అమ్మ మాట: పాణం పెడితెనే పనైతదన్నడు

8 Apr, 2014 01:44 IST|Sakshi
అమ్మ మాట: పాణం పెడితెనే పనైతదన్నడు

బిడ్డ సావుతోని మూడు దినాలు పోరాడిండు. పగలైతే అడ్డువడతమని..అర్ధరాత్రి లేచి ఇంటిపెకైక్కి పెయ్యిమీద కిరోసిన్ వోసుకొని ఇంగళమేసుకున్నడు. నిప్పుల కాలుకుంటనే ‘జై తెలంగాణ..జై తెలంగాణ..’ అని అరుస్తుంటే గింత రాత్రిల ఎవరరుస్తున్నరని అందరు బయటికొచ్చిచూస్తే నా బిడ్డనే. ‘ఎంతపనిజేసినవ్‌రా....బిడ్డా’ అని అంబులెన్స్‌ని విలిసి గాంధాస్పత్రికి తోలకవోయ్‌నం. మూడో దినంనాడు రాత్రి పదిగంటలకు నాగరాజుకి సీరియస్‌గుందని చెప్పిండ్రు. దగ్గరికివోయి చూస్తే బిడ్డనోటెంట మాటొస్తలే. జరసేపటికే డాక్టర్లొచ్చి బిడ్డ పాణమిడిసిండని చెప్పిండ్రు.
 
 గంతకు ముందురోజు బిడ్డడు మాతో ఒక మాట చెప్పిండు. ‘ఎందుకురా గింతపని జేసినవ్. నువ్వు సస్తేనే తెలంగాణ రాష్ర్టమొస్తదా!’ అని వాళ్లనాయన అడిగితే..‘ఒకరిద్దరు సచ్చిపోతే రాష్ట్రమేడస్తదే! నాలెక్క సచ్చిపోనీకి మస్తుమంది విద్యార్థులున్నరు. పాణం పెడితెనే పనైతదే!’ అన్నడు. ఆసంది నుంచి ఏ మాట మాట్లాడుకున్నా వాడిసావే గుర్తుకొస్తున్నది. తెలంగాణ రాష్ట్రమొచ్చిందని తెల్వంగనే నాకు సంతోషమేసింది. నా బిడ్డ చావు ఊకెవోలే అనుకున్న. ‘తెలంగాణ రాష్ర్టమొస్తే  కొలువులొస్తయ్...కష్టాలన్నీ వోతయే’ అని చెప్పిన మాటలు నిజమైతయా కాదో నాకు తెల్వదు. అవి నిజం కాకుంటే నా బిడ్డచావు ఊకెవోయినట్టే. వాడెనక ఇంకో కొడుకున్నడు. ఆడికి కొలువొచ్చినాడన్న మనకు సొంతంగా రాష్ర్టమొచ్చిందని నమ్ముత.
 సేకరణ : భువనేశ్వరి, ఫొటో : విఠల్
 
 జన  తెలంగాణ
 విద్యకు పెద్దపీట...  భవిష్యత్ తెలంగాణ సమున్నతంగా ఉండాలంటే కొత్త ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పాఠశాల స్థాయినుంచి విశ్వవిద్యాలయాల వరకు ప్రక్షాళన చేయాలి. డిగ్రీ వరకు నిర్బంధ విద్యను అమలు చేయాలి. శిక్షణ పొందిన బోధన సిబ్బందినే నియమించాలి. విద్యారంగాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలి. సైన్స్, మాథ్స్‌ల బోధనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. విద్యార్థి తనకు అభిరుచి గల రంగాన్ని ఎంచుకోగలిగే విద్యావ్యవస్థ ఉండాలి. మానవ వనరుల అభివృద్ధి ద్వారానే సమాజ పురోభివృద్ధి సాధ్యమవుతుంది.    
- జి.సంధ్య, ఆదర్శపాఠశాల,
చిన్నకోడూరు, మెదక్ జిల్లా

 
 స్వేచ్ఛాయుత తెలంగాణ...
 ప్రజా ఉద్యమానికి తలవంచి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి, ఇరుప్రాంతాల మధ్య సామరస్యం, పరస్పర సహకారం మీద దృష్టి సారించాలి. ప్రాథమిక విద్య మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టి మౌలిక వసతులు కల్పించాలి. వ్యవసాయ రంగంలో నూతన విధానాలు ప్రవేశపెట్టి అభివృద్ధి సాధించాలి. ఆంక్షలు లేని, నిర్బంధంలేని, స్వేచ్ఛాయుత తెలంగాణ కోసం అందరూ సహకరించాలి.
 - డి. సుధాకరరావు, చెన్నూరు, ఖమ్మం జిల్లా
 
 దురాచారాలను నిర్మూలించాలి..
 నవ తెలంగాణలో వేళ్లూనుకున్న వరకట్నాన్ని  నిర్మూలించాలి. మూఢనమ్మకాలు, లంచగొండితనం, ర్యాగింగు లాంటి సామాజిక దురాచారాలను పూర్తిగా తొలగించాలి. ఇందుకు యువతీయువకులు కృషి చేయాలి. నాణ్యమైన విద్యను అందించాలి. ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. మాతృభాషను పరిరక్షించాలి. పేదలందరికీ ఉచిత వైద్యాన్ని అందించాలి. ప్రతి వ్యక్తి విలువలతో జీవించాలి.
  - వేముల వాణిశ్రీ
 రేకుర్తి, కరీంనగర్ జిల్లా

మరిన్ని వార్తలు