అమ్మ మాట..

10 Apr, 2014 02:26 IST|Sakshi
అమ్మ మాట..

సదువుకునేటోళ్లు సస్తనే వస్తదా?
 తెలంగాణ రాష్ర్టమొచ్చిందని తెల్వంగనే అందరూ పండగ జేసుకున్నరు. అరవైయేండ్ల నుంచి పోరాడుతుంటే గీనాటికి మన కల తీరిందని మురిసిండ్రు. గా దినాన నా అసొంటి తల్లులు సంతోషపడాల్నా, ఏడ్వాల్నా అర్థంకాలే. ‘మీ బిడ్డల పుణ్యమే...’అని చానమంది నాయకులు మా ఇంటికొచ్చి చెబుతుంటే ఏడుస్తనే సంబరాలు చేసుకున్నం. నా బిడ్డ వయసు పద్దెనిమిదేండ్లు ఉంటది. ముక్కపచ్చలారని గసొంటి పొరగాళ్లు పాణమిడిస్తనే రాష్ర్టమొచ్చేదేందో నాకర్థమైతలే. నాలుగేండ్ల కింద నాయకులు ఉద్యమం పేరుజెప్పి దినానికో ముచ్చట జెప్పిటోళ్లు. ఆత్మహత్యలు చేసుకుంటనే రాష్ర్టమొస్తదని నమ్మిన నా కొడుకులాంటోళ్లు బలవంతపుచావు సచ్చిండ్రు. నాకిద్దరు కొడుకులు. పెద్దోడు రాజకుమార్. పదోతరగతి చదివిండు. ఉద్యమంలా తిరగాలని ఏ పొద్దువోయేటోడు...ఎప్పటికొచ్చేటోడో వాడికే తెలిసేది కాదు.
 
  నేను, నా భర్త పొద్దుగాల్నే వ్యవసాయం పనులకు పోయేటోళ్లం. ఇద్దరం కష్టవడితేగాని ఇల్లు గడ్వదు. ‘పెద్దోని సదువైనంక, కొలువుకు పోయినంక...నేను పొలానికి రానే’ అనేదాన్ని నా భర్తతో. ఇంకెక్కడి పెద్దోడు. ఒకరోజు మేం పొలానికి వోయినంక ఇంట్ల ఉరేసుకున్నడు. దోస్తలందరికి తెలంగాణకోసం సచ్చిపోతున్న అని చెప్పిండంట. ఈ వయసల మాకొచ్చే కష్టం కాదది. ఏ తల్లికీ రాకూడని కష్టం. తెలంగాణ రాష్ర్టమొచ్చినంక మస్తుమంది నాయకులొచ్చి మమ్మల్ని పలకరించ పోతుండ్రు. బతికున్నంతకాలం బిడ్డ చావు ముచ్చట చెప్పుకుంటూ బతుకుడు తప్ప మాకేం వచ్చేది లేదు. నా చిన్నకొడుక్కు మంచి కొలువొస్తే అది పెద్దోని పుణ్యమనుకుంటం.                                           సేకరణ : భువనేశ్వరి, ఫొటో: ఆర్. కృష్ణారెడ్డి

మరిన్ని వార్తలు