కొత్త ‘కాపు’లకు ‘దేశం’ అందలం

19 Mar, 2014 01:25 IST|Sakshi
కొత్త ‘కాపు’లకు ‘దేశం’ అందలం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ తులసీ సీడ్స్ అధినేత రామచంద్రప్రభుకు ‘కాపు’ కాస్తోంది. జెండాలు మోసిన పాతకాపులను పక్కన పెట్టి పార్టీలో సభ్యత్వం లేని ఆయనకు సీటు ఇచ్చేందుకు సన్నద్ధమవుతుండటంతో పార్టీలో అసంతృప్తులు పెల్లుబుకుతున్నాయి. జిల్లాలో ఒక సీటు కాపు సామాజిక వర్గానికి కేటాయిస్తామని హామీ ఇచ్చిన బాబు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నుదన్నుగా నిలిచిన గుంటూరు తూర్పు, బాపట్ల, సత్తెనపల్లి నియోజకవర్గాల నుంచి సీటు ఆశిస్తున్న దాసరి రాజామాస్టారు, అన్నవరపు సతీష్,  బైరా దిలీప్‌లకు మొండిచేయి చూపుతూ రామచంద్ర ప్రభుకు సీటు ఇచ్చేందుకు సోమవారం రాత్రి రాజధానిలో చర్చలు జరిపారు. 
 
 దీంతో అసంతృప్తితో ఉన్న పాత కాపులు మంగళవారం రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు గుంటూరులో పార్టీ నాయకులతో జరిపిన సమీక్షలో తమ అగ్రహాన్ని వ్యక్తం చేశారు. మాజీ కార్పొరేటర్ మద్దిరాల మ్యానీ, అనుచరులు గరికపాటి ఎదుట పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ఎప్పటి నుంచో పనిచేస్తున్న నాయకులకే సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏ కులానికి చెందిన నాయకునికి సీటు ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని, అయితే పార్టీలో పనిచేయకుండా ఆకస్మికంగా వచ్చిన నేతలకు సీట్లు ఇస్తే ఎన్నికల్లో పనిచేసేది లేదని తెగేసి చెప్పారు. 
 
 కోట్లు ఖర్చు చేసే వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలకు సీట్లు ఇవ్వడం టీడీపీకి పరిపాటిగా మారిందని, ఈ సంస్కృతికి తెరదించకపోతే పార్టీని ఓడించేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ ఆందోళన చేసిన వారిలో డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులే అధికంగా ఉండటం విశేషం. 2009 ఎన్నికల్లో పార్టీకి పనిచేయకుండా వచ్చిన వ్యాపారవేత్త చుక్కపల్లి రమేష్‌కు సీటు ఇస్తే ఆయన ఏ విధంగా ఓడిపోయారో తెలుసు కోండని, ఆ తరువాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గోకపోవడమే కాకుండా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు సన్నిహితంగా మెలిగి ఎన్టీఆర్ స్టేడి యం కమిటీ కార్యదర్శి పదవి పొందారని గుర్తుచేశారు.  గత ఎన్నికలో ఒక్కసీటైనా కాపులకు కేటాయించలేదు. ఈ సారి గుంటూరు తూర్పు నుంచి దాసరి రాజామాస్టారు, బాపట్ల నుంచి అన్నం సతీష్ ప్రభాకర్, సత్తెనపల్లి నుంచి బైరా దిలీప్‌లు సీటు ఆశిస్తున్నారు. వీరు కాకుండా రాష్ట్ర పార్టీ ఐటీ విభాగంలో కీలకబాధ్యతలు నిర్వహిస్తున్న చందూ సాంబశివరావు ఏదేని నియోజకవర్గం నుంచి సీటు ఆశిస్తున్నారు. 
 
 తమలో ఒకరికి ఈసారి సీటు కేటాయిస్తారనే భావనలో వీరంతా ఉన్నారు.  రామచంద్ర ప్రభుకు సీటు ఇచ్చేందుకు అధినేత సుముఖంగా ఉన్నట్టు సోమవారం రాత్రి సమాచారం రావడంతో పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తులసీ రామచంద్ర ప్రభు పీఆర్పీ నుంచి పోటీ చేసి ఘోరపరాజయాన్ని చవి చూశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేసి గెలుపొందగా, టీడీపీ అభ్యర్థి చుక్కపల్లి రమేష్‌కు రెండోస్థానం, రామచంద్ర ప్రభుకు మూడోస్థానం లభించింది. ఫలితాల తరువాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆకస్మికంగా తెరపైకి వచ్చి సీటు పొందేందుకు ఆయన ప్రయత్నించడం, పార్టీ సుముఖంగా ఉండటం పట్ల కేడర్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అధినేత నారా చంద్రబాబు నాయుడు పునరాలోచన చేయాలని,లేకుంటే తమ సత్తా చూపుతామని కార్యకర్తలు, నాయకులు హెచ్చరిస్తున్నా రు. తమ నిరసనను రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహనరావుకు వివరించారు కూడా!
 
 
మరిన్ని వార్తలు