టీడీపీ దుండగులను కఠినంగా శిక్షించండి

10 May, 2014 02:55 IST|Sakshi
టీడీపీ దుండగులను కఠినంగా శిక్షించండి

శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఆమదాలవలస మండల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సువ్వారి అనిల్‌కుమార్, బొడ్డేపల్లి అనిల్‌బాబులపై దాడికి పాల్పడిన టీడీపీ దుండగులను కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి, ఆ పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ అభ్యర్థి తమ్మినేని సీతారాం జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్‌ను కోరారు. తమ నియోజకవర్గంలో శాం తిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీరు స్పందించకపోతే ప్రజలే రంగంలోకి దిగుతారని స్పష్టం చేశారు. ఆమదాలవలస, పొందూరు, సరుబుజ్జిలి మం డలాలకు చెందిన పార్టీ నేతలతో కలిసి శుక్రవారం ఆయన కలెక్టర్‌ను కలిశారు.

సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు ఎన్నో ఆరాచకాలు, దాడులు, గృహ నిర్బంధాలకు పాల్పడ్డారని వివరించారు. పొందూరు, ఆమదాలవలస స్టేషన్ల పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగులమన్న విషయాన్ని మరిచిపోయి టీడీపీకి అనుకూలంగా వ్యవహరి స్తున్నారని ఫిర్యాదు చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా పలు చోట్ల ఓటర్లు, వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారని చెప్పారు. గురువారం కనుగులవలస వెళుతున్న సువ్వారి అనిల్‌కుమార్, బొడ్డేపల్లి అనిల్‌బాబుల కారును పథకం ప్రకారం అడ్డుకొని వారిపై దాడికి పాల్పడ్డారన్నారు.

దీనివెనుక కోర్లకోట, తమ్మయ్యపేటలకు చెందిన టీడీపీ నాయకుల ప్రోద్బలం ఉందని పేర్కొన్నారు. తమ పార్టీ నేతలిద్దరిని దుండగులు హత్య చేసేందుకు ప్రయత్నించారని, అయితే సమీపంలో ఉన్నవారు వచ్చి రక్షించారని చెప్పారు. అప్పటికే ఇద్దరు నేతలను తీవ్రంగా గాయపరిచారన్నారు. ఈ కేసులో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, అనిల్‌బాబు ఇస్తున్న ఫిర్యాదును తీసుకోవడం లేదని తెలిపారు. దాడికి పాల్పడినవారిపైనా, వారి వెనుక ఉన్న టీడీపీ నాయకులపైనా చర్యలు తీసుకొని శాంతి భద్రతలను పరిరక్షించాలని కోరారు.

ఇటీవల పొందూరు మం డలం నందివాడలో రెండుసార్లు టీడీపీ నాయకులు దాడులు చేశారని, అలాగే దల్లిపేటలో తమ కార్యకర్తలపై దాడి చేశారని చెప్పారు. కొరపాం ఆటోలో వస్తుండగా దాడి చేశారని, గృహ నిర్బంధం చేసి హింసించారని పేర్కొన్నారు. సరుబుజ్జిలిలో ఎన్నికల ఏజెం ట్‌పై దాడి చేశారన్నారు. కార్యకర్తలు హింసకు పాల్పడేలా టీడీపీ నేతలు ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఎస్పీ నవీన్ గులాఠీకి కూడా ఫిర్యాదు చేశామన్నారు.

పోలీసులు శాంతి భద్రతలను కాపాడలేకపోయినా.. వైఫల్యం చెందినా.. లేదా టీడీపీ ప్రలోభాలకు లొంగిపోయినా.. ప్రజలే రంగంలోకి దిగి శాంతి భద్రతలను కాపాడాల్పిన పరిస్థితి వస్తుందన్నారు. కలెక్టర్  సౌరభ్‌గౌర్ స్పందిస్తూ దాడికి పాల్పడిన వారిపైన, ఉదాసీనంగా వ్యవహరించిన పోలీసులపైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ను కలిసినవారిలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు బి.ఎల్.నాయుడు, బొడ్డేపల్లి నారాయణరావు, ఎస్.గాంధీ, ఎం.గోపాలకృష్ణ, జి.మధుసూదనరావు, కె.రమేష్, సూర్యారావు, రమేష్, కూన గోపి, బి.ప్రసాద్, ఎస్.నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

టీడీపీ రౌడీయిజాన్ని అడ్డుకోండి..
శ్రీకాకుళం క్రైం : జిల్లాలో టీడీపీ రౌడీయిజం రోజురోజుకూ పెరిగిపోతోందని, దీనిని అడ్డుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు తమ్మినేని సీతారాం, తదితరులు ఎస్పీ నవీన్ గులాఠీని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఎస్పీని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సీపీ విజయం తథ్యమని భావించిన టీడీపీ వర్గీయులు రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. తమ పార్టీ నేతలు సువ్వారి అనిల్‌కుమార్, బొడ్డేపల్లి అనిల్‌బాబులపై దాడి చేశారని తెలిపారు. దీనిపై ఫిర్యాదు చేసినా స్థానిక పోలీ సులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

>
మరిన్ని వార్తలు