాయికి  చేరుకుంది. టీడీపీలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) చేరడం.. ఆయనకే అసెంబ్లీ టికెట్ ఖరారు చేస్తారనే ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు రగిలిపోతున్నట్టు సమాచారం.

మూడు దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న మెంటే పార్థసారథి భీమవరం టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవల ముని సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మెంటేను పోటీ చేయమని పార్టీ పెద్దలు ఒత్తిడి చేసినా ఆయన అంగీకరించకపోవడమే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో మునిసిపల్ ఎన్నికలు జరుగుతుండటంతో అంజిబాబుకు టికెట్ ఇచ్చే విష యం బహిర్గతం కాకుండా అధిష్టానం నానా తంటాలు పడుతోందట.
 
అంజిబాబుకు ఇప్పుడే టికెట్ కేటాయిస్తే మునిసిపల్ ఎన్నికల్లో విజయావకాశాలు దెబ్బతింటాయని నేతలు భావిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉండగా మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీను గెలిపించి అసెంబ్లీ టికెట్ పొం దాలనే యోచనలో మెంటే చెమటోడుస్తున్నారు. అయితే మునిసిపల్ ఫలితాలు వెలువడిన వెంటనే మెంటేను పక్కనపెట్టి అంజిబాబును తెరపైకి తీసుకొచ్చేందుకు దాదాపు రంగం సిద్ధమైందని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.
 
 సీతమ్మ చెప్పుచేతల్లోనే..
టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి చెప్పుచేతల్లోనే అభ్యర్థుల ఎంపిక చేస్తారని.. మునిసిపల్ అభ్యర్థులను ఇలానే ఎంపిక చేశారని పార్టీ కేడర్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మెంటేకు సీతారామలక్ష్మికి ఇటీవల విభేదాలు భగ్గుమన్న నేపథ్యంలో అంజిబాబుకు భీమవరం టికెట్ ఇచ్చే విషయంలో కూడా ఆమె ప్రముఖ పాత్ర వహిస్తున్నట్టు సమాచారం.
 
మెంటే మాత్రం అసెంబ్లీ టికెట్ తనకే ఇస్తారనే నమ్మకంతో ఉన్నారు. ఏది ఏమైనా మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలయ్యేంత వరకూ అంజిబాబు టికెట్ వ్యవహారం గోప్యంగా ఉంచనున్నారని తెలిసింది. లేకపోతే ఆయా ఎన్నికల్లో పరాభవం తప్పదనే గుబులు పార్టీ పెద్దలకు పట్టుకుందట. సుదీర్ఘకాలం టీడీపీ జెండా మోసిన మెంటే పార్థసారథి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి మరి.

మరిన్ని వార్తలు