సోనియాతోనే తెలంగాణ కల సాకారం

28 Apr, 2014 04:32 IST|Sakshi
సోనియాతోనే తెలంగాణ కల సాకారం

- విశ్వాసానికి.. విశ్వాసఘాతుకానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు
- టీఆర్‌ఎస్‌ది కుటుంబ పాలన
- ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

 
 జనగామ, న్యూస్‌లైన్ : ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దయతోనే 60 ఏళ్ల తెలంగాణ కల సాకారమైందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం జనగామలో రోడ్ షో చేపట్టారు. కాలనీల్లో కార్యకర్తలతో కలిసి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం జనగామలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తదుపరి జరుగుతున్న తొలి ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవన్నారు.

 తెలంగాణ ప్రజలు విశ్వాసం గల వారని నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలు మంచి అవకాశమన్నారు. విశ్వాసానికి.. విశ్వాసఘాతుకానికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణ వాదులు తమ నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరముందన్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి కాదన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని.. తెలంగాణ ఏర్పాటు అనంతరం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని మాట తప్పారని అన్నారు. ఇద్దరు ఎంపీలున్న కేసీఆర్‌తో తెలంగాణ రాలేదన్నారు. టీఆర్‌ఎస్‌ది కుటుంబ పాలన అని ఆరోపించారు.

సీమాంధ్రలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోతుందని తెలిసినా సోని యా ఇచ్చిన మాటను నిలబెట్టుకుందన్నారు. అందుకోసం ఆమె రుణం తీర్చుకునేందుకు కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్యను, భువనగిరి ఎంపీ అభ్యర్థినైన తనను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

 పొన్నాలకు, తనకు మధ్య విభేదాలు ఉన్నాయన్న వాదనలో వాస్త వం లేదన్నారు. నిత్యం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఎన్నికల్లో గెలుపునకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో బీసీ సీఎం అనడం పెద్ద డ్రామా అన్నారు. దమ్ముంటే సీమాంధ్రలో బీసీని సీఎం చేస్తానని బాబు చెప్పాలన్నారు.

 లక్ష ఇజ్జత్ పాస్‌లతో రికార్డు
 దేశ వ్యాప్తంగా రెండు లక్షల ఇజ్జత్(ట్రైన్) పాస్‌లు జారీ చేస్తే అందులో తన భువనగిరి నియోజకవర్గ పరిధిలోనే లక్ష పాసులు ఉన్నాయని అన్నారు. ఇది రికార్డు అన్నారు. అదేవిధంగా తన ఎంపీ నిధులు సరిపోకుంటే ప్రతీ గ్రామంలో  సొంత ఖర్చులతో బోర్లు వేయించి తాగునీటిని అందించానని అన్నారు. తెలంగాణ కోసం 2009 నుంచి అలుపెరుగనిపోరాటం చేశానని చెప్పారు.

ఎంపీగా మళ్లీ భారీ మెజారిటీతో గెలుపొందుతానని కొమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గెలిచిన వెంటనే భువనగిరి నుంచి వరంగల్ వరకు నాలుగు లేన్ల రోడ్డుకు శంకుస్థాపన చేస్తానని అన్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో నెలకొన్న సమస్య ల పరిష్కారానికి చర్యలు చేపడుతానని పేర్కొన్నారు. జనగామ, భువనగిరి, ఆలేరు రైల్వేస్టేషన్‌లను మరింత ఆధునీ కరించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తానన్నారు. సమావేశంలో మహేందర్‌రెడ్డి, వేమల్ల సత్యనారాయణరెడ్డి, కొమ్ము నర్సింగారావు, గుర్రపు బాలరాజు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు