తమ్ముళ్ల తడాఖా

26 May, 2014 01:52 IST|Sakshi
తమ్ముళ్ల తడాఖా

 సాక్షి, కాకినాడ :తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు తమ నైజాన్ని చాటుకుంటున్నారు. పదేళ్లుగా అధికారానికి దూరమైనందున కాబోలు- ప్రమాణ స్వీకారం చేసే వరకైనా నిరీక్షించ లేక అధికారులపై పెత్తనం చలాయించనారంభించారు. జిల్లాలో 19 నియోజక వర్గాల్లో 12 చోట్ల టీడీపీ, ఐదు స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ విజయం సాధించాయి. ఒకచోట బీజేపీ అభ్యర్థి, మరో చోట టీడీపీ రెబల్ గెలిచారు. రెబల్ అభ్యర్థి కూడా చేరడంతో టీడీపీ బలం 13కు చేరుకుంది. టీడీపీ తరపున కాకినాడ, కాకినాడ రూరల్, పి.గన్నవరం, రాజోలు, రాజమండ్రి రూరల్, రాజానగరం, మండపేటల నుంచి గెలిచిన వారు ఒకటి కన్నా ఎక్కువ సార్లు        అసెంబ్లీలో అడుగుపెడుతున్న వారే కాగా ముమ్మిడివరం, అమలాపురం, అనపర్తి, పిఠాపురం, పెద్దాపురంల నుంచి ఎన్నికైన వారు తొలిసారి అడుగుపెడుతున్నారు.
 
 తొలిసారి ఎన్నికైన వారిలో నిమ్మకాయల చినరాజప్ప జిల్లా పార్టీ అధ్యక్షునిగా వ్యవహరిస్తుండడంతో పాటు మంత్రి రేసులో ఉండడంతో జిల్లాపై పట్టు సాధించేందుకు అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టారు. రెండోసారి ఎన్నికైన వారిలో మంత్రి రేసులో ఉన్న గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గొల్లపల్లి సూర్యారావు, పిల్లి అనంతలక్ష్మి, వనమాడి కొండబాబు అప్పుడే తాము మంత్రులమన్న హోదాలో అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీ కోటాలో కీలకమంత్రిత్వశాఖ తనదేనన్న ధీమాతో పార్టీపైనా, జిల్లాపైనా పట్టు సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. దశాబ్దిన్నర తర్వాత మంత్రి రేసులో ఉన్న గోరంట్ల కూడా జిల్లాపై తన ముద్ర వేసుకునేందుకు పావులు కదుపుతున్నారు.
 
 ఇళ్ల వద్ద సమీక్షలు
 వీరిలో కొందరు అధికారులతో సమీక్షలు నిర్వహించి, ఆదేశాలు జారీ చేస్తుంటే.. మరికొందరు ‘మేము చెప్పినట్టు నడుచుకోండి. లేకుంటే..’ అంటూ హెచ్చరికలు సైతం చేస్తున్నారు. ఎన్నికల్లో తమకు, తమ పార్టీకి వ్యతిరేకంగా పని చేశారని అనుమానం ఉన్న అధికారులపై కక్ష సాధింపునకు దిగుతున్నారు. తమ నియోజకవర్గం నుంచి వారిని సాగనంపేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు మరీ అతి చేస్తూ.. ప్రతి అధికారీ ఆఫీస్‌కు వెళ్లే ముందు విధిగా తమ వద్ద అటెండెన్స్ వేయించుకోవాలని  హుకుం జారీ చేసినట్టు సమాచారం. ఇంకొందరు అధికారులు, సిబ్బందిని ఇళ్లకు పిలిపించుకొని శాఖల వారీ సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. జరుగుతున్న పనులు, వాటి ప్రగతి, ఏ పని ఏ కాంట్రాక్టర్ చేస్తున్నాడు వంటి ఆరాలు తీస్తున్నారు.
 
 ఇంకా ప్రారంభం కాని  పనులను తక్షణమే నిలిపి వేయాలని ఆదేశిస్తున్నారు. నియోజకవర్గానికి కొత్తగా వచ్చిన నిధులు, వాటితో ప్రతిపాదించిన పనుల గురించి ఆరా తీస్తున్నారు. కొందరైతే ఫోన్లలో ఆదేశాలు జారీ చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ పైచేయి సాధించినందున ఆ శాఖ అధికారులతోనూ తమ ఇళ్ల వద్ద సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక.. ‘గేదె చేలో మేస్తే.. దూడ గట్టునెందుకు ఉంటుంది?’ అన్నట్టు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారి అనుచరులు కూడా ‘ఎమ్మెల్యే గారు చెప్పా’రంటూ అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. మొత్తమ్మీద టీడీపీ ఎమ్మెల్యేలు, వారి అనుయాయులు రాష్ట్రంలో ఇప్పటికీ గవర్నర్ పాలన కొనసాగుతోందన్న స్పృహ లేకుండా వ్యవహరిస్తున్నారు.
 
 బాధపడలేక బదిలీ యత్నాలు
 అపాయింటెడ్ డే తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. తర్వాత స్పీకర్‌ను ఎన్నుకోవాలి. ఆయన సమక్షంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయాలి. అప్పుడు కానీ వారు రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేలు కారు. అప్పుడు కానీ అధికారిక కార్యక్రమాలు చేపట్టడానికి వీల్లేదు. రాష్ర్ట విభజన నేపథ్యంలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి చాలా సమయం పట్టేలా ఉంది. అంతవరకు ‘ఎమ్మెల్యే పదవికి ఎన్నికైన వారిమే తప్ప ఎమ్మెల్యేలం కాము’ అన్న ధర్మసూక్ష్మాన్ని విస్మరించిన టీడీపీ విజేతల ధాష్టీకాన్ని అధికారులు లోలోపల ఏవగించుకుంటున్నారు. అలాంటి వారిలో స్వాభిమానం కలిగిన వారు బదిలీల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
 

మరిన్ని వార్తలు