అసలేమైంది...

18 May, 2014 01:36 IST|Sakshi
అసలేమైంది...

టెక్కలి, న్యూస్‌లైన్: వైఎస్సార్‌సీపీ టెక్కలి అసెంబ్లీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఓటమి పాలవడం పలువురిని విస్మయానికి గురి చేసింది. వైఎస్సార్‌సీపీకి ఉన్న ప్రజాదరణతో పాటు నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న పరిశీలకులు దువ్వాడ గెలుపు ఖాయమని భావించారు. ఓట్ల లెక్కింపు సరళి గమనిస్తే  దువ్వాడ గెలుస్తారని భావించినా చివరికి ఓటమి పాలయ్యారు. దువ్వాడ ఓటమిని తట్టుకోలేని పలువురు అభిమానులు నిశితంగా పరిశీలిస్తున్నారు. పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో ఒక సామాజిక వర్గం దూరమైందనే అనుమానం వ్యక్తం చేశారు.
 
 పలు ఊహా గానాలు వ్యక్తమవుతున్నా ప్రధా నంగా సామాజిక సమీకరణాల్లో తేడా రావడం వల్లే ఓటమి పాలయ్యారని భావిస్తున్నా రు. టెక్కలి నియోజకవర్గంలో టెక్కలి, నం దిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాలు ఉన్నాయి. వీటిలో శ్రీనివాస్‌కు టెక్కలి మండల ప్రజలు గట్టి మద్దతు ఇచ్చారు. నందిగాం మండలం వైఎస్సార్‌సీపీకి కంచుకోటగా ఉంది. థర్మల్ పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా సంతబొమ్మాళి మండలంలో తీవ్రస్థాయిలో ఉద్యమం సాగింది. ఆ మండలంలో దువ్వాడను ప్రజలు ఆదరించినా పోలింగ్‌లో అది కనిపించకపోవడంతో ఏం జరిగిందనే ప్రశ్న తలెత్తిం ది. కోటబొమ్మాళి మండలంలో వెలమ సామాజిక వర్గానికి దీటుగా కాళింగ సామాజిక వర్గం ఉంది. కానీ కాళింగ సామాజిక వర్గానికి చెందన దువ్వాడకు ఆ వర్గం అండగా నిలవలేదని భావిస్తున్నారు. టెక్కలి నియోజకవర్గంలో 2,04,522 ఓట్లు ఉన్నాయి. అందులో 50 వేలకు పైగా కాళింగ సామాజికవర్గం ఓట్లు ఉన్నాయి.
 
 29 రౌండ్లలో దువ్వాడకు 72,780 ఓట్లు లభించగా, టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడికి 81,167 ఓట్లు లభించాయి. నందిగాం మండలంలో తొమ్మిదో రౌండ్ వరకు దువ్వాడకు 1500 ఆధిక్యత వచ్చింది. తర్వాత టెక్కలి మండలంలో 3వేల ఆధిక్యతకు చేరుకున్నారు. సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల్లో వెనుకబడడంతో దువ్వాడ ఓట మి పాలయ్యారు. సంతబొమ్మాళి, కోట బొమ్మాళి మండలాల్లో ఉన్న కాళింగ సామాజిక వర్గానికి చెందిన వారు దువ్వాడకు పూర్తిస్థాయిలో ఓటు వేయకపోవడంతో ఓటమి పాలయ్యారని భావిస్తున్నారు. అచ్చెన్నాయుడిపై అదే సామాజిక వర్గానికి చెందిన వారు అభిమానం ప్రదర్శిస్తే, దువ్వాడపై  సామాజిక వర్గం వారు అభిమానం ప్రదర్శించలేదని అభిమానులు ఆరోపిస్తున్నారు. ప్రజాదరణ ఉన్నా కుల సమీకరణాల తోనే దువ్వాడ ఓటమి పాలయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు