టీడీపీలో దిగులు

26 Apr, 2014 01:43 IST|Sakshi
టీడీపీలో దిగులు

- అన్ని నియోజకవర్గాల్లోనూ ఎదురుగాలి
- నీరుగార్చిన పొత్తు, వలసలు, వ్యూహాలు
- నేతలు, పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరుత్సాహం
- జనం మధ్యకు వెళ్లలేక అగచాట్లు

 
 సాక్షి ప్రతినిధి, ఏలూరు : తెచ్చిపెట్టుకున్న వాపును బలుపుగా ప్రచారం చేసుకుని.. తమదే విజయమని మేకపోతు గాంభీర్యంతో కొద్దిరోజుల క్రితం వరకూ హడావుడి చేసిన తెలుగుదేశం పార్టీ జిల్లాలో ఒక్కసారిగా నీరుగారిపోయింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ముందు లేనిబలాన్ని ఉన్నట్టు చెప్పుకుని ఊగిపోయిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు చడీచప్పుడూ చేయడం లేదు.

జనంలో పార్టీకి ఆదరణ లేదనే విషయం స్పష్టంగా తెలిసిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. బీజేపీతో పొత్తువల్ల టీడీపీ చాలా నష్టపోతుందనే భావన తెలుగుదేశం శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన వలస నేతల వల్ల కూడా పార్టీ బలహీనపడినట్లు టీడీపీలో చర్చ జరుగుతోంది.

వీటిన్నింటినీ మించి చంద్రబాబు వ్యూహాలు, ఎత్తుగడలే ఆ పార్టీ అభ్యర్థులకు ప్రతికూలంగా మారాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా టీడీపీకి జిల్లాలో ఎదురుగాలి వీస్తోందని స్పష్టమైపోయింది.

 బలమనుకున్న సీట్లే బలహీనమై..
 మొన్నటివరకూ తమకు బలంగా ఉన్నాయని, ఆ నియోజకవర్గాలు తమవేనని ఘంటాపథంగా చెప్పిన టీడీపీ నేతలు ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో గెలుపు సునాయూసం కాదని తేల్చుకుని పరుగులు పెడుతున్నారు.ఇందుకు ఉదాహరణ దెందులూరు నియోజకవర్గమే. ఇక్కడ గెలుపు తమదేనని నిన్నటి వరకూ ఆ పార్టీ అగ్రనేతలు కూడా భావించారు. కానీ ఇప్పుడు అది  తమదేనని ధైర్యంగా చెప్పే పరిస్థితి లేకుండాపోయింది. అక్కడి వైఎస్సార్ సీపీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు వారం రోజుల వ్యవధిలోనే రాజకీయాన్ని మార్చేయడంతో టీడీపీ శ్రేణులు నివ్వెరపోయి దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 గత ఎన్నికల్లో దెందులూరు, నిడదవోలు, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాలను తన ఖాతాలో వేసుకున్న టీడీపీ తాజా పరిస్థితుల్లో వాటి గురించి కూడా తీవ్ర ఆందోళన చెందుతోంది. ఆ నియోజకవర్గాల్లో వైసీపీ బలమైన అభ్యర్థులను పోటీకి దింపడంతోపాటు వలసలను నిరోధించడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి సక్సెస్ కాగలిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా తమదని చెప్పుకునే సాహసం ఆ పార్టీ నేతలు చేయలేకపోతున్నారు. జిల్లాలో టీడీపీ దుస్థితికి ఇదే నిదర్శనంగా కనబడుతోంది.

 పొత్తుతో చిత్తేనా!
 బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల చాలా నష్టపోయామని టీడీపీ కిందిస్థాయి క్యాడర్ కూడా భావిస్తోంది. జిల్లాలో తాడేపల్లిగూడెం అసెంబ్లీ, నరసాపురం ఎంపీ సీటు మాత్రమే వదులుకున్నా ముస్లిం, క్రిస్టియన్, మైనారిటీ వర్గాల నుంచి తీవ్ర ప్రతికూలత వాళ్లకు కళ్లముందే సాక్షాత్కారమవుతోంది.

 ముస్లిం వర్గాలైతే టీడీపీని దరిచేరనీయడంలేదు. తమ ఉనికికే ప్రమాదమైన బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ నయవంచన చేసిందని వారు ఆ పార్టీకి వ్యతిరేకంగా మారిపోయారు. దళిత క్రిస్టియన్లు కూడా ఇదే అభిప్రాయానికి రావటంతో టీడీపీ నాయకులకు కంటిమీద కునుకు లేకుండాపోయింది.

మరోవైపు వలస నేతలైన పితాని సత్యనారాయణ, పులపర్తి రామాంజనేయులు వంటి వారివల్ల లాభం లేకపోగా నష్టం జరుగుతోందనే వాదన పార్టీలోనే బలంగా వినిపిస్తోంది. దీనికితోడు సీట్ల కేటాయింపులోనూ టీడీపీ అధినేత చంద్రబాబు ఘోరమైన తప్పిదాలు చేయడంతో ఆ పార్టీ ఒక్కసారిగా పక్షవాతం వచ్చినట్లు మారిపోయింది.నాలుగు నియోజకవర్గాల్లో ఆ పార్టీ తరఫున నలుగురు బలమైన అభ్యర్థులు రెబల్స్‌గా బరిలో ఉండటమే చంద్రబాబు సీట్ల ఎంపికలో చేసిన తప్పిదాలకు ఉదాహరణ. ఇవన్నీ ఎన్నికల్లో టీడీపీని ఉన్నట్టుండి బలహీనంగా మార్చాయి.

ఈ పరిస్థితుల్లో టీడీపీ శ్రేణుల్ని మళ్లీ చైతన్యం చేసేందుకు భీమవరంలో మోడీ సభ ఆ తర్వాత పవన్‌కల్యాణ్‌తో రోడ్‌షోలు నిర్వహించేందుకు చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారు. అయితే అవి కూడా ఫలించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో తెలుగుదేశం నాయకులు, శ్రేణులు తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయాయి.

మరిన్ని వార్తలు