నినాదం ఓటుబ్యాంకు కారాదు

4 Apr, 2014 01:17 IST|Sakshi
నినాదం ఓటుబ్యాంకు కారాదు

నవ తెలంగాణ: తెలంగాణ చరిత్ర ఉద్యమాలతోకూడుకున్నది.  సాయుధ తెలంగాణ పోరాటం ప్రపంచ చరిత్రలో మరపురాని ఘట్టం. తెలంగాణది ఒక ప్రత్యేక సంస్కృతి. అనేక సంస్కృతుల మేళవింపుతో ఏర్పడిందే తెలంగాణ. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో భాగమై  ఉద్యమాల ఫలితంగా ప్రస్తుతం ప్రత్యేక రాష్ట్రంగా రూపుదిద్దుకుంది. జూన్2న 29వ రాష్ట్రంగా అవతరించనుంది.  
 
 తెలంగాణకు తమిళనాడుకు కొంత సారూప్యత ఉంది. ఓబీసీలు 50 నుంచి 60 శాతం ఉన్న రాష్ట్రాలు ఇవి. ఓబీసీల చైతన్యం తమిళనాడుతో పోల్చితే తెలంగాణలో తక్కువే. పెరియార్ రామస్వామి నాయకర్ ఉద్యమ ఫలితంగా తమిళనాడులో ఓబీసీలు చైతన్యాన్ని పొందగలిగారు. తెలంగాణలో కమ్యూనిస్టుల, మత సంస్థల ప్రాబల్యం వల్ల బీసీల చైతన్యం పెరగలేదు. ఈ మధ్య అందరూ జపిస్తున్న సామాజిక తెలంగాణ అం టే ఏమిటన్న మౌలి కమైన ప్రశ్న ప్రజల మదిని తొలుస్తో ంది. టీడీపీ తెలంగాణలో బీసీ వ్యక్తిని సీఎం చేస్తానని వాగ్దానం చేసింది. దీన్ని నమ్మి బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య టీడీపీలో చేరారు. ఉమ్మడి రాష్ట్రంలో బీసీని సీఎం గానీ, పార్టీ అధ్యక్షుడిని కానీ టీడీపీ ఎందుకు చేయలేదనే ప్రశ్నకు చంద్రబాబు దగ్గర సమాధానం లేదు. కాంగ్రెస్ ఏకంగా తెలంగాణకు, సీమాంధ్రకు బీసీలను పీసీసీ అధ్యక్షులుగా నియమించింది. కేసీఆర్ దళితున్ని తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిని చేస్తానని అనేకసార్లు ప్రకటించారు. కింది సామాజిక వర్గాలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామమే అయినా అది బడుగు బలహీన వర్గాల మౌలిక సమస్యలను పరిష్కరించలేదు.  
 
 సమగ్ర, సామాజిక తెలంగాణ అంటే?
 తెలంగాణ నేతన్నలు, రైతుల ఆత్మహత్యలను నిత్యం చూస్తునే ఉన్నాం.  కులవృత్తులు ఛిద్రమైనాయి.  ఇక ఎస్సీలపై అత్యాచారాలు, కుల వివక్ష ఇంకా తెలంగాణ జిల్లాల్లో కొనసాగుతూనే ఉంది. ఇది ఒక బీసీ ముఖ్యమంత్రి అయితే మారేది కాదు. నిత్యం ఈ సమస్యలపై సాంస్కృతిక పోరాటాలు చేయాల్సి ఉంది. ప్రభుత్వ రంగంలో కంటే ప్రైవేటు రంగంఉపాధి అవకాశాల ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల కంపెనీ యాజమాన్యం తనకు నచ్చిన సామాజిక వర్గాలకే ఎక్కువగా అవకాశాలు కల్పిస్తున్నాయి. రానున్న తెలంగాణ ఇందుకు పరిష్కా రం చూపాలి. విద్య వైద్యం సామాన్యుడికి అందని ద్రాక్షలాగా తయారైంది.
 
 వైఎస్ రాజశేఖరరెడ్డి కాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు అవకాశం కలిగింది. భూమిలేని దళితులకు, పేదలకు భూమిని పంపిణీ చేస్తామని టీఆర్‌ఎస్ ప్రకటించింది. ప్రభుత్వం వద్ద ఉన్న మిగులు భూమిపై, భూస్వాముల వద్ద ఉన్న భూమిపై శ్వేతపత్రం విడుదలచేయాలి. సామాజిక తెలంగాణ పేరుతో మోసం చేసిన ప్రజారాజ్యం పార్టీ చివరికి కాంగ్రెస్‌లో విలీనమైంది. ఇప్పుడు పవన్‌కళ్యాణ్ జనసేన పేరుతో ప్రజల్లోకి వస్తున్నాడు. సామాజిక తెలంగాణ అనే నినాదం పార్టీలకు ఓటు బ్యాంకు రాజకీయం కావద్దు. అలా కాకుడదంటే ప్రజలే పార్టీలకు సామాజిక తెలంగాణ ఎజెండాను నిర్దేశించాలి. అ న్ని రంగాల్లో జేఏసీలు క్రియశీలంగా ఉంటేనే సాధ్యం.
 - పూస మల్లేష్, కన్వీనర్,
 తెలంగాణ ప్రైవేట్ రంగ
 రిజర్వేషన్ సాధన సమితి

 
 జన  తెలంగాణ:  ఉద్యమస్ఫూర్తి కొనసాగాలి..
 భౌగోళిక తెలంగాణ వచ్చిందే కానీ, సంపూర్ణ తెలంగాణ మాత్రం రాలేదు. ఎవరికి వారే తెలంగాణ తమ వల్లే... తామిచ్చిన లేఖ వల్లే వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఓట్ల కోసం ఈ వాదనలు చేస్తుండవచ్చుకానీ.. ప్రజల స్వప్నాలు సాకారం కావాలంటే సకలజనులంతా ఉద్యమస్ఫూర్తి కొనసాగించాలి. ఉద్యోగులు అవినీతికి పాల్పడకుండా పనిచేయాలి. రోజుకు రెండు గంటలు అదనంగా పని చేయాలి. తమ శాఖల పరిధిలో ఏం చేస్తే అభివృద్ధి జరుగుతుందో సూచించాలి. అమరుల త్యాగం ముందు... సబ్బండ వర్గాల సహకారం ముందు ఉద్యోగుల ఉద్యమం గొప్పది కాదు. ప్రజల ఆకాంక్షలు నెరవేరే దిశగా  ముందుకు సాగాలి.     
 - సురేష్ కాలేరు రాష్ట్ర ప్రచార కార్యదర్శి,
     తెలంగాణ ఉద్యోగుల సంఘం
 
 హమ్ సబ్‌కా తెలంగాణ...
 బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలవారి త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. 12 శాతం జనాభా ముస్లింల అభివృద్ధి గురించి ఆలోచించాలి.  విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను పది శాతానికి పెంచాలి. ‘రోటీ, కపడా, మకాన్’ లాంటి కనీస సదుపాయాలను కల్పించడంతో పాటు రాజకీయంగా 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. ప్రతి మండలంలో ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలి. యునాని ఆస్పత్రులను పెంచాలి. గల్ఫ్ బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు  ఉపాధి కల్పించాలి.  అప్నాహై తెలంగాణ... హమ్ సబ్‌కా తెలంగాణ
 - మహ్మద్ మునవర్ అలీ, కరీంనగర్
 
 వనరుల వినియోగంతో భవిత..
 నీటివనరులు, విద్యుత్ మీద దృష్టి సారి స్తేనే తెలంగాణకు ఉజ్వల భవిష్యత్. వ్యవసాయానికి, పరిశ్రమలకు ఈ రెండు మౌలిక వసతులు అవసరం. నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోగలిగితే తెలంగాణ  నిజంగానే  కోటిరత్నాల వీణగా మారుతుంది. కృష్ణ, గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలి. వైఎస్ హ యాంలో గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునేలా ఐదు భారీ, 12 మధ్యతరహా ప్రాజెక్టులను చేపట్టారు. జలవనరులను వినియోగించుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలను కల్పిం చాలి.     - కనుకుల యాదగిరిరెడ్డి, హైదరాబాద్

>
మరిన్ని వార్తలు